Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ ఏర్పడ్డాక… తలసరి గృహ విద్యుత్తు వినియోగంలో బాగా డౌన్ ఫాల్…

November 25, 2023 by M S R

ప్రచారం: రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రూ 95,361/- నుండి రూ 2.80 లక్షలకు పెరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారనడానికి ఇంకేం ఆధారం కావాలి?

వాస్తవం: ప్రజల జీవన ప్రమాణాలకు నిజమైన కొలబద్ద గృహ విద్యుత్ వినియోగం. ఈ వృద్ది రేటు రాష్ట్ర ఏర్పాటు తరువాత 110% నుండి 69%కి పడిపోయింది. అభివృద్ది ఫలాలు కేవలం పిడికెడు వ్యక్తులకే పరిమితమై, సామాన్య తెలంగాణ ప్రజల బతుకులు మరింత దిగజారడాన్ని ఇది సూచిస్తుంది.

ప్రజల జీవన ప్రమాణాలకు నిజమైన కొలబద్ద గృహ విద్యుత్ వినియోగం:

Ads

తలసరి ఆదాయం కన్నా, గృహ విద్యుత్ వినియోగం ఒక ప్రాంత ప్రజల అభివృద్దికి సూచిక. ఎందుకంటే లక్షల కోట్లు కొల్లగొట్టిన ఇద్దరు, ముగ్గురు కుబేరులు ఒక ప్రాంతంలో ఉంటే, ఆ ప్రాంతంలో మిగిలిన మొత్తం పేదవారే ఉన్నా, తలసరి ఆదాయం మాత్రం అధికంగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఆ ఇద్దరు, ముగ్గురి గృహ విద్యుత్ వినియోగం ఆ ప్రాంత గృహ విద్యుత్ వినియోగాన్ని ప్రభావితం చేయదు. కాబట్టి గృహ విద్యుత్ వినియోగం ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను సూచిస్తుంది.

 

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం “గృహ” విద్యుత్ వినియోగం మాత్రమే కీలకం… మొత్తం విద్యుత్ వినియోగం కాదు…. మొత్తం విద్యుత్ వినియోగం అంటే, అన్నిరంగాల వినియోగాన్ని… గృహ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ లాంటి రంగాలన్నింటి వినియోగాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. కానీ నిజంగానే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ది చెందితే, జీవన ప్రమాణాలు మెరుగు పడితే, ఆ అభివృద్ది ఖచ్చితంగా గృహవినియోగంలో కనబడుతుంది. ఒక ప్రాంతంలో మొత్తం విద్యుత్ వినియోగం భారీగా పెరిగి, గృహ వినియోగం పెరగడంలేదంటే ఆ ప్రాంతం నిజమైన అభివృద్ది సాధించలేదనో, లేక ఆ అభివృద్ది ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు అందడంలేదనో మనం చెప్పవచ్చు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ప్రాంతంలో నివసించే రైతుకు తన ఇంట్లో నెలసరి వినియోగం కేవలం 50 యూనిట్లు, కానీ తన పొలానికి పంపుసెట్ల ద్వారా నెలకు వినియోగిస్తున్న విద్యుత్తు 500 యూనిట్లు అనుకుందాం. అప్పుడు ఆ ప్రాంతంలో తలసరి విద్యుత్ వినియోగం 550 గా చెప్పవచ్చు. మరో రైతు తన ఇంట్లో నెలకు 200 యూనిట్లు వినియోగిస్తున్నా, ఆ రైతు పొలానికి ప్రభుత్వమే కాలువల ద్వారా నీటిని నేరుగా అందిస్తున్నదనుకుందాం. కాలువల ద్వారా నీటిని అందిస్తున్నప్పుడు దానికయ్యే విద్యుత్ వినియోగాన్ని రైతు వినియోగంగా లెక్కించరు. అప్పుడు ఆ ప్రాంత రైతు తలసరి విద్యుత్ వినియోగం కేవలం 200 యూనిట్లుగా మాత్రమే నమోదౌతుంది. ఇక్కడ మొత్తం విద్యుత్ వినియోగం పరిగణిస్తే మొదటి రైతు జీవనప్రమాణం ఎక్కువగా కనబడుతుంది. కేవలం గృహవినియోగం మాత్రమే చూస్తే రెండవ రైతు జీవన ప్రమాణం ఎక్కువగా తేలుతుంది. నిజానికి గృహవినియోగం ఆధారంగా రెండవ రైతు జీవనప్రమాణమే ఎక్కువ అని మనకు తెలుసు. కాబట్టి ఒక ప్రాంత ప్రజల వాస్తవ జీవన స్థితిగతులు తెలుసుకోవాలంటే ఆ ప్రాంత ప్రజల గృహవినియోగమే నిజమైన ప్రామాణికం అని మనకు అర్ధమౌతుంది.

