.
లోకసభ ఎన్నికల్లో మంచి వోట్లు సాధించిన బీజేపీ… లోకసభ స్థానాన్ని కైవసం చేసుకున్న పార్టీ… అర్బన్ ఓటర్లలో ఆదరణ ఉన్న పార్టీ… సొంతంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు గంటున్న పార్టీ.,. జీహెచ్ఎంసీ మేయర్ పోస్టు ఈసారి కొట్టేస్తానంటున్న పార్టీ…
మరెందుకు ఈ జుబ్లీ హిల్స్ ఉప- ఎన్నికలో బొక్కబోర్లా పడింది…? ఇంత ఘోరమైన పరాజయ బాధ్యతను ఎవరు తీసుకుంటారు..? అసలు ఈ దుస్థితికి కారణాలేమిటి..? ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం…
Ads
గత ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, అంత పోటీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 ఎమ్మెల్యే సీట్లు… రాబోయే కాలంలో ఏకంగా అధికారంలోకి రావాలని అడుగులు వేస్తున్న పార్టీ ఇది… ప్రత్యేకించి హైదరాబాద్ అర్బన్ వోటర్లలో మంచి ఆదరణ ఉన్న పార్టీ… మరేమైంది..? అసలు పోటీలో ఉన్నట్టే కనిపించలేదు… ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా… ఏదో రిప్రజెంటేషన్ తప్పదు అన్నట్టుగా…
ఇది కిషన్ రెడ్డి సొంత ఎంపీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి, మిగతా బీజేపీ నేతలు నిజానికి పెద్దగా పట్టించుకోలేదు… అసలు తను పట్టించుకుంటే కదా… పార్టీ కూడా ఎవరినీ ఇన్వాల్వ్ చేయలేదు, ఓ స్ట్రాటజీ ప్రకారం..! ఏమిటది..? ‘‘బీఆర్ఎస్‌తో కలిస్తే తప్ప కాంగ్రెస్‌తో పోరాడలేం’’ అనే ఓ వాతావరణాన్ని క్రియేట్ చేయడం… జుబ్లీ హిల్స్ ఫలితాన్ని కూడా ఓ ఆధారంగా చూపించడం..!! ఇదేనా మర్మం..?
నిజంగా ఇక్కడ బీజేపీ గెలవాలని గనుక అనుకుని ఉంటే… గోపీనాథ్ మరణం వెంటనే కేడర్ తిష్ట వేయాలి… ప్లానింగ్ జరగాలి… బూతుల వారీగా పోల్ యాక్షన్ ప్లాన్ స్టార్టయిపోవాలి… ఏమీ జరగలేదు…
అది విలీనమా.,? పొత్తా..? అవగాహనా..? ఏమో, కవితే చెబుతోంది కదా, బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని..! విలీనం అయితే వోకే… కానీ పొత్తు, అవగాహన, సీట్ల షేరింగు ఏది జరిగినా… బీఆర్ఎస్ గనుక మళ్లీ ప్రాణం పోసుకుంటే… ఇక బీజేపీ వచ్చే రెండు దశాబ్దాలపాటు బీఆర్ఎస్‌కు తోకగా మిగిలిపోవాల్సిందే… ఏపీలో టీడీపీకి బీజేపీలాగా..!!
జుబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచి, బీజేపీ అడ్డగోలుగా ఓడిపోతే జరిగే నష్టం బండి సంజయ్‌కు తెలుసు… ఏదయితే అది కానియ్ అనుకుని తనే నడుంకు తువ్వాలు చుట్టి, బరిలోకి దిగాడు… రెండుమూడు రోజులు మతవాదాన్ని ఎత్తుకున్నాడు… ఎందుకు..?
