డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్…
ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను…
మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు…
Ads
‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’
‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’
12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి రావల్సి వచ్చింది…’
‘రోజూ నడిచి వస్తావా..? అదీ సెంట్రల్ స్టేషన్ నుంచి మైలాపూర్ వరకు 8 కిలోమీటర్లు…!’
సార్ కళ్లలో తడి నాకు స్పష్టంగా కనిపించింది…
‘అవును సార్, ఆరు నెలలుగా నాకు ఈ నడక తప్పడం లేదు… ట్రామ్ పాస్ ఖరీదు చేసే స్థోమత లేదు సార్, 5.25 రూపాయలు చేశారు…’
సుబ్రహ్మణ్యం సార్ ప్యూన్‌ను పిలిచాడు, 10 రూపాయలు ఇచ్చాడు, ముందు ఇతనికి ఓ పాస్ కొనివ్వు అన్నాడు… బ్యాలెన్స్ ఇవ్వబోతే, నీ పాకెట్ మనీగా ఉంచుకో అన్నాడు…
‘మీ నాన్నను ఇక ఇబ్బందిపెట్టకు, నీకేమైనా డబ్బు అవసరముంటే నా క్వార్టర్స్‌కు వెళ్లు, నేనున్నా లేకపోయినా డ్రాయర్ ఓపెన్ చేయి, చెక్ బుక్ ఉంటుంది, సంతకాలు పెట్టి ఉంటాయి… అమౌంట్ రాసుకో, డ్రా చేసుకో’
ఆయనెవరు..? నేనెవరు..? ఈ నమ్మకం ఏమిటి..? ఈ ప్రేమ ఏమిటి..? అసంకల్పితంగా కళ్లు వర్షిస్తున్నాయి…
ఆయన ఔదార్యం అక్కడితో ఆగలేదు, 1948లో సుబ్రహ్మణ్యం సార్ నన్ను హాస్టల్‌లో చేర్పించాడు… మూడు నెలల ఫీజు ఒకేసారి చెల్లించేశాడు… ఎగ్జామ్ ఫీజు కూడా…
1951లో ఎకనమిక్స్ ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఎప్పుడు కలిసినా సరే 10 రూపాయల్ని జేబులో పెట్టేవాడు…
1955 జూన్… కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మిషన్ విద్యాలయ ఎడ్యుకేషన్ కాలేజీలో చేరాను… తనకు లేఖ రాశాను…
‘సర్, నా శాలరీ 185… హాస్టల్ ఖర్చులన్నీ పోను 25 రూపాయల దాకా మిగులుతున్నాయి… సార్, మీ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయినీ రాసి పెట్టాను… మొత్తం 350… సో, 14 నెలల్లో మీ సొమ్ము మొత్తం చెల్లించేస్తాను, అనుమతించండి ప్లీజ్’
అప్పటికే ఆయన రిటైరయిపోయి, నాగపట్నంలో రైతుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నాడు… ప్రశాంతంగా బతుకుతున్నాడు…
వారం తరువాత నాకు రిప్లయ్ వచ్చింది…
‘మై డియర్ సన్ షణ్ముగం, తండ్రి పెట్టిన ఖర్చును కొడుకు తిరిగి చెల్లించే పనేముంటుంది..? సుఖంగా బతుకు, ఈ డబ్బు గురించి వదిలెయ్’… ఆ లేఖ చదువుతూ ఎన్నిసార్లు ఏడ్చానో…
మరేం చేయాలి… రుణం తీర్చుకోవాలి… అందుకే నాలాంటి పేద పిల్లల్ని వెతికాను, వాళ్లను నేను డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాను… మా సార్ రుణం తీరిపోతోంది మెల్లిమెల్లిగా… దీనికి అంకెల లెక్కల్లేవు… అదొక ఉద్వేగం…
(ఇది రాసింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైరైన టీచర్… ఇప్పుడు పెరంబూరులోని ఆ అకాడమీకి ఎడ్యుకేషనల్ అడ్వయిజర్…)(ఓ ఇంగ్లిష్ న్యూస్ స్టోరీకి ఇది నా తెలుగు అనువాదం…)
Share this Article