 

ఈ వాదన తెలంగాణ ఉద్యమసమయంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెయెసీ బయటకు తీసుకువచ్చింది. అప్పటి ఆంధ్రా పాలకులు తెలంగాణలోనే ఎక్కువ వినియోగం ఉందని, అందుకే తెలంగాణనే ఎక్కువ అభివృద్ది చెందిందనీ తెలంగాణ ప్రజల ముందు, కేంద్రం ముందు వాదించారు. ఈ వాదన తిప్పికొడుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెయెసీ తెలంగాణ ప్రజల గృహ వినియోగం లెక్కలను బయటకు తీసుకు వచ్చింది.

 

ఆంధ్రలో రైతులకు కాలువల ద్వారా, చెరువుల ద్వారా నీటిని ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి అక్కడ బోరుబావుల విద్యుత్ వినియోగం తక్కువగా ఉండి, మొత్తం విద్యుత్ వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ గృహ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు తెలంగాణలో గృహ వినియోగం తక్కువగానే ఉన్నా, బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం కారణంగా వ్యవసాయ వినియోగం ఎక్కువగా ఉండి, మొత్తం విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వలసలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యుత్ వినియోగం మొత్తం తెలంగాణ వినియోగంపై పడుతుంది.

 

అందుకే, కేవలం తెలంగాణ ప్రాంత గృహ విద్యుత్ వినియోగ లెక్కల ఆధారంగా అప్పట్లో తెలంగాణ విద్యుత్ జెయెసీ ఆంధ్రా పాలకుల వాదనలను తప్పని నిరూపించింది. కృష్ణా కమిటీకి సమర్పించిన నివేదికలో టీజాక్ ఈ వివరాలన్నింటినీ పొందుపరిచి విద్యుత్ పరంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోయిందో కళ్ళకుగట్టినట్టు వివరించింది. టి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా టీజాక్ వాదనలతో ఏకీభవిస్తూ కృష్ణా కమిటీకి పార్టీ పరంగా సమర్పించిన నివేదికలలో (సంపుటి-4) తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెయెసీ వాదనలనే యధాతధంగా చేర్చారు.

తెలంగాణకు ముందు, తరువాత గృహ విద్యుత్ వినియోగం ఎలా ఉంది?
తెలంగాణ ఏర్పడక ముందు, తరువాత 8 ఏళ్ల కాలంలో గృహ విద్యుత్ వినియోగ తీరుతెన్నులు చూద్దాం.

తెలంగాణ ఏర్పడక ముందు 8 ఏళ్లలో:

తెలంగాణ ఏర్పడక ముందు 8 సంవత్సరాలలో గృహ విద్యుత్ వినియోగం చూద్దాం. 2005-06 ఆర్ధిక సంవత్సరం చివరకు గృహ విద్యుత్ వినియోగం 371.3 కోట్ల యూనిట్లు. 2013-14 నాటికి గృహ విద్యుత్ వినియోగం 779.5 కోట్ల యూనిట్లు. గృహ విద్యుత్ వినియోగంలో 8 ఏళ్లలో వృద్ది 110%.


తెలంగాణ ఏర్పడ్డ తరువాత 8 ఏళ్లలో:

తెలంగాణ ఏర్పడే నాటికి, అంటే 2013-14 ఆర్ధిక సంవత్సరాంతానికి, తెలంగాణ ప్రాంతం వరకు గృహ విద్యుత్ వినియోగం 779.5 కోట్ల యూనిట్లు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్ళకు, అంటే 2021-22 లో తెలంగాణ రాష్ట్ర గృహ విద్యుత్ వినియోగం 1319.8 కోట్ల యూనిట్లు. 8 ఏళ్లలో గృహ విద్యుత్ వినియోగంలో వృద్ది 69%.

 


సంపద కొందరి గుప్పిట్లో: గృహ విద్యుత్ వినియోగంలో అభివృద్ది రేటు తెలంగాణ ఏర్పడక ముందు 8 ఏళ్లలో 110% ఉంటే, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఈ రేటు 69% కి పడిపోయింది. అంటే రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రజల ఆర్ధిక పరిస్తితి తిరోగమన దిశలో ఉందని అర్దం చేసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇక్కడి ప్రజలలో ఆర్ధిక అసమానతలు పెరిగి, సాధారణ ప్రజల జీవన స్థితిగతులు మరింత క్షీణించాయని స్పష్టం.

 

తలసరి ఆదాయం పెరిగినా, అభివృద్ది ఫలాలు కేవలం పిడికెడు వ్యక్తులకే పరిమితమై, సామాన్య తెలంగాణ ప్రజానీకానికి అందలేదన్న విషయమూ మనకు అవగతమౌతుంది…… తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి‌జే‌ఏ‌సి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions