.
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడికి ఓ ముసలివాడిగా కనిపించిన కృష్ణుడు తత్వబోధ చేస్తుంటాడు… ‘‘చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ, అటు మాయ ఇటు మాయ’’ అంటూ…
ఈ వారం బార్క్ రేటింగులు, మరీ ప్రత్యేకించి వార్తా చానెళ్ల రేటింగులు, అందులోనూ హైదరాబాద్ సిటీ రేటింగులు చూస్తుంటే పైన తత్వమే చెవుల్లో వినిపిస్తోంది లీలగా… అలా ఉన్నాయి ఆ రేటింగుల తీరు…
Ads
ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, సాంబలను వాళ్లంటే పడని రాజకీయ శక్తులు, క్యాంపులు పదే పదే యెల్లో చానెళ్లు, విపరీత పోకడల చానెళ్లు అని ఆడిపోసుకుంటూ ఉంటయ్… అదసలు జర్నలిజమేనా అంటుంటాయి గానీ… వాళ్లు ఆ చానెళ్లను ఎంత పైకి లేపుతున్నారో తెలుసా…?
హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఏబీఎన్… థర్డ్ ప్లేస్ టీవీ5… నిజమండీ బాబూ… ఈ టేబుల్ చూడండి, తాజా రేటింగులే ఇవి…


రెండు తెలుగు రాష్ట్రాల సగటు రేటింగుల్లో నాలుగో ప్లేసులో ఉన్న ఏబీఎన్ హైదరాబాదులో ఫస్ట్ ప్లేసు ఏమిటి…? మాయ…!
కేసీయార్ వాయిస్ టీ న్యూస్ మరీ అన్ని చానెళ్లలోకెల్లా దిగువన 14వ ప్లేసులో ఉండిపోయి, చివరకు ఎవరూ దేకని ఈటీవీ తెలంగాణకన్నా కునారిల్లడం ఏమిటి..? మాయ..!
ఓవరాల్ రేటింగుల్లో కనిపించే ప్రైమ్ 9, మహా న్యూస్, ఐన్యూస్ హైదరాబాద్ టాప్-10 లో అసలు కనిపించకపోవడం ఏమిటి..? మాయ..!
అంతా మాయ..! అసలు ఈ రేటింగు కొలిచే మీటర్లు, ఆ ఇళ్ల వీక్షణాల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా ఓ పెద్ద దందా… వినోద చానెళ్లూ అదే తంతు…
పెద్ద పెద్ద చానెళ్లను దాటేసి స్టార్ మా చానెల్ దేశంలోనే టాప్ ప్లేసులో ఉంటుంది… మాయ..! అదే చానెల్ తీరా హైదరాబాదుకు వచ్చేసరికి జీతెలుగుకన్నా దిగువన రెండో ప్లేసులో ఉంటుంది… మాయ..!
ఈ దిక్కుమాలిన సిస్టం బదులు మరో శాస్త్రీయ విధానం తీసుకొస్తామని ప్రసార మంత్రిత్వ శాఖ చెబుతూనే ఉంటుంది, కానీ తీసుకురాదు… మాయ..! వేల కోట్ల టీవీ యాడ్స్ అందరినీ ప్రభావితం చేస్తాయి మరి..! అదే మాయ అంటే..!
రేటింగ్ మేనేజ్‌మెంట్ అనేది ఓ వ్యాపార కళ, నిర్వహణ కళ… అందులో రాణించేవాడికే టీవీ ఇండస్ట్రీలో పెద్దపీట… మరి దాన్నెందుకు నమ్మడం అంటే..? పత్రికలకు సంబంధించి ఏబీసీలాగే టీవీల రేటింగులకు ఇదే ప్రామాణికంగా తీసుకోబడుతున్న అశాస్త్రీయ, అధికారిక విధానం కాబట్టి…
కేంద్ర సర్కారుకు ఈ విషయంలో పెద్ద సోయి లేదు, ఆసక్తీ లేదు కాబట్టి… స్టార్ గ్రూపు మేనేజ్‌మెంట్ మెరిట్ ఎదుట పెద్ద పెద్ద ఇతర జాతీయ గ్రూపులూ వెలవెలబోతున్నాయి కాబట్టి… ఏమో, చెప్పలేం, టీవీ5 నాయుడు మరింత కాన్సంట్రేట్ చేస్తే… వచ్చేవారమో, ఆ మరుసటి వారమో టీవీ5 ఫస్ట్ ప్లేసులోకి రావచ్చునేమో..!!
Share this Article