.
చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ కె.రామకృష్ణారావు గారికి శుభాకాంక్షలు
చాలా ఏళ్ల క్రితం వాడ్రేవు చినవీరభద్రుడు గారు కాల్ చేసి ‘నువ్వెప్పుడైనా గుంటూరు వెళితే కలెక్టర్ రామకృష్ణారావు గారిని కలువు. ఆయన నీ గురించి చాలాసేపు మాట్లాడాడు. పెద్ద ఫ్యాన్’ అన్నారు.
Ads
నాకు సంతోషం కలిగింది. ఒక జిల్లా కలెక్టరు ‘దర్గామిట్ట కతలు’ చదివి అభిమానిగా మారారు అని తెలిసి. అయితే నేను గుంటూరు వెళ్లలేదు. ఆయనను కలవలేదు.
చాలా ఏళ్ల తర్వాత అంటే 2020 నుంచి రామారావు కన్నెగంటి గారు హైదరాబాద్‌లో తన ఆఫీసుకు వచ్చి వెళుతూ ‘నేను రామకృష్ణ దగ్గరే ఉంటున్నాను. నీ గురించి చాలాసార్లు ప్రస్తావించాడు’ అన్నారు. వాళ్లిద్దరూ నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకున్నారు. ప్రాణస్నేహితులు.
రామకృష్ణారావు గారు అప్పటికి తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ. రామారావు గారితో కలిసి రామకృష్ణారావు గారిని ఆయన నివాసంలో కలిశాను. మధ్యాహ్నం వేళ. చాలా సాధారణ భోజనం ముగ్గురం కలిసి చేశాం. భోజనం చేస్తున్నంత సేపు రామకృష్ణారావు గారు పుస్తకాల గురించే మాట్లాడారు.
ఆ వారంలో ఆయన చదువుతున్న పుస్తకం విశేషాలు చెప్పారు. అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించిన జర్నలిస్టు అనుభవాల పుస్తకం అది. అలాగే ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మబండ కతలు’ వస్తున్నప్పుడు వీక్లీని ఇంటికి కొనుక్కొని వెళ్లి వారి శ్రీమతిని కూచోబెట్టి పెద్దగా చదివి వినిపించడం తనకు ఇష్టమైన వ్యాపకంగా ఉండేదని అన్నారు.
రైటర్స్ మీట్ కార్యకలాపాల గురించి విని డా.మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో పర్మినెంట్‌గా మీట్‌ను జరుపుకోమని కోరారు. దగ్గరుండి ఆ సంవత్సరం వెన్యూ ఏర్పాటు చేశారు. ఒక క్లాస్ చెప్పాలి అని కోరితే బిజీగా ఉండి కూడా వచ్చి రచయితలతో మాట్లాడారు.
ప్రతి ఏటా ఏయే అంతర్జాతీయ పత్రికలలో నిస్పక్షపాతమైన ఎంపికతో ఉత్తమ పుస్తకాల లిస్టు వస్తుందో తెలియచేసి వాటిలో కొన్నయినా చదవమని కోరారు. వాటిని తాను క్రమం తప్పకుండా తెప్పించుకుని చదువుతుంటానని అన్నారు.
పుస్తకాలను చదివే, సాహిత్యాన్ని ఎంతో అభిమానించే రామకృష్ణారావు గారు మే 1న తెలంగాణ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా రైటర్స్ మీట్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
నమస్కారాలతో………. – మహమ్మద్ ఖదీర్‌బాబు
Share this Article