Bharadwaja Rangavajhala……. పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్… తెలుగు సినిమా పాటకు శాశ్వతత్వం ప్రసాదించిన గళం పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. మొన్న ఘంటసాల వారి పుట్టిన రోజు. తెలుగుజనం పెద్దగా స్మరించుకున్నట్టు లేదు… తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల. పద్యనాటకాల్లో నటించాలంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోక తప్పేది కాదు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే…ఈ కసరత్తు తప్పదు మరి. సాహిత్యాన్ని మింగేసేలా సంగీతం సాగేది. రాగాలు సాగేవి. ఈ పద్దతిని సమూలంగా మార్చిన వాడు ఘంటసాల. ఘంటసాల స్వరంలో కొత్త రూపు దిద్దుకున్న పద్యాలను ఆయన శతజయంతి సంవత్సర ముగింపు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం …
అప్పు చేసి పప్పుకూడులో ఓ సందర్భం కోసం ఎన్టీఆర్ సన్యాసి వేషం కడతారు. ఆ సన్నివేశాల కోసం కొన్ని వేదాంత తరహా పద్యాలను రాశారు పింగళి నాగేంద్రరావు. భజగోవింద శతకం తరహాలో సాగే కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు లాంటి పద్యాలను ఘంటసాల అంతే చిలిపిగా పాడి రక్తి కట్టించారు.
ఘంటసాల గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలాంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు ఘంటసాల వారి గానంలో ప్రత్యేకతను తెచ్చాయి. సారణీ బ్యానర్ లో నాగమణి, సూరిబాబులు నిర్మించిన కాళిదాసు కోసం కాళిదాస విరచిన శ్యామలా దండకాన్ని ఘంటసాల వారు ఆలపించిన తీరు వినితీరవలసినదే. పద్యానికి సంగీతము … హృది మెచ్చెడి భాణినీయ ఉన్నతి నిచ్చున్… మధురమ్మగు గొంతుకతో… పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్.. అంటూ పద్యం చెప్పారు .పంతుల సీతాపతి రావు గారు. ఇక ముళ్లపూడి అయితే మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల అనేశారు…
Ads
Share this Article