Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు ఎడిటర్లు ఎప్పుడైనా తమ ఈ-పేపర్లు ఓపెన్ చేసి చూస్తారా..?!

December 22, 2021 by M S R

పెద్ద పెద్ద మీడియా ప్లేయర్లు ప్రాంతీయ భాషల డిజిటల్, వెబ్ జర్నలిజంలోకి ప్రవేశిస్తున్నాయి… ప్రింట్ మీడియా దెబ్బతినడం ఒక కారణం కాగా, వెబ్ జర్నలిజంలోకి యాడ్స్ సొమ్ము బాగా వచ్చిపడుతోంది… ఇంకా పెరగనుంది… లక్షల మంది పాఠకులు కరోనా కాలంలో పత్రికల్ని తెప్పించుకోవడం మానేశారు… సమాచారం కోసం నెట్‌లో ఈ-పేపర్ల మీద, వెబ్ సైట్ల మీద, సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు… పైగా అన్నీ ఏవో పార్టీలకు డప్పు పత్రికలే కదా, ఆమాత్రం దానికి అంత కవర్ ప్రైస్ చెల్లించడం దేనికి..? టీవీలో వార్తలు చూస్తే సరిపోదా..? స్మార్ట్ ఫోన్‌లో వార్తల సైట్లు ఓపెన్ చేస్తే సరిపోదా అనే భావన ఇంకా పెరుగుతూనే ఉంది… ఈ స్థితిలో ఈ-పేపర్ల ప్రాధాన్యం, చదివే పాఠకుల సంఖ్య బాగా పెరుగుతోంది… కానీ మన మెయిన్ స్ట్రీమ్ తెలుగు పత్రికలకు వాటిపై ఇప్పటికీ పట్టుచిక్కడం లేదు, పైగా ఉన్నవాటినే చెడగొట్టేస్తున్నారు… ఉదాహరణ, ఆంధ్రజ్యోతి ఈ-పేపర్‌లో తాజా మార్పులు…

ఒకప్పుడు దిహిందూ పత్రిక కాలంతోపాటు వచ్చే మార్పుల్ని అంచనా వేయలేకపోయింది, ఎప్పటికైనా ప్రింట్ ఎడిషన్లదే ప్రాభవం అని మొండిగా వాదించింది… పేజీలు పెంచేసింది… చివరకు నష్టాలు నషాళానికి అంటి, నాలుక కర్చుకుని, లోలోపల గుంజీలు తీసి, ఇప్పుడు ఈ-పేపర్‌ మీద కాన్సంట్రేట్ చేస్తోంది… అంతేకాదు, ఈ-పేపర్‌కు చందాలు కూడా వసూలు చేస్తోంది… అఫ్‌కోర్స్, టైమ్స్, ఎక్స్‌ప్రెస్ వంటి పెద్ద ఇంగ్లిష్ పత్రికలన్నీ డబ్బులు వసూలు చేస్తున్నాయి… తెలుగులో ఇంకా పాఠకుల డేటా సేకరణ, రిజిస్ట్రేషన్ల దగ్గరే ఆగిపోయాయి పత్రికలు… దిశ వంటివి మధ్యమధ్యలో డైనమిక్ ఎడిషన్ అని వదులుతున్నయ్, నిజానికి అనవసరం… ఎలాగూ వెబ్ సైట్‌లో వార్తలు అప్ డేట్ అవుతున్నప్పుడు ఇంకా ఈ-పేపర్ల డైనమిక్ ఎడిషన్లు ఎవరికి..? కొన్ని పత్రికలు అచ్చంగా వాట్సప్పులో ఈ-పేపర్లుగా మాత్రమే కనిపిస్తున్నయ్… ఏదో ఐఅండ్‌పీఆర్ విభాగం కోసం మొక్కుబడిగా కొన్ని పత్రికలు ప్రింట్ చేస్తున్నయ్, అంతే…

epaper

Ads

నిజానికి డిజిటల్ వార్తలు, టీవీ వార్తలు ఎప్పటికప్పుడు సమాచారపరంగా పాఠకుల్ని అప్‌డేట్ చేస్తూనే ఉన్నయ్ కాబట్టి రాబోయేకాలంలో ఈ-పేపర్లు కూడా తమ ప్రాధాన్యం కోల్పోతాయి… ఇంగ్లిష్ పత్రికలు తమ మెయిన్ ఎడిషన్లను యధావిధిగా ఎడిషన్ ప్రాంతాల వారీగా అప్‌లోడ్ చేసేస్తున్నయ్… లోడింగ్ స్పీడ్ ఎక్కువ… పాఠకుడికి రీడ్ ఫ్రెండ్లీ… మెయిన్ స్ట్రీమ్ తెలుగు పత్రికలకొద్దాం… మెయిన్ ఎడిషన్లను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది కదా, లోకల్ పేజీలు కావాలనుకునే పాఠకుడు ఎవరైనా తమకు కావల్సిన జిల్లా, జోన్ పేజీలను సెలెక్ట్ చేసుకుని చదువుతాడు… అలాంటప్పుడు మెయిన్ ఎడిషన్ ఈ-పేపర్లలో ఏదో ఒక జిల్లా, జోన్ పేజీలను ఎందుకు యాడ్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు…

