క్షయ… పెరుగుతోంది… ఆందోళనకరంగా… నిశ్శబ్దంగా కబళిస్తోంది… చాలా వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం… కరోనా అనంతర కాలంలో బాగా పడగవిప్పుతున్న వ్యాధి క్షయ… ఒకప్పుడు వ్యాధి సోకితే అంతే సంగతులు… కానీ మంచి పవర్‌ఫుల్ మందులు, మల్టీ డ్రగ్ థెరపీలు వచ్చాక మనిషి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు… కానీ కనుమరుగు కాలేదు అది… మళ్లీ జూలు విదిలిస్తోంది… ఇది అతి పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య.,.
క్షయ… ఈ పీడ మానవ చరిత్ర మొత్తంలో దాదాపు 100 కోట్ల మంది ప్రాణాలను తీసిందని ఒక అంచనా. క్షయ జబ్బు ఒక్కటే, మిగిలిన అన్ని రకాల అంటువ్యాధులూ కలిసి తీసుకునే మొత్తం ప్రాణాల కంటే ఎక్కువ ప్రాణాలను హరిస్తుంది. ఇది అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోటీ ఆరు లక్షల మంది క్షయ జబ్బుతో బాధపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 2022 ఒక్క సంవత్సరంలోనే 75 లక్షల మందిలో టిబి జబ్బును నిర్ధారించారు, 13 లక్షల మంది చనిపోయారు.
ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు అంటే, 200 కోట్ల మందికి క్షయ వ్యాధిని కలుగచేసే మైకోబాక్టీరియం ట్యుబర్ క్యులోసిస్ క్రిమి సోకినట్లు అంచనా. అయితే, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే పోషకాహార లోపం, డయాబెటిస్, హెచ్ఐవి, వృద్ధాప్యం, డయాలసిస్, స్మోకింగ్, దీర్ఘవ్యాధులు, అవయవాల ట్రాన్స్ ప్లాంట్స్ మరియు కొన్ని జబ్బుల చికిత్సకు స్టెరాయిడ్స్ వాడటం, కేన్సర్ తదితర పరిస్థితుల్లో మాత్రమే వారు క్షయ జబ్బు బారిన పడతారు.
క్షయకు మందులు అందుబాటులోకి రాకముందే, 19 వ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ జరుగుతూ వున్న అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టింది. దీంతో మందుల కన్నా జీవన ప్రమాణాల మెరుగుదలతో ఈ వ్యాధిని సమర్ధవంతంగా అదుపు చేయగలమని గుర్తించారు. పేదరికం వల్ల సరైన గాలి, వెలుతురు లేని గదుల్లో ఎక్కువమంది నివసించవలసి రావడం వంటి కారణాలతో క్షయ వ్యాధిగ్రస్తుల నుండి యీ క్రిమి వేరొకరికి తేలికగా సోకుతుంది. మొత్తం క్షయ వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నారు. దీనివల్ల కలిగే మరణాలలో 80 శాతం ఈ దేశాల్లోనే సంభవిస్తున్నాయి.
క్షయ వ్యాధి శరీరంలోని ఏ భాగానికైనా సోకవచ్చు. ఊపిరితిత్తుల పొర (ప్లూరా), లింఫ్ నోడ్స్, ప్రేవులు, స్వర పేటిక (లారింక్స్), ఎముకలు, వెన్నెముక, మెదడు, చర్మం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొదలైన వాటిలో దేనికైనా క్షయ సోకే అవకాశముంది. దాదాపు 80 శాతం మేరకు రోగులలో ఈ వ్యాధి ఊపిరితిత్తులలో తలెత్తుతుంది. క్షయ వ్యాధిలోని అనేక రకాలలో ఊపిరితిత్తుల క్షయ, లారింజియల్ క్షయ మాత్రమే గాలి ద్వారా వ్యాప్తి చెందగలవు. ఊపిరితిత్తులలో కాకుండా వేరే చోట తలెత్తే క్షయ వ్యాధిని ఎక్స్ ట్రా పల్మనరి టీబీగా పిలుస్తారు.
టీబీ వైద్యం ప్రారంభించిన ఒకటి రెండు వారాలలోనే ఈ క్రిమి ఇతరులకు సంక్రమించే అవకాశం తగ్గుతుంది. అనగా పేషెంట్స్, నాన్ ఇన్ఫెక్షస్ గా మారతారు. లేటెంట్ టిబి ఉన్న వారి నుండి ఈ క్రిమి ఇతరులకు సంక్రమించదు. కేవలం జబ్బుతో బాధపడుతున్న వారి నుండి మాత్రమే ఇతరులకు సంక్రమించ గలదు.
ఎయిడ్స్ వలెనే క్షయ వ్యాధి కూడా ప్రధానంగా శ్రామిక తరాన్ని పట్టి పీడిస్తుండడంతో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయి, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. హెచ్ఐవి మూలంగా ప్రపంచవ్యాప్తంగా క్షయ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో 27% మంది క్షయ జబ్బుతోనే మరణిస్తున్నారు.
