నాన్సెన్స్, డ్రగ్స్ తీసుకుంటే బాధితుడో, కస్టమరో అవుతాడు తప్ప నేరగాడు ఎలా అవుతాడు..?… మా ఎమ్మెల్యేలో, వాళ్ల తరఫువాళ్లో డ్రగ్స్ పెడలర్స్ (రవాణదారు, సరఫరాదారు, పంపిణీదారు, విక్రేత) కాదు కదా……… అని సమర్థించుకొచ్చారు కొందరు మిత్రులు….. డ్రగ్స్ రొంపిలో ఎమ్మెల్యేలు అంటూ ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ బ్యానర్ కుమ్మేసింది కదా ఈరోజు… తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ రాకెట్లో ఉన్నారనేది వార్త… (అది ఈనాడేనా అని డౌటొచ్చింది చదవగానే… ఈనాడులో ఎక్స్‌క్లూజివ్ వార్త అనేది కనిపించక చాలా ఏళ్లయింది కదా, అందుకని ఆ డౌట్…) ఆ రొంపిలో ఎమ్మెల్యేలు కూడా మత్తుగా దొర్లుతున్నారు అనే సమాచారంకన్నా దాన్ని సమర్థించే సెక్షన్‌ను చూసి జాలేస్తుంది… మా ఎమ్మెల్యేల ఇజ్జతే మా పార్టీ ఇజ్జత్ అన్నట్టు కనిపించే ఈ వ్యవహారధోరణి డ్రగ్స్కన్నా ప్రమాదకరం… నిజమే, డ్రగ్స్ వినియోగదారుడిని ఈ దందా రాకెట్ భాగస్వామిగా పరిగణించలేం… కానీ..?
నిజానికి ఆమధ్య ముంబైలో డ్రగ్స్ రాకెట్ తవ్వినప్పుడు హైదరాబాద్‌కు లింకులు బయటపడుతున్నయ్, ఒకరిద్దరు సినిమా తారలకు చిక్కులు తప్పవు అనే ప్రచారం హైదరాబాద్ హైప్రొఫైల్ సర్కిళ్లలో జరిగింది… కానీ సదరు తారలకు ‘‘మంచి సంబంధాలు’’ ఉండటమో… ఈలోపు ముంబై పోలీసులే ఇతర చిక్కుల్లో పడి ఈ డ్రగ్స్ రాకెట్ తవ్వకమే ఆగిపోవడమో… కారణం ఏదయితేనేం మొత్తానికి అది ఆగిపోయింది… నిజానికి ఆమధ్య అకున్ సభర్వాల్ హైదరాబాద్ డ్రగ్స్ బాగోతాల్ని తవ్వుతున్నప్పుడు తనకు జాగ్రత్తలతో కూడిన ఇంకాస్త స్వేచ్ఛ ఇవ్వాల్సింది… ఆయన అనుమానితులైన సెలబ్రిటీల్ని ప్రశ్నించిన తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమే… కానీ డ్రగ్స్ రాకెట్, గ్యాంగుల పని పట్టాల్సింది… ఇంకా లోతుగా తవ్వి ఉండాల్సింది… కానీ అకస్మాత్తుగా అది ఆగిపోయింది, సభర్వాల్ అసలు స్టేట్‌లోనే కనిపించడం లేదు… కేసీయార్ పాలనలో నయీం వంటి పెద్ద పెద్ద కేసులే అటకెక్కాయి… ఇదెంత..?
Ads
ఇప్పుడూ అంతే… కర్నాటక పోలీసులు వచ్చి, ఏదేదో చేసేస్తారనే భ్రమలు ప్రజలకు ఏమీ లేవు… ఎందుకంటే, ఆరోపణలు వస్తున్నవి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ల తరఫు మనుషులకు సంబంధించి… ఇవి నిరూపితం కావాలని కూడా ఏమీలేదు… అసలు ఈ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలే కాదు, చాలామంది ఎమ్మెల్యేల వ్యక్తిగత జీవనశైలి, సంపాదన, సెటిల్మెంట్లు, కబ్జాలు గట్రా జనంలో చర్చనీయాంశాలవుతూనే ఉన్నయ్… ఒక్కరంటే ఒక్కరి మీద కూడా పార్టీ గానీ, ప్రభుత్వం గానీ సీరియస్ లుక్కేసిన పాపాన పోలేదు… పైగా ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుప్రీం, జమీందార్, దేశ్‌ముఖ్ అన్నట్టుగా స్వేచ్ఛ, అధికారాల్ని ఇచ్చింది… వాళ్లు కోరిన వాళ్లే పోలీసులు, వాళ్లు కోరినవాళ్లే అధికారులు, వాళ్లు కోరిన పనులకు తిరుగు లేదు… ఇదుగో కొందరి వ్యవహారం చివరకు డ్రగ్స్ దాకా వచ్చింది… ఐనా సరే, ఎవరికీ ఏమీ కాదు… కాదు… నిష్ఠురంగా అనిపిస్తున్నా నిజం ఇదే… ఇక్కడ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకోవడం గురించి కాదు ఇష్యూ… పెద్ద పెద్ద సర్కిళ్లలో బోలెడు మంది డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు… పట్నంలో పబ్బులు, రేవ్ పార్టీలు గట్రా వింటున్నదే… ఎమ్మెల్యేలు అతీతులేమీ కాదు… వాళ్లూ మనుషులే కదా… వశపడనంత డబ్బు వచ్చిపడుతోంది… అందుబాటులోకి అన్నిరకాల విలాసాలు, సుఖాలు… వాళ్లూ ప్రభావితమవుతారు… కానీ ఇప్పుడు చర్చ అంతా ప్రజాజీవితంలో ఉండేవాళ్ల నైతిక ప్రవర్తన గురించే… వాళ్లే డ్రగ్స్ రాకెట్లకు సహకరిస్తే, ఆ మత్తు రొంపిలో పడి దొర్లుతుంటే… తమకేమీ కాదనే ధీమాలో పడి తూలుతూ ఉంటే… ప్రభుత్వ స్పందన ఎలా ఉండాలి..? ఎలా ఉండబోతోంది..? ఇదీ ప్రశ్న… ఎందుకంటే..? తనీష్ వంటి బుడ్డ బుడ్డ హీరోలను వదిలేస్తే… ముగ్గురు కాదు, ఇంకొందరు ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం మీద కూడా కర్నాటక పోలీసులు ఆధారాలు తవ్వుతున్నారని సమాచారం..!!
Share this Article