విరాట్ కోహ్లీపై దేశమంతటా ప్రశంసల వర్షం… ప్రజలందరిదీ ఒకే ఎమోషన్… ప్రపంచకప్ వస్తే ఎంత..? పోతే ఎంత..? కానీ పాకిస్థాన్ మీద మ్యాచులో మాత్రం గెలవాలి… క్లిష్టమైన స్థితిలో ఆ గెలుపును తీసుకొచ్చి, దేశ ప్రజలకు, క్రికెట్ ప్రేమికులకు దీపావళి కానుకగా ఇచ్చాడు కోహ్లీ… కానీ ఎన్నాళ్లుగానో గూడుకట్టుకున్న ఏదో బాధ ఒక్కసారిగా బద్ధలైనట్టుంది… కన్నీరు ఆపుకోలేకపోయాడు… నిజానికి కోహ్లీ కంటనీరు అనేది చాలా అరుదైన విషయం… అంటే ఇప్పటిదాకా ఎంతటి బాధను లోలోపల అనుభవించాడో అనడానికి అదే తార్కాణం…
ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే ఇది గమనించిన వెంటనే చేసిన వ్యాఖ్య… ‘‘నేను కోహ్లీని చాలా ఏళ్లుగా గమనిస్తున్నాను… ఎప్పుడూ తన కళ్లల్లో నీళ్లు చూడలేదు… మొదటిసారి చూశాను… మరిచిపోలేను…’’ చాలామంది కోహ్లీ అభిమానులు, భారత క్రికెట్ అభిమానులు భోగ్లే వ్యాఖ్యనే ట్వీట్లు, పోస్టులుగా షేర్ చేసుకుంటున్నారు… నిజంగా ఎంత స్ట్రెయిట్‌గా చెప్పాడు…
నిజానికి పాకిస్థాన్ చేసింది పెద్ద చాలెంజబుల్ స్కోరేమీ కాదు… 159 గొప్ప స్కోర్ కాదు… కానీ ఆస్ట్రేలియన్ పిచ్చులపై కొన్నిసార్లు అదే పెద్ద స్కోర్… 10 ఓవర్లలో 45 రన్స్ 4 వికెట్ల నష్టానికి… ఈ స్థితిలో ఇండియాకు ఇక ఆశలేముంటయ్… కానీ హఠాత్తుగా పాత కోహ్లీ తిరిగొచ్చాడు… పాత కోహ్లీ అంటే తెలుసు కదా… చేజింగ్లో పరుగుల్ని నిర్దయగా వేటాడే సింహం… ఆ ఆట చూడాలే తప్ప వర్ణించలేం… ఎన్నో సార్లు చూశాం కూడా… అది టెస్టయినా సరే, వన్డే అయినా సరే, టీ20 అయినా సరే… ఆ కోహ్లీ నేడు క్రీజులో మళ్లీ కుదురుకుని ఇక ఆడటం, వేటాడటం మొదలుపెట్టాడు… మళ్లీ ఆ పాత కోహ్లీని చూశాం…
Ads
దెబ్బకు గెలుపు కాళ్ల దగ్గరకొచ్చి పడింది… కానీ ఈ ఇన్నింగ్స్ దాకా తనకు ఎన్ని అవమానాలు… కోహ్లీకి సొంత జట్టు పెద్దల నుంచే విమర్శలు… ప్రత్యేకించి గంగూలీ బ్యాచ్… పైగా క్రికెట్ అభిమానుల వెక్కిరింతలు… ఇక కోహ్లీ పని అయిపోయింది, ఐనా వేలాడుతున్నాడనే సూటిపోటీ మాటలు… ఫామ్ కోల్పోవడం అనేది ప్రతి క్రికెటర్ కెరీర్‌లో చూసేదే… కానీ కోహ్లీ కెరీర్‌లో ‘ఫామ్ లేకపోవడం’ అనే దశ ఎక్కువ గ్యాప్ తీసుకుంది… ఇదే పాకిస్థాన్ మీద అంతకుముందు కప్ లో కోహ్లీ టీమ్ ఓడిపోతే, కోహ్లీ కూతురి మీద కూడా trolling, comments, బూతులకి దిగారు కొందరు వెధవలు… వేరే వాళ్లయితే కథ ఎలా ఉండేదో గానీ కోహ్లీ కాబట్టి ప్రొటెక్ట్ చేశారేమో… తను కాబట్టి తట్టుకుని నిలబడ్డాడేమో…
ఆ పాత కోహ్లీకి మరోసారి దేశమంతా చప్పట్లు చరిచే భాగ్యమేదో బాకీ ఉన్నట్టుంది… అందుకే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు… అదీ పాకిస్థాన్ మీద… అందుకే దేశం మరోసారి సాహో అంటోంది… ఇన్నాళ్ల తన గ్రహపీడ ఏదో విరగడ అయినట్టుగా… ఏదో కనిపించని చీకటి పగిలిపోయినట్టుగా… కోహ్లీ బరస్టయ్యాడు… ఆ కన్నీటి చుక్కలు అవే… లేకపోతే కోహ్లీ కంట నీరేమిటి..? అది సింహం… అది ఏడవకూడదు… ఇప్పటికిప్పుడు బ్యాట్ పక్కనపారేసి, నిష్క్రమించాల్సి వచ్చినా సరే… ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలదా ఏం..?
Share this Article