Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సవాలక్ష వ్యాధుల ఇంగ్లిషు పేర్ల తెలుగీకరణ అసలైన ఆపరేషన్..!

November 18, 2024 by M S R

.

తెలుగు మీడియం ఎంబిబిఎస్ పాఠాలు ఎలా ఉంటాయో!

దేశంలో స్థానిక (హిందీ) భాషలో వైద్య విద్య ఎంబిబిఎస్ పాఠాలు బోధించే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దేశంలో ఏ భాషవారు ఆ ప్రాంతీయ భాషలోనే వైద్య విద్య చదివేందుకు పాఠ్యపుస్తకాలను రూపొందించే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టామని ప్రధాని మోడీ ప్రకటించారు. సంతోషం.

Ads

ఏ భాష అయినా దానికదిగా గొప్పదీ కాదు, తక్కువదీ కాదు. ప్రాంతీయ భాషల్లో వైద్య విద్య చదివి భవిష్యత్తులో వైద్యులయ్యేవారిని ఏ రకంగానూ తక్కువగా చూడాల్సిన పని కూడా లేదు. ఎవరి భాష వారికి ముద్దు. కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలు మన దేశంలో భావోద్వేగ అంశాలు. రాజకీయాలకు బాగా పనికి వచ్చే విషయాలు.

తెలుగులో వైద్య విద్య పాఠాలను తయారు చేయగానే చూడాలని, చదవాలని నాకు ఆత్రంగా ఉంది. అంటే తెలుగులో ఎంబిబిఎస్ చదవాలని కాదు. భాషాభిమానిగా ఆ పాఠాల గురించి తెలుసుకోవాలని- అంతే!

తెలుగు మాధ్యమంలో వైద్యం డిగ్రీ చదివిన వైద్యుడి దగ్గరికి… తెలుగు రోగి వెళితే… వారిద్దరి మధ్య తెలుగు రోగ సంభాషణ ఇలా ఉండవచ్చు!

రోగి:- నమస్కారమండీ.
వారం రోజులుగా నా ఎదలో నొప్పిగా ఉంది. పడుకుంటే నొప్పి ఇంకా పెరుగుతోంది. తింటే కడుపు ఉబ్బరం. తినకపోతే కళ్లు తిరుగుతున్నాయి. కాళ్ళు లాగుతున్నాయి. దగ్గరగా ఉన్నది మసక మసకగా కనిపిస్తోంది. దూరంగా ఉన్నది మసకగా కూడా కనిపించడం లేదు. చిన్న చప్పుళ్ళు చప్పున ఎకోలో ప్రతిధ్వనిస్తూ వినపడుతున్నాయి. పెద్ద చప్పుళ్ళు చెవికోసుకున్నా వినిపించడం లేదు. నా నాలుకమీద తీపి పరమ కారంగా అనిపిస్తోంది. కారం మమకారంగా తియ తియ్యగా ఉంటోంది. గుండె కొట్టుకోవడం ఆగినట్లు అనిపిస్తుంది. రాత్రి నిద్దట్లో కూడా నా గుండె కొట్టుకోవడమే కాక…ఆ గుండె చప్పుడు నాకే వినపడుతోంది! ఇంకా…

వైద్యుడు:- …ఇంక చెప్పాల్సిన పనిలేదు. నేను వినాల్సిన పనిలేదు. అత్యవసరంగా మీకు కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయాలి. ఆ నివేదికలు వచ్చాక మాధ్యమిక పరీక్షలు అవసరం కావచ్చు. అందులో కూడా ఏమీ తెలియకపోతే…అర్ధంతరంగా మధ్యస్థంగా మీ పొట్ట మధ్యలోకి ఒక సన్నని తీగను ఒడుపుగా పంపి…లోపలి దృశ్యాలను ప్రత్యక్షంగా చూడాల్సి రావచ్చు. అప్పుడు కూడా అంతా సాధారణంగా ఉంటే…మీ జీవిత బీమా అనుమతించినన్ని రోజులు మా ఆసుపత్రిలో అత్యంత విలాసవంతమయిన గదిలో మీరు సేద తీరవచ్చు.

రో:- అయ్యా!
ఇంతకూ నా రోగం ఏమై ఉంటుంది?

వై:- పరీక్షల ఫలితాలు వచ్చేవరకు ఏదో ఒక మాయరోగం అనుకుందాం.

రో:- మాయలు మంత్రాలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార వైద్యం కూడా మీరు చదివారా?

వై:- అవి చదవక్కర్లేదు.

రో:- మరి మీరు ఏమి చదివారు?

వై:- నేను తెలుగులో చదివాను.

