నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా…? నడుమ తడబడి నడలిముడుగక పడవతీరం క్రమిస్తుందా…? మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా…? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా… ? ఇదిగో ఎంతకీ సమాధానం దొరకని అనుమానాలతో కూడిన శ్లేష ప్రశ్నలే కవి కలానికి బలం. ఆ బలమే భావకవిత్వంపై తిరుగబావుటా ఎగురేసిన అభ్యుదయ కవి శ్రీశ్రీ.
ఏ ప్రశ్నలన్నింటికైనా సంతృప్తికరమైన సమాధానాలు దొరికినప్పుడు.. ఇక కలం ఆగిపోవడం తప్ప… రాయగల్గేదేముంటుంది…? అలాంటి సంతృప్తిని పొందలేకే… శ్రీశ్రీ మహాకవయ్యాడేమో బహుశా! ఉందో, లేదో తెలియనిదానిపై విశ్లేషణ చేసే క్రమంలో… లేనే లేదని తేలినప్పుడు ఆ రచనలింకెందుకు…? ఏమని చేయగలము..?
ఏ సందేహానికైనా నిశ్చయమైన జవాబు దొరికిందని సంతృప్తి చెందితే… ఇక రచన ఆగిపోవడమే. అందుకే శ్రీరంగం శ్రీనివాసుడి కవిత్వం నిత్యాన్వేషణవైపు… సందేహాలతోనే సావాసం చేసిందనిపిస్తుంది.
Ads
మొదట చెప్పుకున్న లైన్స్ లో… ఇవాళ మానవాళి మొదటి విడతైపోయి.. సెకండ్ వేవ్ పేరుతో కరోనా రక్కసితో… సామాజికవ్యాప్తి చెంది మూడో దశకు చేరుకుంటున్న వేళ… ఆ మహానుభావుడు శ్రీశ్రీ మాటలు మళ్లీ ఓసారి గుర్తు చేసుకోవాల్సినవే! ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే… నిజంగానే శ్రీశ్రీ అన్నట్టుగా నిఖిలలోకం నిండుహర్షం వహిస్తుందా…? నడుమ తడబడి నడలిముడుగక పడవతీరం క్రమిస్తుందా…? మానవాళికి మంచికాలం రహిస్తుందా…? అనే ప్రశ్నలే ముందున్నాయి తప్ప… ప్రపంచస్థాయి వైరాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సైంటిస్టులు, నోబెల్ బహుమతి ప్రదాతలు, ఆయుర్వేద, హోమియో వైద్యులు, సాధుపుంగవులు, జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు.. ఇలా ఎందరెన్ని చెప్పినా… ఆ వివరణలు సంతృప్తికర సమాధానాలు కాకుండా పోతున్న వేళ… ఇప్పుడు మరోసారి ఆ శ్రీరంగం శ్రీనివాసుడి ప్రశ్నలే సమాజపు మదిలో మెదలకమానవు.
మనసున మససై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ అంటూ గాఢమైన ప్రేమకు సంకేతంగా రాసినా… ఆకలిరాజ్యపు కేకలు వినిపించినా… పతితులారా, భ్రష్ఠులారా, బాధాసర్ప ద్రష్ఠులారా… ఏడవకండేవకండేవకండి.. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ అణగారిన వర్గాలు, దగాపడ్డవారు, కండలుడికిన కార్మికులకు ప్రోత్సహించినా… ఏవీ ఆ జగన్నాథ రథ చక్రాలు… ఏదీ శ్రీశ్రీ ఆశించిన ఆ అభ్యుదయమైన మార్పు… అదిగో తన రచనా కల్పనకు ఊతమై శ్రీశ్రీని నడిపించిన ప్రశ్నే నేటికీ మన కళ్లముందు కదలాడుతున్న మహాప్రస్థానపు వేళ… అక్షరాలకు అశ్వగమనం నేర్పిన.. ప్రతీ పదబంధంలో సింహగర్జన వినిపించిన.. చెమటచుక్కను కవితా సింహాసనమెక్కించిన.. అంతలోనే వాక్యాల్లో కావ్య సుంగధ పరిమళాలద్దిన.. నిత్య చైతన్య స్ఫూర్తి జయంతి యాది ఇది.
రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండంటూ పాఠకుడిని సమాయత్త పరుస్తూ యోగ్యతాపత్రంలో చలం ఇచ్చిన భాష్యంతో పాటు… పీఠిక చదివితే ఇక మహాప్రస్థానం అక్కర్లేదనకుంటానంటూ పిచ్చయ్య అనే వ్యక్తి శ్రీశ్రీతో మీరేమంటారంటే… మీరు.. “సార్థక నామధేయులంటాను” అన్న సెటైర్ చాలదా శ్రీశ్రీ ఎలాంటివాడో చెప్పడానికి.
(డిస్ క్లెయిమర్: ఏదేమైనా ఆ మహానుభావుడి స్మరణలో ఏవో తెలిసిన నాల్గు ముక్కలు… ఇంకొన్ని ఇంటర్నెట్ పుణ్యమా అని లభించిన పదబంధాలతో సేకరించిన కలగాపులగమే ఈ చిన్ని ప్రయత్నం)…………… రమణ కొంటికర్ల
Share this Article