ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తుచేసుకొండి… అపరిమితమైన ప్రజాభిమానం ఉన్న నాటి ఎన్టీయార్‌నే దింపేసి, తను పగ్గాలు చేపట్టి, జనం మ్యాండేట్ కూడా తీసుకుని, పార్టీలో ఇక ఎవరూ ఎదురుచెప్పకుండా పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న ఆనాటి రోజులు… చివరకు ఆ ఎన్టీయార్ సైతం చేష్టలుడిగాడు, చివరకు తనే వెళ్లిపోయాడు…
ముందుగా తన కులం, తన పార్టీ విశ్వాసం పొందడంలో చంద్రబాబు విజయం మామూలుది కాదు… ఎన్టీయార్ కుటుంబసభ్యులందరినీ డమ్మీల్ని చేసి, షడ్డకుడి చుట్టూ పరిమితులు పెట్టి… పార్టీలోనూ ఎవరూ ఎదురు మాట్లాడకుండా చేయడం ఓ సంక్లిష్ట విజయం… తరువాత విజయం జగన్ మీద… నిజానికి రాష్ట్ర విభజన వేళ జగన్ పట్ల ఆదరణ కనిపించేది… చంద్రబాబు డబుల్ గేమ్‌తో విశ్వసనీయతను కోల్పోయినట్టు కనిపించేది… తీరా చూస్తే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడు…
సరే, తన పాలన వైఫల్యాలతో జనాదరణ కోల్పోయాడు… మరీ 23 సీట్లకు జనం దిగ్గొట్టారు… జగన్ కూడా వైఎస్ కాదు కదా… వైఎస్ కొంత బెటర్ డెమొక్రటిక్… జగన్ అలా కాదు… తెలుగుదేశాన్ని వరుస దెబ్బలు కొడుతూ పోయాడు… కమ్మ కులాన్ని టార్గెట్ చేశాడు… ఫీల్డ్‌లో తన కులస్థుల దాష్టీకాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా… టీడీపీ కేడర్‌పై వేల కేసులతో తొక్కుతూ పోయాడు… ఒక దశలో అసలు టీడీపీ ఉంటుందా అనే పరిస్థితి…
Ads
అమరావతి, పోలవరం వంటి ఎన్నో పాలన వైఫల్యాలు… ఈ స్థితిలోనూ ‘పంచుడు పథకాలే’ తనకు శ్రీరామరక్ష అనుకుని ఆర్థిక సమర్థ నిర్వహణను గాలికి వదిలేసి… జనానికి అందుబాటులో లేక, చివరకు తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలకు కూడా దొరక్క తనదైన ‘అరాచకాన్ని’ ఎంజాయ్ చేశాడు… ఇదీ నా పాలన విజయం అని చెప్పుకోవడానికి ‘చెప్పుకోదగిన’ చిత్రం ఏమీ లేదు… ఐనా ప్రత్యర్థిని చావు దెబ్బ తీస్తున్నాననే భావనతో చివరి దెబ్బగా చంద్రబాబును జైలులోకి కూడా తోశాడు… ఇంత చేసినా సరే, చంద్రబాబు తన పార్టీని కాపాడుకున్నాడు… ఎస్, ఇది ఎన్టీయార్ కాలం నాటి తన విజయంకన్నా ఎక్కువ…
తన వారసుడు అంతగా రాణించలేకపోతున్నా… తన యువగళం పెద్దగా ఆదరణను పెంచలేకపోయినా… చంద్రబాబు దాన్ని ఓ పెద్ద విషయంగా తీసుకోలేదు… రేప్పొద్దున తనే మెల్లిగా పికప్ అవుతాడులే అనుకున్నట్టున్నాడు… యువగళం ముగింపు సభ కూడా బ్రహ్మాండంగా జరిగింది… అఫ్‌కోర్స్, ఇలాంటి సభల్ని ఒంటిచేతితో ఇంతకు మూణ్నాలుగు రెట్ల జనంతో నిర్వహించే కేసీయార్ చివరకు ఏమయ్యాడు..? చతికిలపడ్డాడు… సో, జనసమీకరణ ప్రధానం కాదు… అంత జనం వచ్చినంత మాత్రాన లోకేష్‌కు యాక్సెప్టెన్సీ వచ్చేసినట్టు కూడా కాదు…
జగన్ వ్యతిరేక వోటు చీలకుండా పవన్ కల్యాణ్‌తో అధికారికంగా పొత్తుకు సిద్దమయ్యాడు చంద్రబాబు… సేమ్ కేసీయార్, తన లబ్ధి కోసం గొంగళిపురుగునైనా ముద్దాడతాడు… బీజేపీని తమ ఫోల్డ్‌లోకి తెచ్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు చంద్రబాబు… ఐతే అంతిమంగా మళ్లీ గెలుస్తాడా..? సీఎం అవుతాడా..? జగన్ అంత తేలికగా తలవంచుతాడా..? పవన్‌తో పొత్తు టీడీపీకి ఫాయిదా ఇస్తుందా అనే ప్రశ్నలకు రాబోయే ఎన్నికలు సమాధానం చెబుతాయి… కానీ…
కానీ… చంద్రబాబు నిలబడ్డాడు… తనను, తన పార్టీని కాపాడుకున్నాడు… జగన్ ఈ రాజకీయాన్ని కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా మార్చేస్తే… తనూ తగ్గకుండా తన కులాన్ని చెదిరిపోకుండా తన వెంట ఉంచుకున్నాడు చంద్రబాబు… ఇది విజయమే… ఈ టెంపోను ఇలాగే సీఎం కుర్చీ దాకా తీసుకుపోతాడా..? కాలమే జవాబు చెప్పాలి…!!
Share this Article