నిజమే… ఏదో ఓ సోషల్ పోస్టులో చదివాం కానీ… ఒక సిరివెన్నెల మరణిస్తే మీడియా ఇచ్చిన కవరేజీకి, ఒక రోశయ్య మరణ కవరేజీకి నడుమ తేడాను చూడటం కరెక్టు కాదు… ఇద్దరూ వేర్వేరు… రంగాలు వేరు, ప్రావీణ్యతల తీరు వేరు, అసలు పోలికే లేదు… కానీ మీడియా పోకడల్ని ఓసారి అవలోకించడానికి పనికొచ్చే ఉదాహరణ ఇది… నిజానికి మీడియాకు ఏం కావాలి..? పది మందీ చూడటం కావాలి, రేటింగ్స్ రావాలి, తద్వారా యాడ్స్ కావాలి, దాంతో డబ్బు కావాలి… అంతేగా.., వినోదదందా అంటే అంతే మరి… బజారులో నిలబడి, ఆకర్షణీయమైన సరుకు చూపించుకుంటూ, గిరాకీ కోసం వేచిచూడటమే కదా వినోదదందా… మరి ఆ కమర్షియల్ లెక్కల్లో రేటింగులే కీలకం… రేటింగులు రావాలంటే సెలబ్రిటీలు కావాలి.., టీవీ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు కావాలి… ఆ వార్తలతో నింపాలి, లేదంటే దిక్కుమాలిన ఏ వివాదాల్నో గెలికి, పెట్రోల్ పోసి, రెచ్చగొట్టి, మంటలు పెంచాలి…
నిజంగా రోశయ్యకు దక్కాల్సినంత నివాళి దక్కుతోందా..? ఒక్కసారిగా చివుక్కుమంటుంది సీనియర్ జర్నలిస్టులకు, బ్యూరోక్రాట్లకు, కాస్త వయస్సు మళ్లినవాళ్లకు, అప్పటి రాజకీయాలేమిటో తెలిసినవాళ్లకు… ఇప్పటి నీచ రాజకీయాల స్థాయితో పోల్చుకుంటే కదా రోశయ్య విలువేమిటో తెలిసేది..! అదెలాగూ ఇప్పటి జనరేషన్‌కు తెలియదు… పట్టదు… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చాలా నయం… ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మృతికి మూడు రోజుల సంతాపదినాల్ని ప్రకటించాయి… ఆయన్ని గౌరవించాయి… ఫస్ట్ నుంచీ తను ఏ పార్టీలోనైతే ఉన్నాడో, కలలో కూడా పార్టీ మార్పిడిని ఊహించలేదో, ఏ హైకమాండ్ పట్ల అత్యంత విధేయతను, అణకువను చూపించాడో ఆ పార్టీ ఎలా స్పందించింది…? ఒక సోనియా, ఒక రాహుల్ స్పందన తీరు ఏమిటి..? ఢిల్లీ ఆఫీసు నుంచి ఓ సంతాప ట్వీట్ మాత్రమేనా ఆయనకు దక్కింది..? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని తదితరుల స్పందన కాస్త నయం… కేసీయార్ స్వయంగా వెళ్లి నివాళి అర్పించాడు… ఇక ఏపీ, తెలంగాణ స్టేట్స్ కాంగ్రెస్ లీడర్స్ గురించి తక్కువ చెప్పుకుందాం..!
