మన మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది… ఎవరూ ఊహించని ముందంజ… ఎన్నో దశాబ్దాల తరువాత దక్కిన మంచి విజయం… సాహో మన రాణి రాంపాల్ టీం….. పురుషుల హాకీ జట్టు తక్కువేమీ కాదు… అదీ దశాబ్దాల తరువాత, 49 ఏళ్ల తరువాత సెమీస్‌లోకి ప్రవేశించింది… అరె, పతకాలు వస్తాయా రావా జానేదేవ్… క్రికెట్ జట్టు గురించి కాదు, దేశం ఈరోజు మన జాతీయ క్రీడ గురించి ఆలోచిస్తోంది… సంబరపడుతోంది… కమాన్, చక్ దే ఇండియా అంటూ చప్పట్లు కొడుతోంది… గోల్ కీపర్లు, కోచులు, ఫీల్డ్ ప్లేయర్లు మాత్రమే కాదు… ఓ ఉత్సాహం ఉరకలేస్తోంది… అందరికన్నా భువనేశ్వర్‌లో నవీన్ నివాస్ అనే ఓ అధికారిక బంగ్లాలో ఓ ముసలాయన ఒక్కడే టీవీలో మ్యాచులు చూస్తూ ఎన్నడూ లేనంత హుషారుగా చప్పట్లు కొడుతున్నాడు… కాళ్లు అటూ ఇటూ కదుపుతూ ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు… ఆయన పేరు నవీన్ పట్నాయక్… ఒడిశా సీఎం… ఓసారి ఆయన పాత్ర గురించే కాదు, మన హాకీ విజయాల వెనుక ఉన్న ఓ తెలుగు ఐఏఎస్ అధికారి గురించి కూడా మాట్లాడుకోవాలి…
రావెళ్ల వినీల్ కృష్ణ… మన తెలుగువాడే… గుంటూరు జిల్లా, తెనాలి, కూచినపూడి సొంత ఊరు… తండ్రి రాంబాబు బీహెచ్ఈఎల్ ఉద్యోగి కాబట్టి హైదరాబాద్, చందానగర్‌లో ఉండేవాళ్లు… తల్లి కుసుమ తెలుగు టీచర్… వినీల్ పుట్టింది చందానగర్‌లోనే… చెన్నై ఐఐటీలో చదివాడు… 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆఫీసులో స్పెషల్ కార్యదర్శి… ఒడిశాలో హాకీ ప్రమోషన్ కౌన్సిల్ సీఈవో… స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ కమ్ డైరెక్టర్… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒడిశా ప్రభుత్వానికి యూత్, స్పోర్ట్స్ విభాగాలకు వెన్నెముక… 2017లో ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్ని, 2018లో పురుషుల హాకీ వరల్డ్ కప్‌ను ఒడిశా ప్రభుత్వం నిర్వహించింది… వాటి వెనుక ప్రధాన పాత్ర వినీల్దే… అంతేకాదు… ముఖ్యమంత్రిని ఒప్పించి జాతీయ పురుషుల, మహిళా హాకీ జట్లను స్పాన్సర్ చేయించాడు…
Ads
కేంద్రం, శాయ్, ఎట్సెట్రా ఎవరికీ పట్టకపోయినా ఒక రాష్ట్రం ఒక క్రీడలోని జాతీయ జట్లను అడాప్ట్ చేసుకోవడమే కాదు… అయిదేళ్ల కోసం 150 కోట్లను కేటాయింపచేశాడు… అంతర్జాతీయ కోచ్‌లు, అదే స్థాయిలో శిక్షణ… దాని ఫలితమే ఇప్పుడు మన హాకీ జట్ల వెలుగులు… హాకీ వరల్డ్ కప్ కోసం కళింగ స్టేడియాన్ని కోట్ల ఖర్చుతో పునరుద్ధరించారు… అంతేకాదు… ఇప్పుడు రూర్కెలాలో అతిపెద్ద హాకీ స్టేడియం కడుతోంది… 2023 హాకీ వరల్డ్ కప్ నిర్వహించడం కోసం… వీటన్నింటి వెనుక ఉన్నది వినీల్ కృషి, యథాతథంగా ఆమోదించి ఎంకరేజ్ చేసిన నవీన్ పట్నాయక్… అందుకే ఒలింపిక్స్‌లో మన రెండు జట్లు ఆడుతున్న మ్యాచులు చూస్తూ నవీన్ పట్నాయక్ అంతగా సంబరపడిపోయాడు… ప్రస్తుతం పురుషుల జట్టు వైస్ కెప్టెన్ బీరేంద్ర లక్రా, మహిళల జట్టులో దీప గ్రేస్ ఎక్కా ఉన్నారు ఒడిశా ప్లేయర్లు…
ఎలాగూ వినీల్ కృష్ణ గురించి చెప్పుకుంటున్నాం కదా… మరికొన్ని ఇంట్రస్టింగు పాయింట్స్ ఉన్నయ్… మల్కాన్‌గిరి కలెక్టర్‌గా చేసేటప్పుడు గిరిజనుల కోసం బోలెడు ఆలోచనలు చేసేవాడు, తిరిగేవాడు… ప్రజల్లో పడి తిరుగుతూ తిరుగుతూ నక్సలైట్లకు దొరికిపోయాడు… కిడ్నాప్ చేశారు… ఎనిమిది మంది ముఖ్యమైన నక్సల్స్ నేతల్ని రిలీజ్ చేయాలనేది డిమాండ్… అనే తర్జనభర్జనల అనంతరం… 9 రోజులు తరువాత తమ డిమాండ్లు తీరాక… నక్సలైట్లు అతన్ని రిలీజ్ చేశారు… కొంతకాలం జైరాంరమేష్‌కు పర్సనల్ సెక్రెటరీగా చేయడం మినహా ఇక మొత్తం సర్వీసు ఒడిశాలోనే… మరోసారి మనం చెప్పుకోవాల్సింది… పట్నాయక్ పాలన, ఆలోచన విధానం… వినీల్ వంటి ఉన్నతాధికారుల అడుగులు, అమలు… పతకాలు వస్తే వస్తాయి, లేకపోతే లేదు… కానీ మనం సరిగ్గా ఎంకరేజ్ చేస్తే మనవాళ్లు పతకాలు ఎందుకు తీసుకురారు..? ఇలాంటి నాయకులు, అధికారులు ఉండాలి కదా…!! ఇప్పటివరకూ చూపించిన స్పూర్తి పట్ల ‘ముచ్చట’ వాళ్లను అభినందిస్తోంది…!!
Share this Article