ఒక ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారి, తెలంగాణ వ్యతిరేక శక్తులను నెత్తికెక్కించుకుని, తెలంగాణ ప్రయోజనాల్ని కసకసా తొక్కిపడేసిన కేసీయార్ పార్టీలాంటిదే కదా నమస్తే తెలంగాణ పత్రిక కూడా…. అది కొనసాగాల్సిన అవసరం ఉందని చెబుతారేం..? టీన్యూస్, తెలంగాణటుడే రంగంలో ఉండాలన్నట్టు రాస్తారేం..? జర్నలిస్టుల జీవితాలు బజారున పడొద్దనేనా..? అని సీరియస్ ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్ మిత్రుడు…
తనకు పెద్ద పెద్ద వివరణలు అక్కర్లేదు… ఈరోజు ఆ పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చిన ఓ వార్త చాలు… ఆ వార్త ఏమిటయ్యా అంటే… జగన్ రాయలసీమ లిఫ్ట్ పనుల్ని వేగవంతం చేశాడు… జనం దృష్టిని నాగార్జునసాగర్ మీదకు మళ్లించి, తెలంగాణ జనమంతా ఎన్నికల ధ్యాసలో ఉన్నప్పుడు సైలెంటుగా సీమ లిఫ్టు పనుల్ని అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఆగమేఘాల మీద నడిపించేస్తున్నాడు… పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తున్నాడు… ఈ స్టోరీ ఫోటోలతో సహా నమస్తే తెలంగాణ పబ్లిష్ చేసింది…
Ads
నిజానికి మంచి స్టోరీ… మరి ఇన్నేళ్లూ ఆ ప్రాజెక్టు మీద కేసీయార్ చేసిన పోరాటం ఏముంది..? నమస్తే రాసిందేముంది..? జగన్ మీద ప్రేమతో ఆ ప్రాజెక్టును అడ్డుకునే కనీస ప్రయత్నం కూడా చేయలేదు ఈ తెలంగాణ ధృతరాష్ట్రుడు..!! అవసరమైతే ఓ వంద జేసీబీలు కూడా సమకూర్చేవాడేమో… ఎస్, ఇది నిష్ఠురనిజం… ఇప్పుడు హఠాత్తుగా మూసుకుపోయిన ఆ కళ్లు తెరుచుకున్నయ్… ఈ స్టోరీ ‘‘ఏమిటోయ్ రేవంతూ ఏం చేస్తున్నవ్’’ అని అడుగుతున్నట్టుంది…
ఎస్, పదవీలాలసతో కేసీయార్ విసిరేసిన కుర్చీలకు అతుక్కుపోయిన చాలామంది తెలంగాణ మేధావులు ఇక నోళ్లు విప్పుతారు… సేమ్, నమస్తే తెలంగాణ పత్రిక కూడా… నవ్వు పుట్టించినా సరే, అది ప్రస్తుతావసరం… ఇదుగో ఈ స్టోరీలాగే… ఎవరో ఒకరు రాసేవాడు, కూసేవాడు కావాలి కదా… ఇంకెవడున్నాడు..? సాక్షి..? అది ఈ స్టోరీ వేస్తుందా..? పైగా భల్లే భల్లే జగనూ అని డాన్సులు చేయగలదు… ప్యూర్ ఆంధ్రా దాస్యపత్రిక…
ఈనాడు రాస్తుందా..? రాయదు… అదెప్పుదో జీవం చచ్చిన బాపతు… పైగా అక్కడ కీలక పోస్టుల్లో ఉన్నవాళ్లంతా ఆంధ్రా జర్నలిస్టులే… అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల్ని మంటలో వేసి చలికాచుకునే బాపతు… ఎడిటర్లు, బ్యూరో చీఫులు, డెస్క్ ఇన్‌ఛార్జులు ఎట్సెట్రా అందరూ అదే కదా… తెల్లారి లేస్తే జగన్‌ను తిట్టిపోసే సదరు పత్రిక ఈ విషయంలో జగన్ గుడ్ అని చప్పట్లు కూడా కొట్టగలదు… ఆంధ్రజ్యోతి కూడా అదే బాపతు కదా… టీవీ9 తెలంగాణవాడిదే… కానీ దాన్ని నడిపించేది ఎవరు..? ప్యూర్ యాంటీ తెలంగాణ హెడ్స్… ఎన్టీవీ, టెన్‌టీవీ, టీవీ5, ఏబీఎన్, సాక్షి, ఈటీవీ… ఇవన్నీ ఎవరివి..? ఎవరి ప్రయోజనాలకు గొడుగులు పట్టేవి..?
కృష్ణా జలాల మీద ఆధారపడిన తెలంగాణ ఆయకట్టు రైతును అడ్డంగా ముంచేసి జగన్ ఏమైనా చేయగలడు..? కానీ ఎవరు వ్యతిరేకించాలి..? ఎవరు గొంతు విప్పాలి..? ఎవరు ఎలుగెత్తాలి..? వీ6, వెలుగు ఇప్పుడు కాంగ్రెస్ మీడియా… ఏది రాస్తే కాంగ్రెస్ వ్యతిరేకమో, ఏది చూపిస్తే కాంగ్రెస్ అనుకూలమో తనకే తెలియని సంధి దశ… సందిగ్ధ దశ… కన్సిస్టెన్సీలేనితనం… సో, పాతపాపాలెన్ని ఉన్నా సరే, జనంలో ఉంటూ, జనం కోసం ఉంటూ పాపాలు కడిగేసుకునే చాన్స్ వచ్చింది… సరిగ్గా ఈ అవసర వేళలోనే అది కుదించుకుపోతోంది… ఈ పదేళ్ల జనవ్యతిరేకం… చివరకు ఇప్పుడు సైతం..!!
Share this Article