ఎక్కడో ఓ చిన్న ఆశ… ఇంకా ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనిచేస్తోందనీ… అక్రమార్కులకు శిక్షలు పడతాయనీ… ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఈ దేశంలో శిక్షింపబడతారనీ… కొద్దిగా వెలుతురును ప్రసరింపజేసింది ఆ తీర్పు… రకరకాల విచారణలు, అప్పీళ్ల దశలు దాటి, ఇంకా ఎన్నాళ్లో సాగీ సాగీ చివరకు ఏం అవుతుందో తెలియదు గానీ… ఈరోజుకైతే అది ప్రధాన వార్తే… కానీ..?
మన టీవీలు, మన పత్రికలు, మన సైట్లు, మన యూట్యూబర్లు, మన సోషల్ మీడియా… దాన్నసలు పట్టించుకోలేదు… ఆ తీర్పు నుంచి ప్రసరించే ఆశాకిరణం విలువేమిటో మన ప్రధాన పత్రికలకూ సోయి లేకపోవడం ఓ విషాదం… వార్త ఏమిటంటే..? అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు సీబీఐ కోర్టు శిక్ష వేసింది… అఫ్‌కోర్స్, 45 కోట్లు మింగితే శిక్ష అయిదేళ్లేనా..? అనే నిరాశ వలదు… కనీసం ఆమె తప్పు చేసింది అనే నిర్ధారణ జరిగింది కదా… ఆ నేరం నిజమే అనే తేల్చింది కదా…
తప్పుడు పత్రాలతో రుణం పీఎన్‌బీ నుంచి 42 కోట్ల రుణం తీసుకుంది… రుణం పొందిన కంపెనీలో మాజీ ఎంపీ గీత, భర్త రామకోటేశ్వరరావు డైరెక్టర్లు… బ్యాంకు అధికారులు సహకరించారు… (మన ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటిలోనూ జరుగుతున్న బాగోతం అదే కదా… లక్షల కోట్ల తప్పుడు రుణాలను నిరర్థక రుణాలుగా ముద్రవేసి, తరువాత రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుని, బ్యాంకులను ఇంకా ఉద్దరించడానికి ప్రజాఖజానా నుంచి ఇంకా ఇంకా డబ్బులు ఇస్తూనే ఉంటుంది… ఇదొక పెద్ద పాలనదరిద్రం…)
Ads
2008లో రుణం పొందితే, 2015లో గుర్తించారట… కేసు పెట్టారు… ఆనందం ఏమిటంటే, సహకరించిన బ్యాంకు అధికారులపైనా కేసు నమోదు చేశారు… చివరకు నిన్న నేరానికి శిక్ష విధించింది… వెంటనే గీత అండ్ కో హైకోర్టుకు వెళ్లింది… తరువాత సుప్రీం… సరే, అదంతా వేరే చర్చ… కానీ ఈ తీర్పును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి తెలుగు మీడియా ఎందుకు వెనుకాడింది..?
ఈనాడు సరైన ప్రయారిటీ ఇచ్చింది… ఇంకాస్త హైలైట్ చేసినా తప్పులేదు… ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో హైలైట్ చేసి, మిగతా ఎడిషన్లలో టోన్ డౌన్ చేసేసింది… అంటే ఇది కేవలం ఏపీ ప్రజలు మాత్రమే చదువుకోదగిన వార్త అనేనా ఆ పత్రిక ఉద్దేశం..? ఎంతటి భావదరిద్రం..? ఆ నెత్తిమాశిన సాక్షి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదేమో…
ఎస్, ఆమె వైసీపీ మనిషే… ఆ పార్టీ తరఫునే అరకు నుంచి గెలిచింది ఓసారి… గ్రూప్-1 అధికారిణిగా ఉన్న ఆమెను 2014లో ఎంపీగా గెలిపించిందీ వైసీపీయే… కానీ ఆమె ఆ తరువాత పార్టీలో లేదు… కొన్నాళ్లకు జనాన్ని అర్జెంటుగా ఉద్దరించడానికి 2018లో జనజాగృతి అనే పార్టీ పెట్టింది ఆమె… జనం నవ్వుకున్నారు… ఇలాంటి తప్పుడు రుణాలు, ఎగవేతల జాతి ఉద్దారకుల అంతిమ లక్ష్యం బీజేపీయే కదా… ఆమె తన పార్టీని బీజేపీలో విలీనం చేసి, ఆ పార్టీలోనే కొనసాగుతోంది…
ఐనాసరే, ఆమె ఇంకా వైసీపీలోనే ఉన్నట్టుగా భ్రమించిందేమో సాక్షి తన సహజధోరణిలో… లోపలపేజీల్లో ఓ సింగిల్ కాలమ్ వార్త… అదీ ఎక్కడ కనిపిస్తుందో అన్న భయంతో, జాగ్రత్తగా, కనీకనిపించకుండా వేసింది… జగనన్నా… ఆమె ఇప్పుడు నీ పార్టీలో లేదన్నా… అప్పుడప్పుడూ నీ పత్రికలో ఏం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో కాస్త చూసుకోవాలన్నా…!! (అఫ్‌కోర్స్, వైసీపీ వాళ్లు అంటేనే ఇలాంటోళ్లు అనే భావనను వ్యాప్తి చేయాలనేది ఈనాడు, జ్యోతి ఉద్దేశం కావచ్చు… అందుకే ఫస్ట్ పేజీలో రాయొచ్చు… ఆ భయంతోనే సాక్షి అండర్ ప్లే చేసి ఉండవచ్చు… ఎవరి లెక్కలు వాళ్లవి… అదే కదా అసలు ఖర్మ…)
Share this Article