ఓ సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది… ఎందుకంటే, ప్రవల్లిక చనిపోగానే, విషయం తెలిసి, ఇది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అర్థం చేసుకుని, వెంటనే మార్చురీకి తరలించలేని వైఫల్యానికి అట… ప్రతిపక్షాలు, విద్యార్థుల గగ్గోలుకు ఓ సీఐ బలి… అంతే, ఇంకేమీ మారదు, ఆ కమిషన్ ఛైర్మన్ అలాగే ఉంటాడు… లీకేజీలు, ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యుడిగా ఆయన అలాగే కొనసాగుతూ ఉంటాడు…
ఈ వార్త చదివాక రెండు మది కలుక్కుమనే పోస్టులు కనిపించాయి సోషల్ మీడియాలో… ప్రవల్లిక ఆత్మహత్యకు కారణాలేమిటో, ఆధారాలేమిటో చెప్పడానికి నేనిక్కడ ప్రయత్నించడం లేదు… ఆమె మరణానికి నోటిఫికేషన్ల వాయిదాలు కారణం కాకపోవచ్చుగాక… (ఆమె హాల్ టికెట్ కూడా సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి, సర్కారీ అబద్దాల్ని ఎండగడుతున్నారు) కానీ ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వాన్ని జోకే పాత్రికేయం నుంచి మరీ ఇంత నిర్దయ స్పందనలు అవసరమా…? వ్యాఖ్యలు చేసేముందు హ్యూమన్ టచ్ అవసరం లేదా..?
Siddartha Kallepelly…. ఆ మధ్య ఒక మహిళ మావోయిస్ట్ చనిపోయినప్పుడు ఆమెకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్…. అసలు ఆమెకి వెజైన లేదు. తుపాకీకి వెనక వైపు ఉండే బట్ ని లోపల పెట్టి చిత్రహింసలు పెట్టినట్టున్నారు అంటూ కన్నీళ్లు కారుస్తూ చెప్పింది.
Ads
కానీ… చనిపోయిన వ్యక్తికి కనీసం కన్నెపొర కూడా చినగలదు అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఇది పోలీసుల మెకానిజం. ఈ మధ్య కూడా కొంత మంది ప్రోగ్రెసివ్, కమ్యునిస్టు, ఫెమినిస్ట్, బ్లా బ్లా బ్లా అంటూ చెప్పుకునే జర్నలిస్ట్ మిత్రులు, మిత్రురాళ్లు కూడా అలాగే పార్ట్ టైం జడ్జిలు అయ్యారు.
గ్రూప్ 1 లీక్ అయిందని ప్రభుత్వం ఒప్పుకొని కొందరిపై చర్యలు తీసుకున్నాక కూడా….జనార్ధన్ రెడ్డి సారు మంచోడు… గ్రూప్ 1 లీక్ అయి ఉండదని అన్నారు. టెన్త్ పేపర్ లీక్ అయిందని ప్రభుత్వం ఒప్పుకోని కొందరిపై చర్యలు తీసుకున్నాక కూడా…సబితా మేడం మంచిది. లీక్ అయి ఉండదు అన్నారు. ఇప్పుడు ప్రవళికకి ఏదో ఎఫైర్ ఉందంట పోలీసులు, ఆ అమ్మాయి రూం మేట్స్ చెబుతున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఆ అమ్మాయికి ఎఫైర్ ఉందని వాళ్ల అమ్మానాన్నలకు తెలుసంట అని మరికొందరు తీర్పులు ఇచ్చారు. ఓ నా మిత్రులారా…. పోలీసులు/ ప్రభుత్వం ట్రాప్ లో పడినా పర్వాలేదు… వాళ్ల కంటే అడ్వాన్స్ గా ఉరకకండి.
తద్దినానికి ఎదురుచూస్తున్నారు ఆమె బలగం. స్వతంత్ర తెలంగాణలో చావు కూడా పెళ్లి లాంటిదే కదా, ఇక్కడ పెళ్లి చేసి, పాడె మీద మోశారు. రేపు ఒకవేళ లగ్గం అయినా కన్నవాడో, కట్టుకున్న వాడో చేసిన అప్పుకు మిత్తి కట్టలేకనో ఏ అపరాత్రో గొంతు పిసకడు అని గారెంటీ లేదు. బ్యాంకు వడ్డీలు కట్టలేక ఉరితాడుని ముద్దాడడనే గారెంటీ లేదు. ఇక్కడ చావు పరివ్యాప్తం అయ్యింది. ఇది నగరంలో జరిగింది కాబట్టి మనకు తెలిసింది. తెలియని కాస్టాలు యెన్నో…
ఎవరా పిల్లలు ? ఎన్ని వందల మంది కళ్ళ ముందే నిప్పు అంటించుకొని భగ్గున మండిన వాళ్ళు, రాజ్యం కసాయితనానికి నిలువెల్లా గాయమయి శరీరం చిల్లుల జల్లెడలాగా మారిన వీరులు, కొన్ని తరాలకు కథలుగా చెప్పుకోగల గతాన్ని మిగిల్చిన అమరులు , రేపటి మెరుగయిన కాలం కోసం కత్తుల వంతెన మీద సవారీ చేస్తున్న ఎందరో బలయి పోయారు .
ఎవరా పిల్లలు, అందులో రేపు మన పిల్లలు ఉండరా ? ఉరితాడుని ముద్దాడిన తెగువకు మిగిలిన ఆశల పొదలు కాదూ ? తగలబడిన కమురు వాసన ఆనవాళ్లు కాదూ ? పైసా పైసా జమేసి కడుపు మాడ్చుకొని, అవ్వ అయ్య పంపిన కలలు కావు , ఎందుకు పిట్టల్లా రాలుతున్నారు ? తెలంగాణ అణువణువూ ఆవహించిన నిస్సత్తువ. పరివ్యాప్తం అయ్యింది. చావు పెద్ద పిట్ట అరుపులా తీతువులా పిలుస్తోంది…
నిన్న జరిగిన ఎంగిలి పూల బతుకమ్మ పూట ప్రవళిక ఇంట్లో ఎంగిలి ముట్టలేదు. కన్న బిడ్డ కదా . పరాయి పిల్లల శవాల మీద సౌధాలు నిర్మించుకున్న కంకాళాలకేం తెలుసు బ్రతుకు తీపి. చావంటే కేవలం ఒక అంకెనేనా, చావంటే ఒక నిష్క్రమణ నేనా ?
పండిన ధాన్యం అమ్ముకుని కన్న బిడ్డలను పట్నం చదువులకు పంపిస్తూ కన్నీటి పొరలు కదులుతున్న కళ్ళతో వీడ్కోలు చెప్పిన తండ్రులు గవిడి దగ్గర సైరన్ మోత వినకూడదు అని ప్రణమిల్లుతున్నారు. అసలు ఎవరిదీ తెలంగాణ ? ముచ్చటగా మూడోసారి చావులను అపహాస్యం చేయడానికి సిద్దమయ్యారు పాలకులు. కొత్త వాగ్దానాలు. ఇచ్చిన వాగ్ధానాలలో మునిగి ముసుగేసిన వోటరు ముందు మరికొన్ని అలవిగాని వాగ్దానాలు వచ్చాయి. వాటిదేముంది ఆర్చేవా తీర్చేవా ?
ఎందుకు పండగ ముందు ఒక బిడ్డ ఊపిరి తీసుకుంది ? వచ్చిన లక్షలాది తెలంగాణ ఆశల రూపాలు కాదా ఆ బిడ్డలు. దశాబ్దాల తండ్లాట ఇటుకా ఇటుకా పేర్చి కట్టుకున్నఆశల సౌధం కాదా వాళ్ళ కలలు, ఎవరు ఆ కళ్ళను చిదిమేస్తున్నారు ? ఎందుకు తెలంగాణ అశృకణం అయ్యింది ?
కాస్టాల పాలు అవుతోంది, కన్నీటి వరదలు అవుతున్నాయి ? చెలియలి కట్ట దాటని వాగ్దానాల పిలుపు ఏదో పెద్ద పిట్టలా అరుస్తోంది. పాలపిట్ట పారవశ్యాలలో మునిగే అబద్దపు కోయిలలకు ఆ చావు పెట్టుబడి అవుతుంది తప్ప, తాము కనలేదు కదా ?
ఆ అమ్మాయి గ్రూప్ టు పరీక్షకు అప్లయ్ చేయలేదు అంటాడు ఒక మంత్రి, అసలా అమ్మాయి చదువుకోవడానికి రాలేదు, ప్రియుని కోసమే వచ్చి, లగ్గం కుదరక, ఉరిబెట్టుకుని రాష్ట్ర పరువు తీస్తోంది అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజారు పాలు చేసాడు ఇంకొక పోలీసు. ప్రవళిక లవర్ దొరికాక అతని మాటలు కూడా విందాము’ అంటాడు ఓ పాత్రికేయుడు.
దానికి చీర్ లీడింగ్ చేసేవాళ్ళు మరికొందరు. ఇలాంటి పాత్రికేయుల మాటలు వింటే కడుపు రగిలి పోతోంది. చావుని రాజకీయం చేస్తున్నారు అంటాడు ఒక మేధావి. చావులను గ్లోరిఫై చేయడం మూలంగానే ఆ మంత్రి, ఆ పాత్రికేయుడు, ఆ మేధావి కాస్త డబ్బు, మూడు నాలుగు అవార్డులు, పదవులు, దందాలు, చందాలు పొందుతున్నారు.
పదిసార్లు పరీక్ష పేపర్ రద్దు, కిలోల లెక్క ప్రశ్న పత్రాలు కొనుక్కుంటూ కోట్ల రూపాయలు జమజేసుకున్న దొంగలను పట్టుకోలేని పాలన గంటలోనే ఉన్నాడో లేడో కానీ ఆమె ప్రియుణ్ణి పట్టుకున్నారు. ఇది కదా ట్విస్ట్. ఒరే, మీరు మనుషులు కాదురా … మీకన్నా మనుబోతులు నయం. మను సంతానాలురా మీరు. పచ్చటి బ్రతుకుల్లో నిప్పులు పోస్తున్నారు…
Share this Article