నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షో చాలా బాగుంటోంది… ఆర్కెస్ట్రా ఓ పే-ద్ద ప్లస్ పాయింట్… ఈసారి శివమణి వచ్చాడు… కంటెస్టెంట్లు పాటలు పాడారు… ఆహా ఓహో… మెచ్చేసుకున్నారు… పోయినసారి హరిప్రియకు స్పాట్ పెట్టినట్టే ఈసారి శ్రీ ధృతికి స్పాట్ పెట్టినట్టున్నారు చూడబోతే… ఇద్దరూ బాగా పాడగలిగేవాళ్లే… కాకపోతే దిక్కుమాలిన వోట్ల ప్రక్రియలో వెనుకబడినట్టున్నారు…
శ్రీ ధృతి, శ్రీకీర్తి మాత్రమే కాదు… కీర్తన కూడా గతంలో సూపర్ సింగర్ జూనియర్స్‌లో పార్టిసిపేట్ చేసిందే… రజినీ శ్రీ పూర్ణిమ పాడుతా తీయగా 2021లో కంటెస్టెంట్… భరత్ రాజ్ సరిగమపలో కంటెస్టెంట్… అనిరుధ్ హిందీ ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ వెళ్లినట్టు గుర్తు… ఇలా దాదాపు సగం మంది ఎంతోకాలంగా వివిధ కంపిటీషన్లలో పాల్గొంటూ సాధన చేస్తున్నవాళ్లే…
కాకపోతే ప్రతి మ్యూజికల్ కంపిటీషన్ షోలోనూ ఒకే తరహా పాటలు… ఒకరకమైన పిచ్చి ధోరణిలో కొట్టుకుపోతున్నాయి ఈ షోలు… ఎవరు గెస్టుగా వస్తే వాళ్లకు సంబంధించిన పాటల్నే కంటెస్టెంట్లు పాడాలని ఏముంది..? తలతిక్క ట్రెండ్… సపోజ్, రామజోగయ్యశాస్త్రి వస్తే ఆయన రాసిన పాటలు, దేవిశ్రీ ప్రసాద్ వస్తే తను కంపోజ్ చేసిన పాటలు, శివమణి వస్తే తను డ్రమ్స్ వాయించిన పాటలు… ఇదేం ధోరణి..? దీంతో పాటల్లో వైవిధ్యం ఎలా వస్తుంది..?
Ads
అంతేకాదు, ఎంతసేపూ డబ్బింగ్ పాటల మీద పిచ్చి ఏమిటో అర్థం కాదు… తెలుగులో పాత పాటల్లో ఎన్ని మరుపురాని గీతాలు ఉన్నాయి..? వాటిని కూడా పాడిస్తే మరింత జనరంజకంగా ఉంటుంది కదా… మళ్లీ పాత పాటలు అనగానే పాత ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ పాటలు పాడిస్తారు, అవీ హిట్ పాటలే…
ఒక పాత శివశంకరీ, ఆమధ్య వచ్చిన మహాప్రాణదీపం వంటివి ఎందుకు పాడించలేరు… పోనీ, మెలొడీ పాటల్లోనే ఎన్ని ప్రయోగాలున్నయ్… స్వరాలకు అనుగుణంగా నవ్వులు వినిపించే సిరిమల్లె పువ్వల్లె నవ్వు వంటివి… నిన్నటి దాకా శిలనైనా, శ్రీ తుంబుర, ఝుమ్మంది నాదం , ఎన్నెన్ని…? ఇప్పటికి ఇన్ని షోలు వచ్చాయి కదా, వైరాగ్య గీతాల్ని అదే ఉద్వేగాన్ని ప్రదర్శించేలా ఒక్కరంటే ఒక్కరు కూడా పాడలేదు… ఆమధ్య ఏదో టీవీ షోలో ఓ అమ్మాయి వెంట్రిలాక్విజంతో కూడిన జూనియర్ జూనియర్ పాట సూపర్‌గా పాడింది… గతంలో బాలు పాడుతా తీయగా షోలో వైవిధ్యమైన పాటల ఎంపిక ఉండేది…
ఈసారి ఎపిసోడ్‌లో కీర్తన జరగండి జరగండి అని రాబోయే గేమ్ ఛేంజర్ పాట అనుకుంటా పాడింది… విచిత్రమైన సాహిత్యం, పాడుతుంటే పదాలే సరిగ్గా వినిపించడం లేదు, థమన్ కంపోజింగులో మరో నాసిరకం… పైగా హుక్ లైన్ ఇంకా రిలీజ్ చేయలేదు, అదయ్యాక రచ్చరచ్చే అంటున్నాడు…
పాటల కంపిటీషన్ అంటే, పాతవి కొత్తవి, అన్ని జానర్ల పాటలూ, కంపోజింగులో క్లిష్టమైనవి, పాడటానికి కష్టమైనవీ పాడగలగాలి… అదే కదా అసలైన పరీక్ష, శ్రోతలకు కూడా అదే కదా వీనులవిందు… మరి ఆ దిశలో ఈ క్రియేటివ్ టీమ్స్ ఎందుకు ప్లాన్ చేయవు..? అదే అసంతృప్తి ఈ షోలు చూస్తుంటే..!!
Share this Article