గవర్నర్ ఏం చేయగలదు..? ఆమెకు కోపం వస్తే మనకు నష్టమేంటి..? ఆమెను అడుగడుగునా అవమానిస్తే మాత్రం ఆమె చేయగలిగేది ఏముంటుంది..? ఈ భావనతో కేసీయార్ ప్రభుత్వం ఒక మహిళా గవర్నర్ తమిళిసైని అన్నిరకాలుగా అవమానించడం కొనసాగుతూనే ఉంది… మరీ ఓ థర్డ్ రేట్ లీడరైతే ఆమె ము- అనే చిల్లర, వెగటు భాషలో కామెంట్స్ చేశాడు… ఐనా తనను బీఆర్ఎస్ పార్టీ గానీ, ఈ ప్రభుత్వం గానీ సదరు నాయకుడి మీద చర్య తీసుకోలేదు, కనీసం ఖండించలేదు… అంటే దాన్నెలా అర్థం చేసుకోవాలి..? గవర్నర్‌ను ఏం తిట్టినా సరే, గో ఎహెడ్ అని పరోక్షంగా సమ్మతిని ఇస్తోందా..?
ఇప్పుడు ఆమె బడ్జెట్‌కు సమ్మతి తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది… ఏకంగా ఆమె మీద హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని మీడియా చెబుతోంది… ప్రభుత్వం ఆమె ప్రసంగం అక్కర్లేదు అనుకుంది… గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించింది… ఆమె కూడా గోకడం మొదలుపెడితే..? ఇప్పుడు జరుగుతున్నది అదే… బీజేపీ హైకమాండ్‌కు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ చెప్పకుండా చేయదు ఆమె… కాకపోతే ఒక ఝలక్ ఇవ్వడమే తప్ప, అల్టిమేట్‌గా గవర్నర్ బడ్జెట్‌కు ఆమోదం చెప్పొచ్చు… ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గవర్నర్ల పట్ల, గవర్నర్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత ప్రబలుతున్న స్థితిలో… తెలంగాణలో కూడా కావాలని సంక్షోభాన్ని క్రియేట్ చేయడం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు…
కేంద్ర ప్రతినిధులుగా గవర్నర్లు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాల పాలన మీద నిఘా ఉండాలి… అవసరమైతే కొరడా తీసుకునే సర్వాధికారాలు కేంద్రానికి ఉండాలి… లేకపోతే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇష్టారాజ్యం విధానాలతో, పాలనతో దేశాన్ని చినిగిన విస్తరిని చేస్తాయి… దేశ సార్వభౌమాధికారానికి కూడా ఈ ప్రాంతీయ పెత్తందార్లు చేటుగా పరిణమించగలరు… గవర్నర్లను ధిక్కరించడం, ఆ వ్యవస్థే ఉండకూడదని కోరుకోవడం అంటే కేంద్రం పెత్తనం ఉండకూడదని కోరుకోవడమే… రాష్ట్రాలు స్వయంప్రతిపత్తిని కోరుకోవడమే… మన రాష్ట్రాల పాలన రీతులను గమనిస్తే మాత్రం, అది దేశ సమగ్రతకు నష్టదాయకమే… కాకపోతే ఇదంతా వేరే చర్చ…
Ads
తెలంగాణ గవర్నర్ విషయానికి వస్తే… ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి, బడ్జెట్‌ను ఆమోదించాలని కోర్టు ద్వారా గవర్నర్‌కు చెప్పిస్తారని వార్తల సారాంశం… అసలు గవర్నర్ల విధుల్లో హైకోర్టు జోక్యం చేసుకోగలదా..? అది తన అధికార పరిధిలోకి వస్తుందా..? ఇది కేసీయార్ ప్రభుత్వ ముఖ్యులకు తెలియదా..? ఒకవేళ నిజంగానే హైకోర్టు అలా ఆదేశిస్తే, గవర్నర్ పట్టించుకోకపోతే హైకోర్టు చేయగలిగేది ఏముంది..?
ఒకవేళ గవర్నర్ ఆమోదం లేనిదే బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి మమ అనిపిస్తే ఆ బడ్జెట్‌కు చెల్లుబాటు ఉంటుందా..? అదీ ప్రశ్నే… నో, నో, మీరు బడ్జెట్‌ను ఆమోదించండిన అని హైకోర్టు గవర్నర్‌ను ఆదేశిస్తే, ఆమె లైట్ తీసుకుంటే మాత్రం… మన రాజ్యాంగ వ్యవస్థల అధికార పరిధులు మరోసారి చర్చకు వస్తాయి… అవి ఘర్షణను కోరుకోవు..!!
Share this Article