గురువు లేడు, శిష్యుడు లేడు… చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి ఉదాసీనంగానో, గౌరవంగానో వ్యవహరిస్తే అది తన కుర్చీ కిందకు, తన కెరీర్ కిందకు నీళ్లు తెచ్చుకోవడమే… ఇదీ చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం… ఐతే రేవంత్‌రెడ్డిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు… తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడానికి, బలపడటానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను తను ప్రస్తుతం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టుంది…
చంద్రబాబు గనుక టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వేసే ప్రతి అడుగూ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం, కొసప్రాణంతో ఉన్న బీఆర్ఎస్‌కు జీవగంజి పోయడమే అవుతుంది… చంద్రబాబు అనే బూచిని చూపిస్తూ బీఆర్ఎస్ ఎదిగే ప్రయత్నం చేస్తుంది… ఐతే, అదంతా జరిగే పనేమీ కాదు, బీఆర్ఎస్ మళ్లీ కోలుకునే సీన్ లేదు, రేవంత్‌రెడ్డి టీడీపీ బలపడకుండా చూసుకోకపోతే, చేజేతులా బీజేపీ బలం పెంచుతున్నట్టే అనే మరో భిన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది… ఎలాగంటే..?
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, చాలామంది వలసజీవులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు… ప్రత్యేకించి లోకసభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది… పైగా ఈరోజుకూ ఆ పార్టీ తెరపై పదే పదే కేటీయార్, హరీష్‌రావు తరువాత ఇంకే నాయకుడూ కనిపించడం లేదు… పార్టీ కేడర్ బాగా డిమోరల్ అయిపోయి ఉంది… అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసంబంధాలను గాలికి వదిలేసిన నాయకుడు ఫామ్ హౌజులో ‘ధర్మదర్శనం’ స్కీమ్ పెట్టి గంటలకొద్దీ ‘ఆశీర్వచనాలు’ ఇస్తున్నాడు గానీ… అవేమీ వర్కవుట్ కావు, అయ్యే సీన్ లేదు…
Ads
ఈ స్థితిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లేవాళ్లే తప్ప బీజేపీ వైపు వస్తున్నవాళ్లు ఎవరూ లేరు… బీజేపీలో అన్నీ తన మీద వేసుకుని వ్యవహారాలు చక్కబెట్టే పవర్ ఫుల్ లీడర్ లేకపోవడం కూడా ఓ కారణమే… కేసీయార్ మీద వ్యతిరేకత, మోడీ పాపులారిటీ, హిందుత్వ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలనే భావన మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లు రావడానికి కారణం… అంతేతప్ప రథాన్ని పరుగులు పెట్టించే సారథ్యం ఉన్న లీడర్లెవరూ లేరు…
ఈ స్థితిలో చంద్రబాబు సేమ్ ఏపీ ఫార్ములాను ఇక్కడ ప్రయోగించే అవకాశాలున్నయ్… అదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలోపేతం చేయడం… ఆల్రెడీ బీజేపీ తెలంగాణకు బీసీ సీఎం అనే నినాదం ఇచ్చి ఉంది… టీడీపీ ద్వారా కమ్మ, జనసేన ద్వారా కాపు, ఇద్దరి ద్వారా సెటిలర్ల వోట్లు సంఘటితం చేయడమే గాకుండా… బీజేపీ ఒరిజినల్ వోట్ బ్యాంకు, కాంగ్రెస్ మీద ఎంతోకొంత పెరిగే యాంటీ ఇంకంబెన్సీ బీజేపీకి అనుకూలిస్తాయనేది కొన్ని వాదనల సారాంశం…
ఐతే చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను తెలంగాణలో కలుపుకుని వెళ్లడం యాంటీ సెంటిమెంట్ అవుతుందా అనే సందేహాలు కూడా బీజేపీ కేడర్‌లో ఉన్నాయి… ఈ స్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు భావి తెలంగాణ రాజకీయాలకు ఓ సూచిక కాబోతున్నాయి… ఎటొచ్చీ తేలాల్సింది బీసీ సీఎం ఎవరు అని… సంజయుడా..? రాజేంద్రుడా..? ఎవరైనా మూడో కృష్ణుడు వస్తాడా..?!
ఇక్కడ మరో విషయమూ ప్రస్తావనార్హం… లోకసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తరవాత కేసీయార్ బీజేపీతో చెలిమి కోసం విశ్వప్రయత్నాలు చేశాడు… అప్పటిదాకా బీజేపీ మీద కేసీయార్ చేసిన దాడులు, దుష్ప్రచారాలతో విసిగిన బీజేపీ చంద్రబాబుతో దోస్తీ ఒకింత మేలు తప్ప కేసీయార్‌ను నమ్మకూడదనే భావనతో కేసీయార్‌ను దూరం పెట్టేసింది… రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు స్కోప్ ఏర్పడిందని భావించింది… కానీ ఇప్పుడు ‘ఆత్మరక్షణ’ ప్రయత్నాల్లో కేసీయార్ బీజేపీతో రాయబారానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు వార్తలు… కేటీయార్, హరీష్‌రావు అందుకే ఢిల్లీలో తిష్టవేశారట…
కానీ ఆ కలయిక కష్టం… మళ్లీ కేసీయార్‌తో చేతులు కలిపితే తెలంగాణలో ఎన్డీయే కూటమి మాటేమిటి..? బీజేపీ-కేసీయార్‌లకు వ్యతిరేకంగా టీటీడీపీ రథాన్ని నడిపించగలడా చంద్రబాబు..? సో, వర్తమాన తెలంగాణ రాజకీయం అనూహ్యంగా ఉంది..!!
Share this Article