రో:- హతవిధీ! ఈమధ్య ఎంఏ తెలుగు చదివినవారు కూడా గుండెలు తీసిన బంటుల్లా బరితెగించి కడుపులు కోసే వైద్యులు అవుతున్నారా?

వై:- భయపడకండి. నేను వైద్యుడినే. వైద్య పాఠాలను తెలుగు మాధ్యమంలో చదివాను.

రో:- హమ్మయ్య. బతికించారు. హడలి చచ్చాను.

వై:- ప్రధాన ద్వారం ఎడమ పక్కన మా ప్రయోగశాలలో తిండి తినడానికి ముందు అర లోటాడు రక్తమివ్వండి. పుష్టుగా తిన్న గంట తరువాత మరో అర లోటా రక్తం మీరు వద్దన్నా మా వాళ్లే రంద్రం పెట్టి లాక్కుంటారు. మీ ఒకటి, రెండు పరీక్షలు ఎలాగు తప్పనిసరి.

మీ ఎడమ ఊపిరి తిత్తి ఈశాన్య భాగం బాగా పొగచూరి ఉండవచ్చు. మీ గుండె కవాటాల దగ్గర రక్తం పంపిణీ వాటాల్లో తేడాలు వచ్చి ఉండవచ్చు.

మీ రక్తపోటులో ఎగుడు దిగుళ్లు ఉన్నాయి. మీ సిరలు ధమనుల్లో ఎక్కడయినా రక్తప్రసరణకు ఆటంకాలు ఉండి ఉండవచ్చు. మీ పేగుల లోపలి కణత్వచం పుండు పడి ఉండవచ్చు. మీ చిన్న పేగు పెద్ద మనసు చేసుకున్నా…పెద్ద పేగు చిన్నబుచ్చుకుని అలిగి జీర్ణక్రియను అడ్డుకుని ఉండవచ్చు.

చామన చాయగా ఉన్నానన్న ఆత్మ న్యూనతతో తెల తెల్లగా కావాలని మీరు వాడిన పొడులు, లేహ్యాలు, పైపూతలు మీ చర్మాన్ని తెల్లగా చేయాల్సింది పోయి…లోపల ప్రవహించే ఎర్ర రక్త కణాలను తెల్లవిగా చేశాయి. దాంతో ఇప్పుడు మీకు అత్యవసరంగా లక్ష పలక కణాలు ఎక్కించాల్సి రావచ్చు.

ఎండ పొడ తగలక మీ ఎముకలు కూడా బాగా పగుళ్లుబారి ఉన్నాయి. ఎక్కడయినా మరీ పెళుసుగా ఉండి విరుగుతాయి అనుకుంటే…కండ కోసి లోపల ఇనుప దబ్బలు పేర్చి…చీలలు బిగించాల్సి రావచ్చు. అది పైన బొమికల ప్రత్యేక నిపుణుడు చెబుతారు.

రో:- అయ్యా! ఇంతకంటే ఎన్నెన్నో రోగాలతో…కొన ఊపిరితో ఎన్నో సార్లు ఆసుపత్రులకు వెళ్లాను కానీ…ఇంత స్పష్టంగా నా మాతృభాష తెలుగులో నా ఆరోగ్య సమస్యలు వింటుంటే…నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. నేను ఎప్పుడో చచ్చినా…తెలియక బతుకుతున్నట్లు నటిస్తున్నానేమో అని అనిపిస్తోంది. కొంచెం డబ్బు ఎక్కువ తీసుకున్నా పరవాలేదు. నా రోగాల పరిభాషను దయచేసి ఆంగ్లంలోనే చెబుతారా? అర్థం కాకపోవడం వల్ల నేను ఆరోగ్యంగానే ఉన్నానన్న భ్రమలో అయినా బతికేస్తూ ఉంటాను!

వై:- అందుకే రోగాలు తెలుగులో చెప్పకూడదు. అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నప్పుడు…అర్థం కావాల్సింది అర్థం కాకపోయినా పెద్ద ప్రమాదం ఉండదు.

రో:- ఇంగ్లీషు వైద్యం అంటే ఏమిటో అనుకున్నాను ఇన్నాళ్లు. ఆ సమాసాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. వైద్యాన్ని ఇంగ్లీషులో చదివి, ఇంగ్లీషులోనే సాధన చేయడం అని ఇప్పుడే తెలిసింది.

వై:- ???

వైద్యుడు తెలుగులో స్పృహదప్పి పడి…విద్యుత్ తీగకు తగిలిన కాకిలా కాళ్లు చేతులు కొట్టుకుంటున్నాడు.

రో:- అయ్యో! అయ్యయ్యో!!
ఎవరయినా తక్షణం ఆంగ్లంలో వైద్యం చేసి…వైద్యుడిని రక్షించండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions