ఆ విక్కీ కౌశల్, కత్రినాల పెళ్లి వార్తలు పెద్ద ఆసక్తికరంగా ఏమీ లేవు… ఏముంది..? అట్టహాసం, ఆడంబరం, భారీ ఖర్చు, హంగామా, దుబారా, సాధారణ జనానికి ఇబ్బందులు… ఆఫ్టరాల్ ఓ హైప్రొఫైల్ పెళ్లి, అంతకుమించి ఏముంది..? కానీ అంతకుమించి మహాటట్టహాసంగా జరుగుతుందని అంచనా వేసిన మరో పెళ్లి మాత్రం చాలా లోప్రొఫైల్‌లో ఢిల్లీ సైనిక్ ఫామ్స్‌లో జరిగిపోయింది… వరుడు బీహార్ ప్రతిపక్ష నేత, లాలూ రాజకీయ వారసుడు, ఆర్జేడీ పార్టీ చక్రధారి తేజస్వి యాదవ్… వధువు రేచల్ అలెక్సిస్… జస్ట్, యాభై మంది వరకు మాత్రమే హాజరయ్యారు… ఒక్క అఖిలేష్ యాదవ్ మినహా ఇంకెవ్వరూ రాజకీయ నాయకులు, వీవీఐపీలు లేరు, రాలేదు, పిలవలేదు, పిలవాలని అనుకోలేదు… (ఎస్పీ, ఆర్జేడీ చుట్టపు పార్టీలు కదా…)
ఇంతకీ ఎవరామె..? తేజస్వితోపాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది… (తేజస్వి స్కూల్ డ్రాపవుట్…) తరువాత దోస్తీ, ఆ తరువాత ప్రణయం… అరేడేళ్లుగా కలిసి తిరుగుతున్నారు… పొలిటికల్ సర్కిళ్లలో అందరికీ తెలుసు… కానీ పెళ్లికి కొన్ని అడ్డంకులు… తేజస్వి అన్న తేజప్రతాప్… కాస్త తేడా మనిషి (ఆడిబొట్ల మనిషి లెక్క కొడతడు)… తనకుతాను శ్రీకృష్ణుడి అంశ అనుకుంటడు… ఓ మహిళా మంత్రి బిడ్డ ఐశ్వర్యతో పెళ్లి చేశారు… ఆమె తండ్రి చంద్రికా రాయ్ ఐదుసార్లు ఎమ్మెల్యే… మాజీ మంత్రి… ఐశ్వర్య తాత బీహార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్… పది నెలలు సీఎం గా చేసాడు… మనవాడి వేషాలు చూసి, ఆమెకు కంపరమెత్తి, చిర్రెత్తి, బెంబేలెత్తి… నోటికొచ్చినట్టు తిట్టిపోసి విడాకులు ఇచ్చిపారేసింది…
Ads
తేజస్వి విషయానికొస్తే రేచల్ క్రిస్టియన్… పెళ్లిళ్లు ప్రైవేటు వ్యవహారమే అయినా… ప్రజాజీవనంలో ఉన్నవాళ్లు ఈ పెళ్లిళ్ల విషయంలో కాస్త వెనకాముందాడుతుంటారు… అది అసలే బీహార్… అన్న పెళ్లి అలా పెటాకులైంది… దీంతో వాయిదా వేస్తూ వస్తున్నారు… లాలూ కుటుంబం కూడా సుముఖంగా లేదు… మెల్లిమెల్లిగా కన్విన్స్ చేసి, ఇదుగో ఇప్పుడు ఆమె మెడలో పుస్తెలు కట్టేశాడు…
(రేచల్ తన బావ తేజప్రతాప్ ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటో)….
ముందుగా ఆమె పేరును రాజశ్రీ అలియాస్ రాజేశ్వరిగా మార్చేశాడు… ఇప్పుడు ఆమె రాజశ్రీ యాదవ్… ఆమె మొదట్లో ఎయిర్ హోస్టెస్‌గా కూడా పనిచేసింది… తండ్రి చండీగఢ్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపాల్… కొన్నాళ్లుగా ఆమె నుంచి కూడా తేజస్విపై ఒత్తిడి పెరుగుతోంది… ఒక్కటి మెచ్చుకోవచ్చు, తేజస్వి తన చిన్ననాటి స్నేహానికి, కొన్నేళ్ల ప్రణయానికి కట్టుబడి ఉన్నాడు… మతం, కులం, ఇతరత్రా ఏవీ మనసులోకి రానివ్వలేదు… వేరే సంబంధాలను చూడనివ్వలేదు, బ్రేకప్పులు, కటీఫుల ఆలోచన రానివ్వలేదు… అదేసమయంలో అందరినీ ఒప్పించాడు, తన పెళ్లిని ఓ ఇష్యూగా మారకుండా చూసుకున్నాడు…
నిజానికి హైప్రొఫైల్ ఫ్యామిలీల్లో మతం, కులంకన్నా స్టేటస్, వధూవరుల అవగాహన, సంబంధాలు, డబ్బు, ధైర్యమే ముఖ్యం… (సచిన్ పైలట్, సారా పైలట్… ఓ విశిష్ట కలయిక వాళ్లది… అదే పెద్ద ఉదాహరణ) అన్నట్టు తేజస్వి, రాజశ్రీ పెళ్లికి తేజప్రతాప్ కూడా వచ్చాడు… మరదలిని ఆశీర్వదించాడు… తమ్ముడికి ఆశీస్సులు ఇస్తూ… అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆశీర్వాదాలు ఎలాగో నా శుభాకాంక్షలు కూడా అంతే అన్నాడు… అన్నట్టూ… ఓ డౌట్… లాలూ సంతానమే 9 మంది, వాళ్ల కుటుంబాలు, వియ్యంకులు, వాళ్ల పిల్లలు, పిల్లల పిల్లలు కలిస్తేనే రెండుమూడొందల మంది అవుతారు కదా… మరి 50 మందితో అంత సింపుల్‌గా పెళ్లి ఎలా లాగించేశారబ్బా…!!
Share this Article