ఎందుకో అలా అనిపించింది… హీరో నాని అతిథిగా పాల్గొన్న ఈవారం తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ చూశాక… ఈసారి ఆహా ఓటీటీని దీని కోసం అనవసరంగా సబ్‌స్క్రయిబ్ చేసుకున్నానా అని..! ఎపిసోడ్ మొదట్లోనే ఈ షో వ్యూస్ లెక్కలు ఏవో చెప్పారు గానీ, బార్క్ రేటింగ్స్‌లాగా ఫేక్ అనిపించింది… అనిపించడానికి కారణాలూ ఉన్నయ్…
ఇతర టీవీలలో సినిమా పాటల కంపిటీషన్ షోలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనిపించింది… కంటెస్టెంట్ల ఎంపిక గానీ, ఆర్కెస్ట్రా గానీ, పాటల ఎంపిక గానీ… కానీ దీన్ని వేగంగా ఓ ఫన్ ఓరియెంటెడ్, ప్యూర్ ఎంటర్‌టెయిన్‌మెంట్ బేస్డ్ షో చేసేశారు… విచిత్రంగా ఈమధ్య ఈ షో మీద విరక్తితో ఈటీవీ పాడతా తీయగా వైపు మళ్లి కొన్ని వీడియోలు చూస్తే… నిజంగా అవే బాగనిపించాయి… సునీత ‘అతి’ తప్పితే మిగతాదంతా బాగానే ఉన్నట్టనిపించింది…
ఏ అతిథి వస్తే తనకు సంబంధించిన పాటలే పాడాలనే ఓ ధోరణి అబ్సర్డ్… ఎందుకు..? ఆ పాటల్నే ఇచ్చి, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలని చెప్పి, రుద్ది, పర్‌ఫామ్ చేయాలనే నిర్బంధం దేనికి..? అతిథిని ప్లీజ్ చేయడానికా..? చేయాల్సింది శ్రోతలను కదా…! నో డౌట్, అనడానికి ఏమాత్రం సంకోచించడం లేదు… ఇదొక దిక్కుమాలిన ధోరణి…
Ads
పాడిందే ఈరోజు ఎపిసోడ్‌లో నలుగురు… నాని రాకముందు అనిరుధ్ సుస్వరం ఏదో పాడాడు, పర్లేదు… మరీ ఇంప్రెసివ్ ఏమీ కాదు… శ్రీ కీర్తి పాడింది… తిరుగులేని గొంతు ఆమెది… ఫైనల్ చేరడం పక్కా… నజీరుద్దీన్‌ను మెచ్చుకోవాలి… తనకు శాస్త్రీయ సంగీతంలో పెద్దగా శిక్షణ లేకపోయినా… చాలామంది గాయకులు వేదికల మీద అటెంప్ట్ చేయడానికి కూడా భయపడే శ్రీతుంబుర పాటను ఎంచుకున్నాడు… అందరికీ నచ్చింది… గీతామాధురి కరెక్టుగా చెప్పింది, ఇంకా నేర్చుకోవాలి, సాధన నిరంతరం సాగాలి అని…
అది సాధన ఫలితం… షోకు కాస్త ఎమోషనల్ టచ్ కోసం నజిరుద్దీన్, తన చెల్లెలు అనుబంధాన్ని ఫోకస్ చేశారు, గుడ్… తరువాత అభిజ్ఞ వచ్చింది… తెలుసు కదా… మిడిల్ ఎంట్రీ… జడ్జిలు ఆమెను ఆడిషన్లలోనే వెళ్లగొట్టినా సరే, షోలోకి వచ్చింది, అదీ అమెరికాలోని వర్జీనియా నుంచి… ఎలా వచ్చింది..? ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి..? పేరుకు సోషల్ మీడియా వోట్లు ఆమెను షోలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయని ఏదో చెప్పారు, హంబగ్…
సరే, ఎలా వచ్చిందనేది వదిలేస్తే… ఒకసారి తను రిజెక్ట్ చేశాక మళ్లీ ఆమెను ప్రవేశపెట్టడం థమన్‌కు నచ్చదు, నచ్చలేదు కూడా… తన ఇగో దెబ్బ తింది… అది కనిపిస్తూనే ఉంది… మొన్న చెప్పుకున్నాం కదా ఒకటీరెండు ఎపిసోడ్లకే ఆమెను పంపించేస్తారని… దానికి ఈరోజు బేస్ ఏర్పాటు చేశారు జడ్జిలు ముగ్గురూ… కానీ మరీ కరుకుగా, పరుషంగా, కఠినంగా… దారుణంగా…
థమన్ అయితే నీకు బేసిక్సే తెలియవు అనేశాడు… దానికి కార్తీక్ వంతపాడాడు… ఫెయిల్యూర్ ఒక మెట్టు మాత్రమే, స్టాప్ కాదు అని ఏదో నీతి చెప్పాడు సూటిగా… అంటే నువ్వు ఫెయిల్ అని మొహం మీదే ముద్రేశాడు… గీతామాధురీ అంతే… అందరినీ ఆహా ఓహో అని మెచ్చుకుంటూ… ఈమె మీద ఇంత పదునైన వ్యాఖ్యలు జస్ట్, జడ్జిల పక్షపాతాన్ని, ఇగోను సూచిస్తున్నాయి…
పోనీ, ఆమె పాటను ఏమైనా నిశితంగా టెక్నికల్‌గా విశ్లేషించారా అంటే అదీ లేదు… సూటిగా నువ్వు అన్ ఫిట్ అని చెప్పేయడం బాగా లేదు… అస్సలు బాగా లేదు… పోయిన ఎపిసోడ్‌లో బాగా పాడిందట, ఇప్పుడేమో ఆమెకు బేసిక్సే తెలియవట… ఆమె రీల్స్ మీద కూడా ఏదో కామెంట్… ఈమాత్రం దానికి ఆమెకు లేటరల్ ఎంట్రీ ఇవ్వడం దేనికి..?
ఆహా క్రియేటివ్ టీం ఫెయిల్యూర్ ఇది… వాళ్లేదో ఇగోలకు పోయి ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేశారు, దాన్నలాగే ప్రసారం చేయడం దేనికి..? ఇప్పుడున్న కంటెస్టెంట్లలో సగం మంది ఇతరత్రా టీవీ షోలలో పార్టిసిపేట్ చేసినవాళ్లే… కొత్త నీరు రావాలి కదా… పోనీ, అభిజ్ఞ వంటి వాళ్లు వస్తే ఇదా అవమానం..? థమన్ మీద ఎక్కడో ఏ మూలో ఉన్న కాస్త సానుకూలత కాస్తా పోగొట్టుకుంటున్నాడు..!
Share this Article