అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు… ఇది మరోసారి చర్చనీయాంశమైంది… హైదరాబాదులో ఈ విషయంలో ఓ పద్దతి లేదు, ఓ ప్రామాణికమూ లేదు… అప్పటికప్పుడు కేసీయార్ ఆలోచనలకు అనుగుణ నిర్ణయాలే అధికారిక విధానం… అంతే… ఒక రామానాయుడి దగ్గర మొదలుపెడితే, ఈమధ్య మనం చూసిన అధికారిక అంత్యక్రియలు… కృష్ణ, కృష్ణంరాజు, హరికృష్ణ, సత్యనారాయణ… వీళ్లంతా ఎవరు..?
సినిమాల్లో నటులు… ఫిలిమ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి, హైదరాబాదులో ఉంటున్నారు గానీ తెలంగాణతో వేరే సంబంధబాంధవ్యాలు ఏమీ లేవు… మరీ తెలంగాణ ఉద్యమకాలం నాటి భాషజాలం, భావజాలం ప్రకారం చెప్పాలంటే ‘అవ్వోనివా, అయ్యోనివా నువ్వు’ అని పాడుకునేట్టుగానే వీళ్లంతా… మరి కంటోన్మెంట్ సాయన్న ఎవరు..? 30 ఏళ్లుగా హైదరాబాద్ రాజకీయాల్లో ఉన్నాడు… తెలంగాణీయుడు… వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే… పైగా అధికార పార్టీలో ఉన్నాడు… దళితుడు… ప్రజెంట్ ఎమ్మెల్యే…
మరి తనకెందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదెందుకు..? ఆ సినిమా వాళ్లలో కూడా కొందరికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు, మరికొందరిని అసలు పట్టించుకోనే లేదు… అందులో కూడా వివక్షలు, పక్షపాతాలు… (నందమూరి తారకరత్న అంత్యక్రియలు కూడా మామూలుగానే జరిగాయి… తనకు కూడా లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి, సాయన్నను విస్మరిస్తే మరింత ఘోరంగా ఉండేది…)… ఇక సాయన్న విషయానికే వద్దాం…
Ads
ఒకప్పుడు తెలుగుదేశంలోనే చాన్నాళ్లు రాజకీయాలు చేసి ఉండవచ్చుగాక… కానీ తరువాత టీఆర్ఎస్‌లో చేరాడు సాయన్న… మరణించేంతవరకూ అందులోనే ఉన్నాడు… ఒకవైపు తెలంగాణేతరులైన సినిమానటులకు అధికారిక లాంఛనాల గౌరవం… సాయన్న మీద మాత్రం వివక్ష… సరిగ్గా ఇదే సాయన్న అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది… చాలాసేపు ఆందోళన చేశారు… కేసీయార్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు… వాళ్లను సముదాయించడం నగర బీఆర్ఎస్ ముఖ్యులకు, పోలీసులకు, అధికారులకు చాలా కష్టమైపోయింది…
తెలంగాణ సమాజాన్ని పీడించిన నిజాం వారసుడు ముకర్రంజా అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి… ముఖ్యమంత్రి కేసీయార్ స్వయంగా పరామర్శకు వెళ్లాడు… సినిమా నటులకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఎవరూ అనడం లేదు… కాకపోతే ఇక్కడ ప్రాధాన్యాలు, వివక్ష, పక్షపాతాల మాటేమిటనేదే చర్చ… అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అనేది ఆ వ్యక్తికి మనం ఇచ్చే అంతిమ సగౌరవ నివాళి… మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..?
అధికారిక లాంఛనాలతో ఈ లోకం నుంచి వెళ్లిపోయేవాళ్లకు ఏం అర్హతలు ఉండాలి..? దీనిపై ప్రభుత్వ విధివిధానాలేమిటి..? ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు… అంతా ముఖ్యమంత్రి ఇష్టం… తన విచక్షణ… మరి సొంత పార్టీ నాయకుడి విషయంలో ఆయనకు ఈ విచక్షణ ఎందుకు కరువైంది..? నిజాం వారసులు, సినిమా నటులకన్నా తీసిపోయాడా సాయన్న..? ఈ విచక్షణ ఎందుకు లేకుండా పోయింది..?! ఈ ప్రశ్నకూ జవాబు దొరకదు..!!
Share this Article