తెలుగు వార్తల తొలి టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూసిన సమాచారం తెలిసిన వెంటనే తెలుగునాట రెండు తరాల వారు దూరదర్శన్ స్మృతుల్లోకి వెళ్లారు. 1980లలో అప్పుడప్పుడే టీవీలు ఇళ్లల్లోకి చొరబడుతున్న కాలంలో శాంతిస్వరూప్ ప్రతిరోజూ మోసుకువచ్చే వార్తల మూట ఒక ఆకర్షణగా నిలిచేది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను శాంతిస్వరూప్ తనదైన శైలిలో ప్రజెంట్ చేసేవారు. ఆయన పని కేవలం వార్తలు చదవడం వరకే. వాస్తవానికి వార్తల సేకరణ, ఎడిటింగ్ బాధ్యతలను తెరవెనుక బృందం చేసేది. అయితే ఈ బృందం పడిన శ్రమ జనంలో ఫలించాలంటే న్యూస్ ప్రజెంటరే కీలకం.
శాంతిస్వరూప్ అక్కడే సక్సెస్ అయ్యాడు. పదాల విరుపు, పదాల ఒడుపుతో పాటు స్పష్టత, స్వచ్ఛత.. శాంతిస్వరూప్ వాచకంలో సంలీనమై కనిపిస్తాయి. అది ఏ రకమైన వార్త అయినా సరే సంయమనంతో, సమన్వయంతో చదవడంలో స్వరూప్ తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నారు. బహుశా.. అందుకే ఆ రోజుల్లో స్వరూప్ తన సమకాలికులకు భిన్నంగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. వార్తలతో మమేకత కావడం అనేది ఆయనలోని గొప్ప లక్షణం.
అయితే విషాదకర వార్తలను, సంతోషకర వార్తలను ఒకే హావభావాలతో చదువుతాడనే కామెంట్ ఒకటి స్వరూప్‌ను తొలినుంచీ వెన్నాడుతూ వచ్చింది. అది ఆయన మ్యానరిజం కావొచ్చు. లేదంటే తనకంటూ సృష్టించుకున్న స్టైల్ కావొచ్చు. హాస్యనటుడు బ్రహ్మానందం ఒక సినిమాలో శాంతిస్వరూప్‌ను అనుకరించి తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించాడు. శాంతిస్వరూప్ వాచకాన్ని చూసి తెలుగు పదాలను ఎలా పలకాలో, ఎల పలకకూడదో నేర్చుకున్న వారు ఎందరో వున్నారు. తెలుగు న్యూస్ రీడింగ్‌కు శాంతిస్వరూప్ ఆద్యుడు మాత్రమేకాదు, ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచారు. టెలీ ప్రాంప్టర్ లేకుండానే తన ఏకసంధాగ్రహ శక్తితో వార్తలను ముఖాముఖి వడ్డించి ప్రేక్షకులను అలరించారు.
నేటి శాటిలైట్, యూ-ట్యూబ్ చానెళ్ల జమానాలో న్యూస్ రీడర్లు పోయి యాంకర్లు పుట్టుకొచ్చారు. అనేక చానెళ్లలో తెలుగు న్యూస్ రీడింగ్ ఇప్పుడొక ప్రహసనంగా మారింది. తెలుగు భాషను ఖూనీ చేస్తూ, పదాల నడ్డి విరగ్గొడుతూ యాంకర్లు చేసే వీరంగం ఒక్కోసారి విస్తుగొలుపుతుంది. context కు సంబంధం లేకుండా text ను ఎడాపెడా చదవడంలో ఒకరిని మించి ఒకరు దూసుకుపోతున్నారు.
Ads
డెస్కుల్లో శుద్ధి చేసి ఇచ్చే స్క్రిప్టుపై కనీస అవగాహన తెచ్చుకోకుండా, ఏ పదాన్ని ఎక్కడ ఎలా పలకాలో తెలుసుకోకుండా, ఫుల్‌స్టాప్‌లు, కామాలను మింగేసి చిందేసే యాంకర్లదే ఇప్పుడు రాజ్యం. ఇంగ్లిషు మీడియాల్లో చదివి అటు ఇంగ్లిషుపైన, ఇటు తెలుగుపైనా పట్టు లేక కేవలం ‘గ్లామర్ గ్రామర్’తో నెగ్గుకొచ్చే, నెట్టుకొచ్చే యాంకర్లదే ఇప్పుడు హవా. అందుకే చానెళ్లలో రకరకాల తెగుళ్లతో తెలుగు భ్రష్టు పట్టిపోతోంది.
వృత్తిని నిజాయితీగా ప్రేమించి, అందులోనే గాఢంగా లీనమైన శాంతిస్వరూప్‌లు ఇప్పుడు అరుదు. ఆయన శైలికి సామీప్యంగా ఉండే యాంకర్లు ఒకరో ఇద్దరో తేలినా చానెళ్లలో తెలుగు బతికి బట్టకడుతుంది. అదేదో లోకమేదైనా ఉంటే అక్కడా మీ వార్తావాచకంతో అలరించండి శాంతిస్వరూప్ గారు. ….. By -Shankar Shenkesi…. 99854 11662
Share this Article