ఇది ఖచ్చితంగా ఆది తప్పే… ఆది అంటే పినిశెట్టి ఆది కాదు… సాయికుమార్ కొడుకు ఆది… పుడిపెద్ది ఆది… పీజే శర్మ మనమడు… నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తనకు బాబాయ్… మంచి నటనకు, మంచి వాయిస్ ఓవర్‌కు పెట్టింది పేరైన ఆ కుటుంబంలో ఆది ఓ హిట్ కోసం తన్నుకుంటున్నాడు పదకొండేళ్లుగా… తను ఏదో తక్కువ చేస్తాడని కాదు… తన మ్యాగ్జిమం ఇస్తాడు… కానీ ఓ శాపగ్రస్తుడు…
తీసిన సినిమాలన్నీ ఫట్… మరీ కొన్నాళ్లుగా ఇంకా ఎక్కువ… ఇలాంటి సమయాల్లో ఏ సినిమా ఎంపిక చేసుకోవాలనే అంశంలో జాగ్రత్త అవసరం… పెద్ద పెద్ద హీరోలే మాస్, రొటీన్ ఫార్ములా, రుద్దుడు, బిల్డప్ స్టోరీలు తీస్తే మట్టిగొట్టుకుపోతున్నయ్… జనం ఈడ్చి తంతున్నారు… ఏదో ఓ పిచ్చి కమర్షియల్ వాసనలతో ఓ సినిమా తీసి వదిలితే జనం చూస్తారనేది ఓ మూర్ఖమైన భ్రమ… మరీ ప్రస్తుతం ప్రేక్షకుడి టేస్ట్ మారిపోయిన నేపథ్యంలో, థియేటర్లంటేనే మొహం చాటేస్తున్న రోజుల్లో తను ఎన్నుకున్న కథేమిటి..?
Ads
నిఖిల్ వంటి చిన్న హీరోలు సైతం కొత్త కథలతో దేశమంతా దుమ్మురేపుతుంటే, ఇంకా ఆది సాయికుమార్ ఏ రోజుల్లో ఉండిపోయాడు..? అవకాశాల్లేని నటిలాగా మరీ ఈ తీస్‌మార్‌ఖాన్ సినిమా బరితెగించినట్టుగా ఉంది… ఆ పాటలు చూస్తుంటే మరీ వెగటుగా ఉన్నయ్… అసలే పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్… ఒక పాటలోనైతే వ్యాంపుకన్నా అధ్వాన్నంగా కనిపించింది… ఆ డైరెక్టర్, ఆ నిర్మాతల టేస్టు సరే… కనీసం తనను నటుడిగా మరింత దిగజారుస్తుందనే సోయి ఆదికైనా ఉండాలిగా… పైన ఫోటో చూస్తే అర్థమవుతోందిగా… (ఇలాంటి గలీజు ఫోటోను పెట్టాల్సి వచ్చినందుకు క్షమించండి)…
ఓ స్టూడెంట్, పోలీస్ కావాలనుకుంటాడు… ఓ సిస్టర్ సెంటిమెంట్… పోలీస్ అవుతాడు… కానీ సిస్టర్, బావ హత్యలతో కథ మలుపు తిరుగుతుంది… సినిమా కథ కాస్తా ఈ సెంటిమెంట్ నుంచి మరో దారిలోకి వెళ్తుంది… ఎటు పోతుందో, ఎక్కడ ఆగి, శుభం కార్డు పడుతుందో దర్శకుడికైనా ఐడియా ఉందానేది డౌటే… ఇంకా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడం స్పేస్ వేస్టు… ఫాఫం ఆది అని జాలిపడటం తప్పితే ఇంకేమీ లేదు… లేదు… ఏమండీ సాయికుమార్… నీ గైడెన్స్ కూడా లేదా నీ కొడుక్కి..?!
Share this Article