మన హీరోలు… వాళ్ల లోకం వాళ్లదే… సోషల్ ఇష్యూస్ సమయాల్లో కూడా కనిపించరు… తమను ఇంతవాళ్లను చేసిన జనానికి మనం ఏమైనా చేద్దామనే సోయి కూడా చాలామందిలో ఉండదు…
సరే.., స్పందించే గుణం, ఔదార్యం ఒకరు నిర్బంధించి డిమాండ్ చేస్తే వచ్చేవి కావు… కానీ కనీసం దేశం, మన పరువు గురించి ఆలోచించాల్సిన సందర్భాల్లో కూడా నిర్లక్ష్యంగా, తమకు అవేమీ పట్టని అంశాలు అన్నట్టుగా వ్యవహరించడం కరెక్టు కాదు…
నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… వార్త వేయడం తప్పు కాదు, రీడర్‌షిప్ ఉండే సినిమా సెలబ్రిటీల వార్త కాబట్టి బాగానే బాక్సు కట్టి ‘ఒకే ఫ్రేములో ఐదుగురు హీరోలు’ అనే ఓ టైటిల్ పెట్టి బాగానే పబ్లిష్ చేశారు…
Ads
అది చదివాకే కాస్త కలుక్కుమంది… వార్తాంశం ఏమిటంటే..? తెలుగు స్టార్స్ చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, అఖిల్, రాంచరణ్… మూడు తరాలకు చెందిన హీరోలు ఒక్క చోట కలిశారు… విందు ఆరగిస్తున్నారు… నమ్రత, ఉపాసన కూడా ఉన్నారు అక్కడ… పర్లేదు, సినిమా అభిమానులకు నచ్చే వార్తే…
కానీ తరువాత వాక్యాలు ఏమిటంటే..? ఓ పారిశ్రామికవేత్త పుట్టినరోజు వేడుకల్లో కలుసుకున్నారట, అదీ వోకే… వేదిక మాల్దీవులు అట…! అదుగో అదీ నచ్చనిది… హీరోలు, హీరోయిన్లు ఒకేచోట కలవడం అనేది సినిమా అవార్డుల ఫంక్షన్లలో సాధారణం… అది పెద్ద విశేషం కాదు గానీ… మరీ మాల్దీవులకు ఎందుకు వెళ్లినట్టు..?
ఆ ప్రభుత్వం ఇండియా మీద విషం కక్కుతోంది… ఆ మంత్రులు బహిరంగంగానే దూషిస్తున్నారు… మనం చేసిన సాయాన్ని సముద్రంలో కలిపేసి, మనల్నే కాటేయడానికి చైనాతో చేతులు కలుపుతోంది… మనకే ప్రమాదకరం అవుతోంది… ఇన్నేళ్లూ మన మీద బతికి మనల్నే తూలనాడుతోంది…
సాక్షాత్తూ మోడీయే ఓ గుణపాఠం చెప్పడానికి… పనిలోపనిగా మన టూరిజాన్ని డెవలప్ చేయడానికి లక్షద్వీప్ మీద ఫోకస్ పెట్టాడు… తనే ప్రచారానికి పూనుకున్నాడు సముద్రం ఒడ్డున కుర్చీ వేసుకుని కూర్చుని..! ఈ వివాదం తరువాత వేల మంది భారతీయులు కావాలనే మాల్దీవుల పర్యటనల్ని రద్దు చేసుకున్నారు…
కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు… మన లక్షద్వీప్ కూడా ఆకర్షిస్తోంది… ఇదంతా మీడియాలో ప్రముఖంగానే వస్తోంది… మరి ఈ మూడు తరాల హీరోలు అక్కడికి ఎందుకు వెళ్లినట్టు..? ఇది దేశం ఇజ్జత్‌కు సంబంధించిన ఇష్యూ… కనీసం ఇదైనా ఆలోచించరా..? ఈ దేశానికి మీరేమీ ఇవ్వనక్కర్లేదు గానీ కనీసం ఇలాంటి ఇష్యూస్ అసలేమీ పట్టవా..? ప్చ్… ఏమీ బాగాలేదు హీరోస్… నో, యువార్ నాట్ హీరోస్…!!
Share this Article