చాలా సందర్భాలలో టిబి వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుంది. పేషంట్స్ లో సరైన అవగాహన లేక జ్వరం, దగ్గులకు దీర్ఘకాలం పాటు రకరకాల యాంటీబయోటిక్స్ వాడతారు. ఇంకా ఫార్మసీలలో దొరికే జ్వరం మాత్రలు, దగ్గు సిరప్ లను వాడుతూ వైద్యులని కలవడానికి జాగు చేస్తారు. దాంతో క్షయ జబ్బుకి సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఎక్సట్రా పల్మనరీ క్షయలో జబ్బు నిర్ధారణ మరింత క్లిష్టం అవుతుంది. ఈ జబ్బు నిర్ధారణకు 4 వారాల నుండి కొన్ని నెలల సమయం పడుతుంది.
క్షయ కారక క్రిమి ప్రత్యేక లక్షణాల రీత్యా 6 నెలల నుండి ఒకటిన్నర సంవత్సరాల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. వైద్యం ప్రారంభించిన 4-8 వారాలకు ఆరోగ్యం కొంత మెరుగుపడగానే, కొందరు రోగులు మందుల వాడకం ఆపేస్తారు. దీంతో కొంతకాలానికి వ్యాధి తిరగబెట్టి, అంతకు ముందు వాడిన మందులకు లొంగని విధంగా మారవచ్చు. మందులకు లొంగని ఈ రకమైన క్షయ జబ్బు (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టిబి – ఎండిఆర్ టిబి) ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది. ఇది ఇతరులకు తొందరగా సోకవచ్చు, బాగా ఖరీదైన మరిన్ని మందులు వాడాలి.
హెచ్ఐవి ప్రవేశంతో పారిశ్రామిక దేశాల్లో కూడా ఎయిడ్స్ వల్ల క్షయ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమస్య తీవ్రతను గుర్తించి 2018 లో క్షయవ్యాధిని ‘ప్రపంచ ఆత్యయిక స్థితి’ (గ్లోబల్ ఎమర్జెన్సీ) గా ప్రకటించింది. ఈ వ్యాధి చికిత్సకు వినూత్న విధానాలను ప్రవేశపెట్టి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది.
2022 అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీబీ రోగులలో 10% మందిలో హెచ్ఐవి వ్యాధి ఉంది. 2020 సంవత్సరంలో 214,000 మంది హెచ్ఐవి రోగులు క్షయ జబ్బుతో మరణించారు. సబ్ సహారా ఆఫ్రికా దేశాలలో టీబీ వ్యాధి గ్రస్తులలో 31.8% మందికి హెచ్ఐవి ఉంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి / ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో 30% నుండి 40% మంది క్షయ జబ్బుతో మరణిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం, ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశంలోనే అత్యధికంగా క్షయ జబ్బుతో బాధ పడుతున్న రోగులు వున్నారు. 2020లో, ప్రపంచం మొత్తం టిబి పేషంట్స్ లో 26% మంది భారతదేశంలోనే ఉన్నారు. 2021లో, భారతదేశం మొత్తం 19 లక్షల 33 వేల 381 మందిలో క్షయవ్యాధి నిర్ధారించారు.
2021 లో భారతదేశంలో లక్ష మంది జనాభాకు 210 మంది ఏటా కొత్తగా క్షయ జబ్బుకి గురయ్యారు. సంపన్న దేశం అమెరికాలో ప్రతి లక్ష మంది జనాభాలో ముగ్గురు మాత్రమే క్షయ వ్యాధికి గురవుతున్నారు. క్షయ అత్యంత ప్రబలంగా ఉన్న దక్షిణాఫ్రికాలో లక్ష మంది జనాభాకు 1000 మంది క్షయ జబ్బు బారిన పడుతున్నారు. అయితే, కొంత ఊరటనిచ్చే విషయం ఏమంటే, ఇండియాలో ఆరోగ్య రంగం కొంత మెరుగ్గా ఉండటంతో టీబీ మరణాల విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
ప్రతి ఏటా క్షయ జబ్బును గురించి ప్రపంచ ప్రజలను జాగృత పరచడానికి మార్చి 24 న ‘ప్రపంచ టిబి డే’ గా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అవును, మనం క్షయను అంతం చేయగలం’ నినాదంతో ఈ జబ్బు లక్షణాలు వున్నవారు తగిన వైద్య సహాయానికి ముందుకు వచ్చి ఆరోగ్యం పొందాలని నినదిస్తున్నారు. 2023 సెప్టెంబర్ లో క్షయ జబ్బుకి మెరుగైన వాక్సిన్ రూపొందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం చేపట్టింది.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలూ, డాక్టర్లూ క్షయవ్యాధి యొక్క తీవ్రతను గుర్తించి ప్రజలకు తగినంత అవగాహన కలిగించడానికి మరింత కృషి చేయాలి. ప్రభుత్వం కూడా క్షయ నివారణ పథకాలను మరింత కట్టుదిట్టంగా అమలు పరచాలి. టిబిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా చేసిన గట్టి ప్రయత్నాల వల్ల 2000 సంవత్సరం నుండి 7 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలను రక్షించారు…. డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ
Share this Article