తొమ్మిదేళ్లలో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 7770 మెగా వాట్ల నుండి 18000 మెగా వాట్లకు పెంచాం. ఇది దేశంలోనే రికార్డు. ఇదీ మనోళ్ళ ప్రచారం. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం…
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ (CEA) దేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్ధ్యాలపై అక్టోబర్ 2023 నివేదికను ఇటీవలే ప్రచురించింది. ఇందులో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 31 అక్టోబర్, 2023 నాటికి 18792 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి, అంటే జూన్, 2014 నాటికి తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 7770 మెగావాట్లు. 9 ఏళ్లలో మన విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 141% పెరిగింది.
అదే సిఈఏ రిపోర్టులో మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ స్థాపిత సామర్ధ్యం వివరాలు కూడా ఉన్నాయి. ఏపీ స్థాపిత సామర్ధ్యం 31 అక్టోబర్ 2023 నాటికి 26,706 మెగా వాట్లు. రాష్ట్రం విడిపోయేనాటికి ఏపీ స్థాపిత సామర్ధ్యం 8947 మెగావాట్లు. అంటే 9 ఏళ్లలో ఏపీ సాధించిన వృద్ది 198%. అంటే తెలంగాణ వృద్ది రేటుకన్నా ఎంతో ఎక్కువ.
Ads
CEA రిపోర్టు కోసం ఈ క్రింది లింకు చూడండి: https://cea.nic.in/…/installed/2023/10/IC_OCT_2023-1.pdf
విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్ధ్యం వృద్దిలో తెలంగాణ నంబర్-1” అని మనోళ్ళు చేస్తున్న ప్రచారం శుద్ద అబద్దం అని తేలిపోయింది. స్థాపిత సామర్ధ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఒక రాష్ట్రానికి విద్యుత్ అనేక మార్గాలలో వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి సంస్థ TSGENCO, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న NTPC, NHPC, NPC, NLC లాంటి సంస్థల నుండి మన వాటా, ప్రైవేటు ప్రాజెక్టుల నుండి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా, సంప్రదాయేతర ఇంధనవనరుల ద్వారా (ఇవి కూడా 99% ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి). ఇలాంటి అనేక మార్గాలలో విద్యుత్తు రాష్ట్రానికి అందుబాటులో ఉంటుంది. వీటి నుండి వచ్చే విద్యుత్తు కూడా సరిపోకపోతే, బహిరంగ మార్కెట్ లో మనం “ పవర్ ఎక్స్ ఛేంజెస్” (Power Exchanges) ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ కొనవచ్చు.
మొత్తం 18792 మెగా వాట్ల సామర్ధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో కొత్తగా మొదలు పెట్టి పూర్తి చేసింది కేవలం 1780 మెగా వాట్లు మాత్రమే. అంటే మొత్తం సామర్ధ్యంలో 10% లోపే. మిగతాదంతా ఇతర మార్గాలలో వచ్చిందో, గత ప్రభుత్వాలు సింహభాగం కడితే ఇప్పుడు పూర్తి చేసినవో ఉన్నాయి. ఈ 1780 మె.వా.లో కూడా 1080 మెగా వాట్ల భద్రాద్రి ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున కట్టడంతో చిన్నపాటి వరదలకే మునకకు గురవుతున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చిన్నపాటి వరదకే ఈ ప్రాజెక్టు పూర్తిగా మునగడం ఖాయం.
2014 తరువాత దేశం మొత్తం ఒక విద్యుత్ గ్రిడ్ లా మారింది. కాబట్టి ఒక రాష్ట్రంలో ఎంత స్థాపిత సామర్ధ్యం ఉందనే విషయం అసలు పెద్ద విశేషమే కాదు. మనం దేశంలో ఏ మూలనుండైనా తక్కువ ధరకు విద్యుత్తును కొనే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన భద్రాద్రి ప్రాజెక్టు, భవిష్యత్తులో పూర్తి కానున్న 4000 మెగా వాట్ల యాదాద్రి ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు.
మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనపడుతుంది కదా? అని అనుమానం రావచ్చు. నిజమే. ప్రస్తుతం మనం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడం ద్వారా కొరతను అధిగమిస్తున్నాం. తెలంగాణ ఒక్కటే కాదు, 2015 తరువాత దేశం మొత్తం విద్యుత్ సరఫరా పరిస్తితి మెరుగైంది. దీనికి కారణం దేశంలో గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం, అడపా దడపా సమస్యలున్నా మొత్తం మీద బొగ్గు సరఫరా మెరుగవడం ముఖ్య కారణాలు.
ప్రస్తుతం దేశంలో 20 కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు లేవు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు నామమాత్రం. బహిరంగ మార్కెట్ లో విద్యుత్తును కొనగలిగే ఆర్ధిక స్థోమత ఉంటే ఆ రాష్ట్రాలకు కూడా విద్యుత్ కొరత ఉండదు. (మనం స్థోమత లేకున్నా విద్యుత్ సంస్థల ఆస్తులు పూర్తిగా తాకట్టుపెట్టి విద్యుత్తును కొంటున్న మాట… ప్రభుత్వం సబ్సిడీలు పూర్తిగా చెల్లించక విద్యుత్ సంస్థలు 52 వేల కోట్ల నష్టాలతో ఆర్ధికంగా పూర్తిగా దివాళా తీసినమాట వేరే విషయం…!).
లక్షల కోట్లు పెట్టి పూర్తి చేసిన కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పధకాలు, భద్రాద్రి, యాదాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు నిరర్ధక ప్రాజెక్టులుగా మారి, తెలంగాణ మెడలో మరెన్నో తరాలు గుదిబండలుగా మిగలనున్నాయి…. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజేఏసి)
Share this Article