.
( రమణ కొంటికర్ల ) ……. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ ఆశ్చర్యపర్చిన ఘటనల తాలూకు పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడు.. అదే స్థాయి ఫన్ క్రియేట్ చేస్తాయి. విపరీతమైన వెటకారానికీ ఆస్కారమిస్తాయి. అలాంటి పోస్ట్ గురించే మనమిప్పుడు చెప్పుకోబోతున్నాం.
ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఓ విద్యార్థిని, తన స్కూల్ టీచర్ కు తన హోం వర్క్ గురించి పెట్టిన ఈ మెయిల్ కు… ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత రిప్లై రావడంతో.. ఈ సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరలైపోయింది.
Ads
అమృత్ సర్ కు చెందిన ప్రేక్ష మహాజన్ 2016లో తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు తన కంప్యూటర్ టీచర్ కు ఓ మెయిల్ పంపింది. మేడం, నమస్తే, నేను ప్రేక్ష మహాజన్, సెవెంత్ క్లాస్ H బ్యాచుకు చెందిన విద్యార్థినిని. నేనో పువ్వును అడాబ్ ఇల్లస్ట్రేటర్ లో తయారు చేశాను. అదెలా ఉందో కాస్త చూసి చెప్పండి టీచర్ అంటూ మెయిల్ పెట్టింది. సరిగ్గా 2016, జూన్ 30వ తేదీన ఈ మెయిల్ పంపింది ప్రేక్ష మహాజన్.
అయితే, దానికి తాపీగా తొమ్మిదేళ్లకు.. అంటే, సుమారు దశాబ్దం తర్వాత, 2025, మొన్నటి మార్చి ఒకటిన తన టీచర్ నుంచి సమాధానం అందింది.
పువ్వు చాలా బాగుంది. అందంగా డిజైన్ చేశావు. ఈ మెయిల్ చూసి ఆలస్యంగా స్పందించినందుకు క్షమించగలవు అన్నట్టుగా ఆ టీచర్ రిప్లై పంపింది.
ఆ రిప్లైని మళ్లీ ప్రేక్ష మహాజన్ సరదాగా Xలో పోస్ట్ చేసింది. ఓ పోస్ట్ కాస్తా ఇప్పుడు ఫన్ జనరేట్ చేస్తూ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.
ఇక్కడ పోస్ట్ లింక్ చూడండి:
https://x.com/MahajanPreksha/status/1895862221500260362
దానికి నెటిజన్స్ నుంచి వచ్చిన సమాధానాలు కూడా భిన్నరకాలుగా ఉండటంతో ఓ పెద్ద చర్చకు తావిచ్చింది ఈ మెయిల్ పోస్ట్.
ఇప్పుడు నా పాత మెయిల్సన్నీ నేను ఇక తనిఖీ చేయబోతున్నాను… ఎవరికి తెలుసు, బహుశా నా చిన్ననాటి ప్రేమికుడు కూడా ఏదైనా మెయిల్ పంపి ఉంటాడేమోనన్నట్టు ఒకరు స్పందిస్తే… మరో మెయిల్ లో 2018లో నా లీవ్ కోసం అప్లై చేసిందానికి నా బాస్ కూడా స్పందించి ఉంటాడేమో చూసుకోవాల్సి ఉందంటూ ట్వీటారు.
ఓసారి మా పాఠశాల లైబ్రేరియన్ నుంచి బుక్ లో ఎంట్రీ చేయించి తీసుకున్న బుక్ తిరిగివ్వడానికి నాల్గేళ్ల సమయం పట్టింది. వీటికీ అలాగే సమయం పడుతుందేమో మరి అంటూ ఒకరు స్పందిస్తే.. మీ టీచర్ సమాధానం ఇవ్వడానికి బహుశా సరైన సమయం కోసం వేచి ఉండొచ్చంటూ మరొకరు వెటకారం దట్టించారు.
మీ హోం వర్క్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందనే ఉద్దేశ్యంతోనే మీ స్కూల్ టీచర్ రిప్లైకి ఇంత సమయం తీసుకుందేమోనని ఒకడంటే.. మరొకరు బహుశా ఇన్నేళ్ల తర్వాత మీ టీచర్ ఈమెయిల్స్ కోసం పెట్టుకున్న రీమైండర్ ట్యూన్ వినిపించిందేమోనంటూ సెటైర్ వేశారు.
ఇంకొందరు ఇప్పటికైనా స్పందించిందంటూ ట్వీటితే… అసలే సమాధానం ఇవ్వకుండా ఉండేకంటే.. ఇప్పటికైనా స్పందించడం బెటరే కదా అంటూ మరొకరు అభినందించినవారూ ఉన్నారు. మొత్తానికి ఎప్పుడో రాసిన ఈమెయిల్ కు.. తొమ్మిదేళ్ల తర్వాత ఇచ్చిన రిప్లైతో.. ఓ స్టూడెంట్, టీచర్ మధ్య సాగే హోంవర్క్ డిస్కషన్ కాస్తా ఇన్నేళ్లకు సోషల్ మీడియాలో ఓ ఫన్ టాపికై కూర్చుంది…
Share this Article