Ads
సిరివెన్నెల కూడా చాలారోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు, రాయడం తగ్గింది, రాసిన ఒకటీ అరా రాతల్లో హీరోయిన్ కాళ్ల పూజ సరేసరి, ఐనా సరే తను సినిమా మనిషి కదా… భౌతిక దేహం వద్దకు సినిమా వాళ్లు వస్తుంటారు, నివాళి అర్పిస్తుంటారు, బయటికి వచ్చి ఏదో మాట్లాడతారు, జ్ఞాపకాల్ని నెమరేసుకుంటారు, అవన్నీ జనం చూస్తారు… అందుకని టీవీల ప్రత్యక్ష ప్రసారాలు, మహాప్రస్థానంలో చితి వెలిగేవరకు ఫుల్ కవరేజీ… తనకు ఆ అర్హత లేదని కాదు, కానీ మీడియా దాన్ని కూడా ఓ వ్యాపారం కోణంలో మాత్రమే చూస్తుంది అనే నిజం చెప్పడం కోసం… పైగా డిబేట్లు కూడా ఈజీ… ఎవరో ఓ అభిప్రాయం చెబుతారు, ఆ పాటను మధ్యలో రన్ చేయొచ్చు… అలా ఎంతసేపైనా కథ నడిపించవచ్చు… ఈజీ వ్యవహారం కదా…
ప్రింట్ మీడియాలో నమస్తే తెలంగాణ, వెలుగు కూడా లైట్ తీసుకున్నయ్… అజ్ఞానం కొద్దీ ఆయన కేవలం ఆంధ్రా లీడర్ అనుకున్నాయేమో మరి..! కులం, అనుబంధం కోణంలో ఆంధ్రప్రభ ఎక్కువ ప్రేమ చూపించింది… ఐనా ఆంధ్రాపత్రికలే నయం… రోశయ్య వంటి లీడర్… ఏళ్ల తరబడీ ఆయన ఈ రాష్ట్రానికి ఆర్థికమంత్రి, చాలా సీనియర్, కొన్ని విలువలు మెయింటెయిన్ చేసిన నాయకుడు, కక్షపూరిత రాజకీయాల్లేవు… ముఖ్యమంత్రిగా కూడా చేశాడు, తమిళనాడుకు గవర్నర్‌గా చేశాడు… సెటైర్లు, ప్రసంగాల్లో దిట్ట… తన గురించి డిబేట్లలో ఎడాపెడా ఏదిపడితే అది మాట్లాడటం కుదరదు… పైగా టీవీల్లో కీలకస్థానాల్లో ఉన్నవాళ్లకు రోశయ్య గురించి తెలిస్తే కదా… కొందరు సీనియర్ జర్నలిస్టులు రోశయ్య గురించి, తమ అనుబంధం గురించి సోషల్ మీడియా పోస్టులు పెట్టి స్మరించుకున్నారు, అంతే… నిన్న ఉదయం రోశయ్య మరణిస్తే మధ్యాహ్నానికి అది మీడియాకు మాత్రం చద్ది వార్త అయిపోయింది… ప్రైమ్ టైమ్‌లో ఆయన ప్రస్తావనే లేదు… నిజంగా ఆయన అంత అనామకుడా..?
ఎస్… రోశయ్య గురించి సరైన కథనాలు, డిబేట్లు కావాలంటే ఆయన గురించి తెలియాలి… ఆయన పాత క్లిప్పింగులు చూడాలి, వార్తలు చదవాలి, సీనియర్ పొలిటిషియన్లతో మాట్లాడాలి, అంత ఓపిక, టైం ఎవరికి ఉంది..? ఏదో దిక్కుమాలిన సినిమా వివాదమో, వార్తతో కుమ్మేస్తే సరి… మీడియా నిజంగా ఇలాగే వ్యవహరించింది..! రోశయ్య చాలారోజులుగా తెర మీద లేడు… అనారోగ్యంతో ఇల్లు కదలడం లేదు… ఆయన యాక్టివ్ పాలిటిక్సులో గనుక ఉండి ఉంటే ఆయన మాటల్లోని వ్యంగ్యం, ఆయన ఎదురుదాడి చేసే ధోరణి, ఆయన సబ్జెక్టు నాలెడ్జి ప్రజెంట్ జనరేషన్‌కు, జర్నలిస్టులకు అర్థమయ్యేవేమో…!! ఆయన బాగున్నప్పుడు ఆయన చుట్టూ కులసంఘ నాయకులు కూడా ప్రదక్షిణలు చేసేవాళ్లు… ఇప్పుడు ఏరీ వాళ్లు..? కాలం మారింది, రాజకీయాలు-మీడియా ధోరణి మారింది… ఇప్పుడు ఆ పాతతరం రాజకీయాలు ఎవరికి కావాలిలే… ఇది అసలే రండ యుగం, బోసిడికే యుగం కదా..!!
Share this Article