ఏబీకే ప్రసాద్… తెలుగు జర్నలిజంలో ఘనుడు… కానీ ఒకప్పుడు… ఇప్పుడు కేవలం ఓ కాలమిస్టు… అదీ వైసీపీ సానుకూల వ్యాసాలు మాత్రమే రాసుకునే అనుకూలమిస్టు… తన జర్నలిజం కెరీర్‌లో బోలెడు మంది ముఖ్యమంత్రులను, లీడర్లను చూశాడు, పరిశీలించాడు… కానీ ఇప్పుడాయనకు జగన్ మాత్రమే కీర్తించదగిన లీడర్‌గా కనిపిస్తున్నాడూ అంటే… అది ఆయన ఇష్టం… కేవలం అదే కోణంలో సాగే వ్యాసాలు సాక్షికి అవసరం కాబట్టి… సాక్షికి ఆయన ఇష్టుడు… ఇక్కడివరకే…
ఎడిటోరియల్ వ్యాసాలు చదివే పాఠకులెవరున్నారు ఇప్పుడు..? ఏదో ఇలాంటి సుదీర్ఘ వ్యాసరత్నాలు ఏవో ఒకటి పేజీలో పెట్టాలి కాబట్టి, పేజీ నింపాలి కాబట్టి, అదీ జగన్ సానుకూల వ్యాసాలే అయిఉండాలి కాబట్టి… ఏబీకే వ్యాసాలు యథాతథంగా సాక్షిలో అచ్చేస్తారు… అంతే… అందుకే తను జర్నలిస్టును అని కూడా చెప్పుకోడు పాపం ఆయన… చెప్పడు గానీ ఆయన జస్ట్, ఓ వ్యాసుడు మాత్రమే… (ఎడిటోరియల్ వ్యాసాల్లో జనం కాస్త చదివేది ఆంధ్రజ్యోతిలో వచ్చే రాధాకృష్ణ విరచిత కొత్తపలుకు మాత్రమే… కొందరు తిట్టుకుంటూ, కొందరు మెచ్చుకుంటూ… నిజానికి జనం దృష్టికోణంలో ఈ కాలమ్స్ ఎప్పుడో కాలమ్ చెల్లిన పాత్రికేయ ప్రయోగం…)
గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ మీద ఆయన ఆహా ఓహో అని రాసేశాడు… వీళ్లు అచ్చేశారు… కానీ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులకు, కాలమిస్టులకు, వ్యాసులకు ఇది నచ్చలేదు… అంతటి ఏబీకే ఇంత నాసిరకం కాలమ్ రాయడం ఏమిటి అని కస్సుమంటున్నారు సోషల్ మీడియాలో…! ‘‘ఏమయ్యా… విశాఖను, అలాగే ఆంధ్రను పెట్టుబడులు వరించేశాయా..? రాష్ట్రానికి పారిశ్రామిక వరద వచ్చేసిందంటావా…? ఒక పార్టీ పట్ల అంతులేని విషం …. ఇంకో పార్టీ పట్ల అమృతమంత ప్రేమా బహిరంగంగా ఒలకబోసే ఈయన జర్నలిస్ట్ అని ఎలా అంటారో మా బుర్రలకు అర్ధం కాదు.
Ads
అసలు జర్నలిస్టు అనే పదానికి సరైన నిర్వచనం ఏమీ ఉండదు… నిష్పక్షపాతి అనే పర్యాయపదం అస్సలే కాదు… వర్తమానంలో ప్రతి జర్నలిస్టూ రంగులు పూసుకున్నవాడే… పత్రిక, చానెల్‌ను బట్టి, వాటి పొలిటికల్ లైన్లను బట్టి, వాటి బాసుల పార్టీలను బట్టి… ఏదో ఓ పార్టీ రంగు చొక్కా వేసుకునేవాడే… జర్నలిస్టులే అలా ఉన్నప్పుడు… జర్నలిజమే అలా ఉన్నప్పుడు… ఖచ్చితంగా ‘దండె కొట్టే’ కాలమిస్టులు నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు..? ఆయనేదో ఈ వయస్సులో పొద్దుపోక ఏదో రాస్తాడు… వీళ్లు కళ్లకద్దుకుని అచ్చేస్తారు… కానీ చదివేదెవరు..? ఈమాత్రం దానికి ఆయన్ని తిట్టిపోయడం దేనికి..?!
Share this Article