కాంగ్రెసే ముస్లిం, ముస్లిమే కాంగ్రెస్ అనే వాదనను కాంగ్రెస్ ఎత్తుకుంది కాబట్టి… అజరుద్దీన్ అస్త్రం ప్రయోగించింది ఆ వోట్లకే కాబట్టి… హిందూ వోట్ల సంఘటన ప్రయత్నం బండి సంజయ్ రూపంలో జరిగింది కాస్త…
హల్‌చల్ క్రియేట్ చేశాడు… ఈ మాత్రం వోట్లు వచ్చాయంటే ఆ ప్రచారం పుణ్యమే… ఒకరకంగా బీఆర్ఎస్ గెలుపుకు అడ్డంగా గండికొట్టాడు… బీజేపీ వోట్లు బీఆర్ఎస్‌కు టర్న్ అయిపోకుండా అరచేతిని అడ్డుపెట్టాడు… బండి సంజయ్ ప్రచారం చేసిన ప్రతిచోటా బీఆర్ఎస్ భంగపడి, కాంగ్రెస్ లీడ్ బాగా పెరగింది… బండి సునామీలాగా విరుచుకుపడి, బీజేపీ భావి దుర్గతిని అడ్డుకున్నాడు…
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ… అంతే… బీఆర్ఎస్ గనుక మళ్లీ ప్రాణం పోసుకుంటే ఫస్ట్ దెబ్బతినేది బీజేపీయే… నిజానికి బీఆర్ఎస్ దెబ్బతింటుంటే ఆ గ్యాప్స్‌లోకి జొరబడి బీజేపీ బలం పెంచుకోవాలి… కానీ పూర్తిగా ఉల్టా జరుగుతోంది…
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇప్పుడు చంద్రబాబు బలవంతుడు… బీజేపీ పెద్దలైనా సరే తన ఆలోచనల్ని అలా నిర్మొహమాటంగాి తుంగలో తొక్కేయలేరు, అది తమ పార్టీ వ్యవహారమైనా సరే..!
ఎందుకంటే… మెల్లిమెల్లిగా ఏపీ టీడీపీ కూటమినే తెలంగాణలోనూ బలోపేతం చేయాలనేది తన ప్లాన్… రేప్పొద్దున కాంగ్రెస్‌లో పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కదా… సో, తమ కూటమి తెలంగాణ ఎంట్రీకి అడ్డు కేసీయార్… సో, విలీనం అయితే వోకే గానీ, బీజేపీతో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహనను చంద్రబాబు సాధ్యం కానివ్వడు అనేది ఓ ప్రాథమిక అంచనా… ఎందుకంటే, తను బీజేపీతో కలిసి వెళ్లాలని ప్లాన్ కాబట్టి…
తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి… దీనికి ఆజ్యం పోసినట్టుగా బీఆర్ఎస్ అనుకూలవాదం చిచ్చు రేగుతోంది… నిజానికి బీజేపీ కర్తవ్యం అర్బన్ పాజిటివ్ వోటు వాడుకుని హైదరాబాదులో బలపడాలి సొంతంగా, జీహెచ్‌ఎంసీ మేయర్ పోస్టు కొట్టాలి, తరువాత ఉత్తర తెలంగాణలో బలం సుస్థిరం చేసుకుని, దక్షిణ తెలంగాణ మీద కాన్సంట్రేట్ చేయాలి…
ఈ దిశగా బీజేపీ హైకమాండ్‌కు అసలు ఓ దిశ, ఓ వ్యూహరచన ఉన్నాయా..? డౌటే..! అసలు తెలంగాణ ఫీల్డ్ సిట్యుయేషనే దానికి చాలా ఏళ్లుగా అర్థం కావడం లేదు..!! నిన్నటి నుంచీ బీజేపీ అధ్యక్షుడి మాటలు కూడా గందరగోళంగా ఉన్నాయి…!! ఈ జుబ్లీ హిల్స్ ఓటమి బీఆర్ఎస్ ఆత్మమథనం కోసం కాదు, ఫస్ట్ బీజేపీ అంతర్మథనం కోసమే..,!!
(ఈ కథనం రాసే సమయానికి బీజేపీకి జిపాటిస్ దక్కిందో లేదో క్లారిటీ రాలేదు)
Share this Article