టీసీఎస్, ఇన్ఫోసిస్… రెండూ జోడు గుర్రాల్లాగా… నువ్వు ముందా, నేనా అన్నట్టుగా రన్నింగ్ రేసులో ఇద్దరు అథ్లెట్లను తలపించే పరుగు పందెం కొనసాగిస్తున్న రోజులవి. ప్రొఫెషనల్ రైవల్రీతో ఢీ అంటే ఢీ అంటున్న కాలంలో… సరిగ్గా, 2004లో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ లో జంషెడ్జీ టాటా రూమ్ పేరుతో ఒక వింగ్ ను ప్రారంభించాలనుకున్నారు. అందుకు, రతన్ టాటాను ఆహ్వానించేందుకు వెళ్లిన నారాయణమూర్తికి… రతన్ టాటా నుంచి ఎదురైన ఓ ప్రశ్న ఒకింత ఆశ్చర్యపర్చింది. అయితే, అదే సమయంలో నారాయణమూర్తి ఇచ్చిన సమాధానం కూడా టాటాను అంతే సంతృప్తి పర్చిందట.
రతన్ టాటా గురించి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి షేర్ చేసుకున్న ఈ కథ కొంత ఆసక్తి రేకెత్తించేది. టీసీఎస్ మీ ప్రత్యర్థి కంపెనీ… మీరు నన్నెందుకు ఆహ్వానిస్తున్నట్టు… అసలు మీ ఇన్ఫోసిస్ లో ఓ వింగ్ కు జంషెడ్డీ టాటా పేరు ఎందుకు పెడుతున్నట్టని అడిగారట నారాయణ మూర్తిని రతన్ టాటా.
జంషెడ్జీ టాటా దేశభక్తి కల్గినవాడు.. ఆయన స్థాపించిన కంపెనీల చరిత్ర.. మా అందరికీ ఆదర్శం.. ఆయనతోగానీ, ఆయన కంపెనీలతోగానీ మేం పోటీదారులమని భావించడం లేదు.. పోటీ ఏదైనా ఉన్నా అది వ్యాపారం వరకేగానీ.. జంషెడ్జీని గౌరవించుకోవడం కనీస ధర్మం.. అందుకు, ఆయన పేరిట ఇన్ఫోసిస్ లో ఏర్పాటు చేసిన వింగ్ ఓపెనింగ్ కు రతన్ టాటా అయితేనే సరైన వ్యక్తని మేము భావించాం. కాబట్టి, మీరు మా ఆహ్వానాన్ని మన్నించాలి అన్నారట నారాయణ మూర్తి. ఇంకేం, ప్రశ్నైతే అడిగారు కానీ.. పోటీ కంపెనీ అని రాను అనేంత తక్కువ స్థాయి వ్యక్తా టాటా..? నారాయణ మూర్తి ఆహ్వానాన్ని అంగీకరించేశారు.
Ads
ఆ వేడుక జరిగిన రోజు కూడా టాటా ఎలా ఉండేవారనే అంశాలనూ మూర్తి ప్రస్తావించారు. టాటా ఎంత నిరాడంబరుడో, అంత సిగ్గరి కూడా. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం నచ్చదు. అందుకే, నాటి ఆ కార్యక్రమంలో కూడా సంక్షిప్తమైన తన సందేశాన్నిచ్చేందుకే పరిమితమై.. వచ్చి తన సీటులో తాను కూర్చున్నారంటారు మూర్తి.
టీసీఎస్ వర్సెస్ ఇన్ఫోసిస్!
టీసీఎస్ తో పోలిస్తే… ఇన్ఫోసిస్ అనే ఐటీ కంపెనీ కాస్త వెనుకబడే ఉంది. అంటే నంబర్ వన్ పొజిషన్ లో టీసీఎస్ ఉంటే.. పరుగుపందెంలో ఇన్ఫోసిస్ ర్యాంక్ నంబర్ టూ. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ గనుక లేకపోయుంటే… ఇన్ఫోసిస్ టీసీఎస్ కంటే కూడా పోటీలో ముందుండేదనే విషయాన్నీ మూర్తి తెలిపారు. ఆ విషయం టాటాకు కూడా తెలుసునని.. కానీ, ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా టాటా తమ ఇన్విటేషన్ ను మన్నించారంటారు మూర్తి. ఇన్ఫోసిస్ ఒక కంపెనీగా ఎదగడంలోనూ టాటాల ప్రభావం ఉందంటారాయన.
వృత్తిపరంగా ఎంత పోటీ ఉన్నా… వ్యక్తిగతంగా పరస్పర గౌరవం ఎలా కల్గి ఉండేవారనేందుకు టాటా, నారాయణ మూర్తి కథ ఓ ఉదాహరణ. 2020లో ముంబైలో జరిగిన TiEcon కాన్ క్లేవ్ లో స్వయానా నారాయణ మూర్తే టాటాకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించారు. అదే సభలో టాటా కాళ్లను టచ్ చేస్తూ నారాయణ మూర్తి నమస్కారం చేయబోతే టాటా అడ్డుకున్నారు. టాటా తనకు చిరకాల మిత్రుడు, సహచరుడని చెప్పుకొచ్చి.. పోటీ కేవలం వృత్తిపరంగానే కానీ, వ్యక్తిగతంగా కాదనే విషయాన్నీ కుండబద్ధలు కొట్టారు.
86 ఏళ్ల వయస్సులో రతన్ టాటా మరణంతో యావత్ ప్రపంచ దిగ్గజాలెందరో సంతాపాన్నీ, తమ దిగ్భ్రాంతినీ వ్యక్తపర్చగా.. నారాయణ మూర్తి కూడా టాటాతో తన మెమరీస్ ని నెమరు వేసుకున్నారు. టాటా అంటే కేవలం విజయమే కాదు! వినయం, పట్టుదల,మర్యాద, దేశభక్తి ఇవన్నీ.. టాటాకు పర్యాయపదాలంటూ గుర్తు చేసుకున్నారు…. (రమణ కొంటికర్ల)
Share this Article