.
ఇంకా ఇంకా రణగొణ ధ్వనులు… ఆ తల్లి చేతిలో బతుకమ్మ లేదట, బంగారు నగలు లేవట… చేయి చూపిస్తే కాంగ్రెస్ తల్లి అట… తెలంగాణ అస్థిత్వం మీద భీకరమైన దాడి అట…
తెలంగాణ చరిత్రకే ద్రోహమట… తమను తాము అభ్యుదయవాదులుగా దశాబ్దాలుగా నీతులు చెప్పుకునే పరమ వీర మేధోరచయితలు కూడా దీనికి ఓ పెద్ద ప్రాధాన్యం ఇస్తూ, ఏదో చారిత్రిక ద్రోహం జరిగిపోతున్నట్ఠు గుండెలు బాదుకుంటున్నారు… సరే, వాళ్ల దాస్యం వాళ్లిష్టంలే గానీ…
Ads
నిజంగానే రేవంత్ రెడ్డి అందరికీ సంతృప్తిపరచాలోయ్ అని తెలంగాణ తల్లి విగ్రహశిల్పి రమణారెడ్డికి ముందే చెప్పి ఉండొచ్చుగా… ఒక్క విమర్శా రాకుండా… సంపూర్ణ విగ్రహం… అనగా… ఎహె సోనియా పోలికలు కాదు…
నిజంగానే ఓ ఆది శక్తికి ఉన్నట్టు నాలుగు చేతులు పెట్టేసి… పోనీ, ఆరు పెట్టండి, మన ఊహాచిత్రమేగా… అభయహస్తం అలాగే ఉండనివ్వండి, లేకపోతే అధిష్టాన దేవతకు ఆగ్రహం రావచ్చు, మన విధేయతకు కళంకం రావచ్చు…
ఒక చేతిలో మన గర్వవంటకం సర్వపిండిని, మరో చేతిలో సకినాన్ని పెట్టి ఉండాల్సింది… మన సంస్కృతి అంటే మన ఆహారపు అలవాట్లు, మన వంటలు కూడా…
మరి వరి, మక్క, జొన్న కంకులు పెట్టారు… ఓ తంగేడు పువ్వు, జమ్మి కొమ్మ కూడా పెట్టేసి… ఒక చేతిలో బతుకమ్మ పెట్టేస్తే సరిపోయేది… మరో చేయి ఉంది కదా… కత్తీకొడవలి పెట్టి ఉండాల్సింది… అయిపాయె… వెనుక ఓ జింక. ఓ భుజంపైన పాలపిట్ట… మన అధికార పక్షి, జంతువులు కదా…
ఇవన్నీ పెట్టేసి… ఓ సంక్లిష్ట, కలగాపులగం, బృహత్ రూపాన్ని ఆవిష్కరించినా సరే… మరి కాకతీయ తోరణం, మన చార్మినార్ ఏవి..? ఇది కాదా తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ అస్థిత్వం మీద దాడి అని మొదలు పెట్టేవారేమో…
ఆకుపచ్చని చీర హరిత తెలంగాణకు సంకేతం సరే,.. కానీ దానికి బంగారమో, కాషాయమో అంచు దేనికి..? అంటే బీజేపీకి స్నేహసంకేతాలు ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి..? గులాబీ రంగు పెట్టొచ్చు కదా… ఇవన్నీ లేవు అంటే కేసీయార్ ముద్రల్ని చెరిపివేయడమే కదా… హమ్మ, రేవంతుడూ… ఇంత తెగిస్తావా..? చూస్తాం..!! (జస్ట్, సరదాగా…)
చివరగా… సీరియస్‌గానే… ఒక ప్రాంత అస్థిత్వం విగ్రహాల్లో, చిత్రపటాల్లో, అధికారిక చిహ్నాల్లో మాత్రమే ఉండదు… వాటిల్లో మార్పులు చేస్తే అదేమీ అస్థిత్వానికి ద్రోహమూ కాదు…!! ఆ పేరుతో రాజకీయ ఫాయిదా కోసం ఎమోషన్స్, సెంటిమెంట్స్ రాజేసే ప్రయత్నాలూ చెల్లవు..!!
ఏమాటకామాట… ఎవరో ఎమ్మెల్యే 70 శాతం ఇళ్లల్లో బతుకమ్మ ఆడరు అంటాడు… మరొకాయన కొద్దిమంది అగ్రవర్ణ మహిళలు మాత్రమే ఆడుకునేది బతుకమ్మ అంటాడు… ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు మాత్రం గర్హనీయం… మన సంస్కృతిని మనమే కించపరుచుకోవడం… ప్చ్, కాంగ్రెస్ అది, ఎవరి నోటిని ఎవరు అదుపు చేయగలరు..?!
Share this Article