వరద నీరు ముంచెత్తినప్పుడు ఒక బాధ… వరద నీరు తగ్గాక జరిగిన నష్టం చూసుకుని మరో బాధ… పాత వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాల పరిస్థితి అదే… ప్రత్యేకించి మోరంచపల్లి వంటి పల్లెలు దారుణంగా దెబ్బతిన్నాయి… అంతెందుకు..? హిస్టారిక్ భద్రకాళి చెరువుకు గండి సహా ఇప్పటికీ అనేక కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి…
ఒక్కొక్క ఇంట్లో మూణ్నాలుగు అడుగుల నీరు, బురద… తిరిగి ఈ జీవితాలు యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో..? ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే… వరుస సమీక్షలు ఎక్కువగా, ఉద్దరించేది తక్కువ… పత్రికల్లో, టీవీల్లో వార్తలు రాసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి ఆ వీడియోలు, ఫోటోలు…
మావంతు సాయం చేస్తామనే సంకల్పంతో కొన్ని ప్రాంతాలకు నిత్యావసరాలను తీసుకెళ్లిన శ్రేయాస్ మీడియా వరద బాధితుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని ఊహించలేదు… ఒక రైతు ఏడుస్తూ ‘‘ఇంట్లో 18 క్వింటాళ్ల ధాన్యం నిల్వ చేశాను… ఇప్పుడంతా కొట్టుకుపోయింది… తినడానికి మీరిచ్చిన 10 కిలోల బియ్యం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’’ అని వాపోయాడు… వెళ్లిన టీం నోటమాట రాలేదు…
Ads
పొలిటిషియన్స్ కూడా వెళ్తుంటారు… అంతా బాగున్న రోడ్డు, కార్లు వెళ్లే అవకాశమున్న చోట్లకు మాత్రమే వెళ్లి కంటితుడుపు పరామర్శలతో ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారు… పొలిటిషియన్స్‌కు ప్రచారం కావాలి, అంతే… ఎమ్మెల్యే సీతక్క కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా వెటకరిస్తున్నారు కొందరు… కనీసం ఆమె వరద ప్రాంతాలకు వెళ్తోంది కదా, ఆమెకు చేతనైనంత సాయం చేస్తోంది… అదంతా ప్రచారం కోసమంటూ ఈ వెక్కిరింపులు దేనికి..?
ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి… వరంగల్ పరిస్థితిని ఇలా తయారు చేసింది నాయకులే… ఒకప్పటి కాకతీయుల రాజధాని గుండె అక్షరాలా చెరువు ఈరోజు… వరదొస్తే నీళ్లు రావా మరి అని సోషల్ మీడియాలో నవ్వుతున్నవాళ్లు కూడా కనిపిస్తున్నారు… వాళ్ల ఇళ్లు మునిగిపోతే కదా ఆ బాధ ఏమిటో అర్థమయ్యేది… పైగా వరదను రాజకీయం చేయకండి అంటూ శుష్క బోధలు…
హైదరాబాదులో ఉండి ఎన్నయినా మాట్లాడొచ్చు… ఐరనీ ఏమిటంటే… హైదరాబాద్ పరిస్థితే బాగోలేదు… మన సినిమా వేల కోట్ల స్థాయికి, పాన్ వరల్డ్ స్థాయికి చేరింది… మన హీరోలు ఇండస్ట్రీలో దుమ్మురేపుతున్నారు… ఒక్కరంటే ఒక్కరికీ స్పందన లేదు… ఏటా కొన్ని వందల కోట్లను సొసైటీ ఇస్తోంది… ఆ సొసైటీకి అవసరమున్నప్పుడు తిరిగి అందులో కొంతైనా ఇవ్వాలనే సోయి కనిపించడం లేదు…
ఇదే తమిళనాడులో అయితే ఏ విశాలో, ఏ లారెన్సో ముందుకొస్తారు… మరి తెలుగు ఇండస్ట్రీలో..? కరోనా సమయంలోనే ఇళ్లల్లో పెసరట్లు వేసుకుంటూ, బోళ్లు తోముకుంటూ ఫోటోలుకు ఫోజులిచ్చుకుంటూ శుష్క ప్రచారం పొందారు తప్ప నిజంగా సాయం చేయడానికి ముందుకొచ్చిన చేతుల్లేవు… పే-ద్ద పే-ద్ధ హీరోలు బహిరంగ వేదికల మీద నీతులు చెప్పడం కాదు… సొసైటీకి ఏదైనా కాస్త మేలు చేయండి… మిమ్మల్ని డెమీ గాడ్స్‌ను చేసిన ప్రజలను ఉద్దరించడానికి మీరు గాడ్స్ కానక్కర్లేదు… జస్ట్, మనుషులుగా స్పందించండి…
Share this Article