చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా… వందల సినిమాలకు గానం పోసిన ఈ టీం కనిపించి, వినిపించి గత వారం తెలుగు ఇండియన్ ఐడల్ షోను వీనుల విందు చేసింది… ఆహా అని సినీసంగీతాభిమానులు మురిసిపోయారు… కానీ వచ్చీపోయే గెస్టుల్లాగే జస్ట్, ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది ఆ టీం… ఉసూరుమంది ఈవారం ఎపిసోడ్స్ చూసేసరికి…
సరే, వాళ్లను రెగ్యులర్‌గా షో మొత్తం ఎంగేజ్ చేసుకునేంత బడ్జెట్ ఒక తెలుగు ఓటీటీ రియాలిటీ షోకు లేకపోవచ్చు… కానీ సింఫనీ కనిపించక కాసింత వెలవెల… విలవిల… ఈ వారం విజయ్ దేవరకొండ వచ్చాడు… గుడ్, ఇలాంటి సెలబ్రిటీలు గెస్టులుగా వస్తే షోకు అదనపు ఆకర్షణ, తప్పేమీ లేదు, పైగా అదనపు వినోదం… కానీ గెస్టు వచ్చాడు కదాని తన సినిమాల పాటల్నే పాడేలా కంటెస్టెంట్లకు నిర్దేశించడం మాత్రం బాగాలేదు…
అఫ్‌కోర్స్, తన పాటల్లోనూ చాలా హిట్ పాటలుంటయ్… కానీ విస్తృత వైవిధ్యం కోరుకునే సినిమా మ్యూజిక్ ఫ్యాన్స్ అభిలాషకు పగ్గాలు వేసినట్టవుతుంది ఇలా చేస్తే…! మధ్యలో తను వచ్చి వెళ్లిపోయాక మళ్లీ వేర్వేరు పాపులర్ పాటలు పాడారు కంటెస్టెంట్స్… ఒక్కటి మాత్రం ఈసారి భలే నచ్చేసింది… అది కోరస్… గత రెండు సీజన్లలో కోరస్ మైకులు దారుణం… ఈసారి సరిదిద్దినట్టున్నారు…
Ads
ఆమధ్య పాడతా తీయగా షో అనుకుంటా… కుర్చీ మడతబెట్టి పాటకు కోరస్ పాడారు ఎవరో… అచ్చం ఒరిజినల్ పాటలోలాగే… నిజానికి థమన్ ఆ పాట కోరస్ విషయంలో ఏమైనా కంప్యూటర్ మిక్సింగ్ సాయం తీసుకున్నాడో ఏమో గానీ, అది బయట సింగర్స్ పాడటం కష్టం… కానీ తెలుగు ఇండియన్ ఐడల్‌లో స్కంధ, నజీరుద్దీన్ సూపర్ పాడేశారు… ఆ కుకూ కుకూ కూతలతో సహా… కానీ నజీరుద్దీన్ ఎఫర్ట్‌ను మెచ్చుకునేచోట… కుర్చీ మడతబెట్టి తరువాత పదం గుర్తొచ్చి అలా పాడినట్టున్నాడు అని థమన్ చేసిన వ్యాఖ్య నాన్సెన్స్… అది ఫన్నీగా లేదు, చిల్లరతనం…
లంగాకూ, లాగుకూ పుట్టిన ఓ హైబ్రీడ్ లొడాస్ ప్యాంటు వేసుకుని శ్రీరామచంద్ర చిత్రమైన లుక్కు… అప్పటికప్పుడు షో క్రియేటివ్ టీం సింగర్ కార్తీక్‌కు రాసి పంపించే మెచ్చుకోలు కవితల చిట్టీలు మంచి ఫన్… ఏమాటకామాట ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల పర్‌ఫామెన్స్ నిశిత విశ్లేషణల జోలికి వెళ్లడం లేదు జడ్జిలు… ఆహా ఓహో అని మెచ్చేసుకోవడంతోనే సరిపుచ్చుతున్నారు… అఫ్‌కోర్స్, సింగర్స్ కూడా బాగా పాడుతున్నారు… ఒకరిని మించి మరొకరు…
గత సీజన్‌లో ఓ ఆర్మీ జవాను కొన్ని ఎపిసోడ్లలో అదరగొట్టాడు… శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా, ఎలాంటి శిక్షణ పొందకపోయినా… కేవలం సాధనతో కొన్ని పాటలు పాడి మెప్పించాడు… ఈసారి కుశాల్ శర్మ సేమ్… ఈ కార్తీక్ వీరాభిమాని కూడా కేవలం సాధనతో పాటల ఫీల్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు మెలొడియస్‌గా… శ్రీ కీర్తి, స్కంధ, అనిరుధ్, కేశవరామ్, హరిప్రియ, రజినీ శ్రీ పూర్ణిమ, నజీరుద్దీన్, భరత్ రాజ్ బాగా పోటీపడుతున్నారు… గుడ్ టు హియర్ అండ్ వాచ్..!
Share this Article