.
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇక తమకు జీతాలు పెరుగుతాయని ఆశపడిన ఆంధ్రజ్యోతి గ్రూపు మీడియా జర్నలిస్టులు షాక్ తిన్నారు తమ నెలజీతాల్లో కనిపించిన అరకొర ఇంక్రిమెంట్లు చూసి..!
నిజానికి ఆ గ్రూపు జర్నలిస్టులు రాటుదేలిన తెలుగుదేశం కార్యకర్తల్లాగే శ్రమించారు పాపం… ఎలాగూ కరోనాకాలంలో ప్రింట్ మీడియా అసలు మనుగడ ఉంటుందా అనే దుస్థితిలో జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు లేవు, కొందరి కొలువులే గల్లంతు…
Ads
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ యాడ్స్ లేవు, పైగా కేసులు, వేధింపులు, కక్షసాధింపులు… తెలంగాణలో కూడా కేసీయార్ క్యాంపుతో పడలేదు, ఇక్కడా నో యాడ్స్… ఇంకోవైపు ప్రింట్ మీడియా యాడ్ రెవిన్యూ కూడా అన్ని పత్రికలకూ దారుణంగా పడిపోయింది… ఈ స్థితిలో ఆ గ్రూపు జర్నలిస్టులు పెద్దగా ఆశించలేదు…
కానీ కూటమి వచ్చాక ఏపీలో యాడ్స్ ప్రారంభమయ్యాయి… ప్రత్యక్ష ప్రసారాల కంట్రాక్టు మళ్లీ వచ్చేసింది… తెలంగాణలో రేవంత్ రెడ్డి అస్మదీయుడే… ఇక్కడా యాడ్స్ వస్తున్నాయి… సో, మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే అనుకున్నారు జర్నలిస్టులు…
ఏ పత్రిక కూడా జర్నలిస్టు వేతన సంఘాలు ఆదేశించిన నిర్ణీత పద్ధతిలో జీతాలేమీ ఇవ్వడం లేదు, అంత ఇస్తారని కూడా పెద్ద భ్రమల్లేవు అక్కడి జర్నలిస్టులకు… కానీ కాస్త ఎక్కువ ఇంక్రిమెంట్లు ఆశించారు… స్వతహాగా రాధాకృష్ణ జర్నలిస్టు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి..! పైగా పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు ఉంటాయనీ అనుకున్నారు…
అవేమీ లేవు… జీతాలను బట్టి 7, 8, 10, 13 శాతాల ఇంక్రిమెంట్లు వేశారుట… గంపగుత్తా… పనితీరు అసెస్‌మెంట్ లేదు… ఎడిటోరియల్, సర్క్యులేషన్, మార్కెటింగ్, ప్రొడక్షన్, టీవీ, ప్రింట్, వెబ్… అందరికీ ఒకే తీరు… రిటైరయి కంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవాళ్లు, ఎక్స్‌టెన్షన్ల మీద ఉన్నవాళ్లకూ అంతే….
అంగీలు చింపుకుని పనిచేసిన ఫీల్డ్ రిపోర్టర్లు… రెవిన్యూ, కాపీల పెంపు అంశాల్లో కష్టపడినవాళ్లలో తీవ్ర నిరాశ నెలకొంది… నిజానికి ఈనాడు చాలా బెటర్… అది కూడా వేజ్ కమిటీల మేరకు ఏమీ జీతాలివ్వడం లేదు, ఈనాడు డిజిటల్ వంటి శ్రమదోపిడీ సంస్థల్ని ముందుబెట్టి కథ నడిపిస్తోంది… ఐనా సరే, జీతాల పెంపుకు సంబంధించి ఓ క్రమపద్ధతి పాటిస్తుంది…
సాక్షి గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు… ఇంక్రిమెంట్లు వేసిన తీరు మీద కూడా బోలెడు ఆరోపణలు వినవచ్చాయి ఆమధ్య… నిజానిజాలు యాజమాన్యానికి ఎరుక.,. కొత్త ఎడిటర్ కొలువు దీరాడు కాబట్టి కొంత మార్పు ఆశిస్తున్నారు ఆ జర్నలిస్టులు… కానీ ఏపీలో అధికారం పోయింది, యాడ్స్ ఆగిపోయాయి, తెలంగాణలోనూ మిత్ర ప్రభుత్వం కాదు, జీతాల అధిక పెంపు కష్టమే… ఇక నమస్తేలో పరిస్థితుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… దాన్ని ప్రస్తుతం గాలికి వదిలేశాడు కేసీయార్… ఉంటే ఉండండి, లేకపోతే పొండి…
టీవీ మీడియాలో టాప్ చానెళ్లలో అంతర్గతంగా సమస్యలు బోలెడు ఉన్నా సరే, జీతాల విషయంలో టాప్ ఫైవ్ చానెళ్లు చాలా బెటర్… ప్రింట్‌తో పోలిస్తే… వెబ్ మీడియా జర్నలిస్టుల జీవితాలు కూడా ఏమీ బాగాలేవు… సైట్ల రెవిన్యూ ఘోరంగా పడిపోయింది… ఇప్పుడు పచ్చగా ఉన్నది యూట్యూబ్ జర్నలిస్టులు మాత్రమే… అదీ బాగా సబ్‌స్క్రయిబర్ బేస్ ఉండి, రీచ్ ఉన్న పాత చానెళ్లు మాత్రమే…
ఒక ప్రింట్ మీడియా డెస్క్ పాత్రికేయ మిత్రుడు తన బాస్‌కు మొరపెట్టుకున్నాడు… ‘సర్, రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేయలేను, కాస్త ఎక్కడైనా మంచి డేట్‌లైన్ ఇవ్వండి సార్, కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తాను…’ అర్థమైందనుకుంటాను..!!
Share this Article