.
గతం… అంటే, తెలంగాణ ఏర్పడ్డాక కేసీయార్ పాలనలో… అడ్డదిడ్డంగా థర్మల్ ప్లాంట్లు, విద్యుత్తు కొనుగోళ్ల అక్రమాలు, చత్తీస్‌గఢ్ కరెంటు వైఫల్యాలు ఎట్సెట్రా… చివరకు దేశమంతా తిరస్కరించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా తెలంగాణ నెత్తిన రుద్దిన పాలన అది…
ఇప్పుడు… తెలంగాణ పవర్ సెక్టార్‌లో సైలెంటుగా ఓ కొత్త విప్లవం చోటుచేసుకుంటోంది… ఇది అతిశయక్తి కాదు… నవీన విద్యుత్తు రంగంపై ముందుగా చిన్న వివరణ… థర్మల్, హైడల్, సోలార్, విండ్ ఎనర్జీ వంటివి నిన్నమొన్నటిదాకా విన్నాం, ఆధారపడ్డాం…
Ads
కానీ… పంప్డ్ స్టోరేజీ, బ్యాటర్ స్టోరేజీ, హైబ్రిడ్ పవర్… ఇవీ వర్తమాన విద్యుత్తురంగంలో ప్రధానాంశాలు… పంప్డ్ స్టోరేజీ (PSP) అంటే… ఆఫ్ పీక్ అవర్స్‌లో, అంటే కరెంటు గిరాకీ లేనప్పుడు పైన రిజర్వాయర్‌లోకి నీటిని రివర్స్ పంపింగ్ చేసి, పీక్ అవర్స్‌లో, అంటే గిరాకీ ఉన్నప్పుడు మళ్లీ ఉత్పత్తి చేసి వాడుకోవడం, ఇది ఆర్థిక నిర్వహణ…
దాంతోపాటు సోలార్, విండ్ తదితర గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లనూ కలిపితే హైబ్రీడ్… ఉత్పత్తయిన కరెంటును బ్యాటరీల్లో నిల్వ చేసుకుని, గ్రిడ్ అవసరాలున్నప్పుడు వాడుకుంటే అది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ… తెలంగాణలో ఈ పంప్డ్ స్టోరేజీ కెపాసిటీలో ఏకంగా 12,850 మెగావాట్ల మేరకు రానుంది… అన్నీ అనుకున్నట్టు నిర్మించబడితే…
దీనికి ప్రైవేటు- ప్రభుత్వ సంస్థలు కలిపి పెట్టబోయే పెట్టుబడి 71 వేల కోట్లు… ఈ చార్ట్ ఓసారి చూడండి…

ముందుగా ప్రభుత్వరంగంలోని జెన్‌కో ముందుడుగు వేస్తోంది… కల్లూరులో 1500 మెగావాట్ల యూనిట్ స్థాపించబోతోంది.,. ఆరేళ్లలో దీన్ని 7500 మెగావాట్లకు పెంచుతారు… రాష్ట్రంలో ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు అనువుగా 29 సైట్లను గుర్తించారు… ఆమధ్య జరిగిన ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’లో 9 ప్రైవేటు కంపెనీలతో 11,210 మెగావాట్ల కెపాసిటీకి ఒప్పందాలు కుదిరాయి… (సింగరేణికి కూడా మంచి అవకాశం ఉంది, దాని ప్రణాళికలపై క్లారిటీ లేదు)…
ఈ ప్లాంట్లకు ప్రధానంగా ‘ఎత్తు’ కీలకపాత్ర… రెండు రిజర్వాయర్లు, ఒకటి దిగువన, మరొకటి దాదాపు 100 మీటర్ల ఎత్తులో… అందుకే గుట్టలు, పర్వత ప్రాంతాలయితే బెటర్… నీటి సోర్స్ కూడా ముఖ్యం… జెన్‌కో ప్లాంటుకు నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ వాటర్ సోర్స్… డీపీఆర్ తయారవుతోంది… కేంద్రం కూడా ఈ తరహా పవర్ జనరేషన్‌ను ఎంకరేజ్ చేస్తోంది…

పీక్ అవర్స్‌లో పవర్ ఎక్స్‌ఛేంజుల్లో రేటు చాలా ఎక్కువ ఉంటోంది… ఆ సమయాల్లో ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో ఉత్పత్తి చేసుకునే రేటు లాభదాయకం ప్లస్ గ్రిడ్‌పై భారాన్ని తట్టుకోవచ్చు… గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగమే ఇదంతా… మరి ఇది వోకే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ఏమిటీ అంటారా..? అది మరోసారి చెప్పుకుందాం, అవి మరింత ఉపయుక్తం, అందులోనూ తెలంగాణ ముందడుగు వేస్తోంది..!
చివరగా…. పవర్‌ను రకరకాలుగా ఉత్పత్తి చేయవచ్చు, కానీ నీటిని ఉత్పత్తి చేయలేం, అందుకే నీటి నుంచి వీలైనన్ని ఎక్కువసార్లు ‘ఎత్తు’ అనే అడ్వాంటేజ్‌తో పవర్ ఉత్పత్తి చేసుకోవడమే స్థూలంగా పీఎస్‌పీ అంటే..!!
Share this Article