ఉదాహరణకు… ఈనాడు మెయిన్ ఎడిషన్ తీసుకొండి, తెలంగాణ ఎడిషన్ అయితే పాత కరీంనగర్ జిల్లా వార్తలు, ఏపీ ఎడిషన్ అయితే అమరావతి లోకల్ వార్తలు కనిపిస్తాయి… అవి మాత్రమే ఎందుకు..? ఎలాగూ ఆ ప్రాంత వార్తలు కావాలనుకునేవాళ్లకు తమకు కావల్సిన జిల్లా, ప్రాంత వార్తలు ఎంచుకుని చదువుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మెయిన్ ఈ-పేపర్‌తోపాటు రుద్దడం దేనికి..? అనంతపురంలో ఉండే పాఠకుడికి వుయ్యూరులో బైక్ చోరీ వార్త మీద ఆసక్తి ఏముంటుంది..? కామన్ సెన్స్ పాయింటే కదా… ఐనా అంత సూక్ష్మ స్థాయికి వెళ్లి ఆలోచించే స్థూల దృష్టి లేకపోవడం…! పైగా ప్రింట్ ఎడిషన్‌ను మాత్రమే ఈ-పేపర్‌గా పబ్లిష్ చేయకుండా, కేవలం డిజిటల్ పేజీలు కొన్ని యాడ్ చేస్తోంది ఈనాడు… పెద్ద క్వాలిటేటివ్ వార్తలేమీ ఉండవు, ప్రింట్‌లో అకామిడేట్ చేయలేని వార్తల్ని ఆ పేజీల్లో పరిచేస్తోంది… అంటే, పేరుకు పేజీల సంఖ్య ఎక్కువ… అంతే… ఈనాడు ఈ-పేపర్ స్పీడ్ చాలా తక్కువ… మెల్లిగా ఓపెన్ అవుతాయి… లో స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఉన్నవాళ్లకు మరీ ఇబ్బంది… రీడర్ ఫ్రెండ్లీ ఈ-పేపర్ అనేది ఓ ఆర్ట్, ఓ విద్య మాస్టారూ…

ఆంధ్రజ్యోతి ఈ-పేపర్ మొదట్లో బాగుండేది… ఈమధ్య మార్పులు చేశారు, ఏదో చేయబోతే ఏదో అయ్యింది… రిజిస్ట్రేషన్ వరకూ వోకే… కానీ ప్రతిసారీ లాగిన్ కావాలి… సేమ్, ఓపెన్ చేస్తే చాలు ఏవేవో జోన్ పేజీలు కనిపిస్తాయి… అదికాదు అసలు సమస్య… ఒకసారి ఒక ఎడిషన్ ఎంచుకుని చదివాక, తిరిగి హోమ్ పేజీకి సరిగ్గా వెళ్లలేం, ఇంకేదో ఎడిషన్ ఓపెన్ చేద్దామనుకుంటే కుదరదు, మళ్లీ బయటికి వచ్చేసి, మళ్లీ తాజాగా ఓపెన్ చేసుకోవాలి… అత్యంత దరిద్రంగా ఉన్న ఈ-పేపర్ ప్రస్తుతం ఎవరిదయ్యా అంటే అది ఆంధ్రజ్యోతిదే… ఉన్నంతలో సాక్షి కాస్త బెటర్‌గా ఉంది… స్పీడ్ కూడా పర్లేదు… కానీ ఒకటీరెండు డిజిటల్ పేజీల ప్రత్యేక ఎడిషన్ పరమ శుద్ధ దండుగ యవ్వారం…

నమస్తే తెలంగాణ ఈ-పేపర్ కూడా కాస్త రీడర్ ఫ్రెండ్లీయే… కాకపోతే ఈమధ్య స్పీడ్ తగ్గింది… వెలుగు ఈ-పేపర్ వోకే… కాకపోతే కేవలం మెయిన్ ఎడిషన్‌కే పరిమితం గాకుండా మధ్యలో జిల్లా పేజీలు ఇరికించేస్తున్నారు… దిశ అదోరకం విచిత్రం… అన్ని పేజీలు కనిపిస్తయ్… మెయిన్ పేజీలు పెట్టేసి, జిల్లాల వారీగా కేటగిరైజ్ చేయాలి, టెక్నికల్ సోయి పెద్దగా లేనట్టుంది… నవతెలంగాణ వంటివి ఏడెనిమిది పేజీల్లోనే వార్తల్ని సరిపుచ్చేస్తయ్..! సో, మన పత్రికలు ఈ-పేపర్ దిశలో ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది… ఎడిటర్లకు, నిర్ణయాలు తీసుకునే పెద్దలకు ఈ డిజిటల్, వెబ్ ఎడిషన్ల మీద ఆసక్తి, గానీ, కాలానుగుణ ట్రెండ్స్ పట్టుకునే ఆ శక్తి గానీ లేకపోవడం వల్ల ఈ దురవస్థ..! తమ పత్రికల ఐటీ విభాగాలకు అప్పగించేస్తే ఇలాగే ఉంటుంది మరి..! పత్రికల పేజీనేషన్, గట్టర్, ఫాంట్ సైజ్, లైన్ల నడుమ గ్యాప్, బాక్సులు, గీతలు, కాలమ్స్‌కు కూడా ఓ లెక్క ఉంటుంది… లుక్కు మీద, డిజైన్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది… ఎటొచ్చీ ఈ-పేపర్ల టెక్నికాలిటీసే ఎవరికీ పట్టవు.!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions