Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ చుక్కా నవ్వవే… వేగులచుక్కా నవ్వవే… నావకు చుక్కానవ్వవే…

May 11, 2024 by M S R

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా… అందానికి అందం ఈ పాట

మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి బాటసింగారం బాట దాటగానే కనురెప్పలు వాటంతటవే పడిపోతున్నాయి. కునుకుపడితే మనసుకాస్త కుదుట పడుతుందని ఆత్రేయ సూత్రీకరించాడు కాబట్టి సీటు వెనక్కు వాల్చుకుని నిద్రలోకి జారుకున్నాను. లేచేసరికి నార్కట్ పల్లి బోర్డు కనిపిస్తోంది. కళ్లు నులుముకుని… నీళ్లు తాగి… కారు పెన్ డ్రయివ్ ఆడియో ఆన్ చేశాను.

వేటూరి రాసి పోసిన , బాలు రాశిపోసిన, మహదేవన్ పోతపోసిన, విశ్వనాథుడు తీర్చి దిద్దిన అందానికి అందం పాట రూపుకట్టి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. అదో మైకం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అప్పుడే తొలిసారి వింటున్నట్లు మరులుగొలుపుతుంది. మనసుకు రెక్కలు తొడుగుతుంది.
“అనగల రాగమై తొలుత వీనులలరించి…
అనలేని రాగమై మరలా వినిపించి…
మరులే కురిపించి…
జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి” అవుతుంది.

Ads

తేలిక తెలుగు పదాల్లో ఇంత అందముందా? అని వేనవేలసార్లు వేటూరిని స్మరించుకునేలా చేస్తుంది. “నిదురించే పెదవిలో పదముంది పాడుకో”మన్న మాటలో మొత్తం సినిమా కథను, ఆ పాట సందర్భాన్ని పట్టి బంధించి… తెలుగు పాట అందానికే అందాలు పూశాడు పెద్దాయన వేటూరి. ఆ కథానాయిక మూగది కాబట్టి పలకమన్నా పలకలేదు. అందుకే ఆ మూగబొమ్మకు తన మాటల కులుకుల తళుకులద్దాడు వేటూరి. ఆ రాజభోగాలను తెలుగులో పాడనివ్వాలట. ఇక్కడ వేటూరి తెలుగు కావ్యకన్యక బంగారు పల్లకీ ఎక్కి వినువీధిలో విహరిస్తుంటే… బాలు మైమరచి పాడుతున్నట్లుంటుంది.

మాటల్లో చెప్పడం సాధ్యం కాని పాట అందమది. ఈ జన్మకింతే. ఇలాగే వింటూ ఉండాలి. ముందు జన్మ ఉంటే మనం కూడా ఆ కాలి మువ్వలుగా పుట్టాలని… తెలుగు కొమ్మకు పూచిన పువ్వులం కావాలని కోరుకోవాలి.

పల్లవి :-
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ

చరణం-1

పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొనసిగ్గుల మొలక
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా…. పూచిన కొమ్మా

చరణం-2

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడి బొమ్మా… పూచిన కొమ్మా…

చరణం -3

ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను….
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను….
పుత్తడి బొమ్మా… పూచిన కొమ్మా..

చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్,
గీత రచయిత :  వేటూరి,
గానం :  బాలు
————-
ఇంత తెలుగు అందం మత్తెక్కి అసలే ఉక్కిరి బిక్కిరిగా ఉంటే… ఈలోపు మరో పాట మొదలయ్యింది. ఇది ఇంకా ఇంకా మత్తు. అదే వేటూరి- బాలు మిన్నేటి సూర్యుడిని తెచ్చి… మన తెలుగు పల్లెల్లో కోనేటి తామరలను వికసింపచేసిన పాట. వాణీజయరాం ఆలాపనకే చెవుల్లో అమృతం మనసులోకి దిగి… మనసు కొలనులో తామరలన్నీ విచ్చుకునే పాట. ఇళయరాజా రాగాలు తామర మొగ్గలై ప్రతిపదంలో విచ్చుకునే పాట. మండే ఎండలన్నీ అందమైన రంగువల్లులై… పూలు చల్లిన పాట. పాట పల్లవించగానే ముద్దుకే పొద్దు పొడిచిన పాట.

రామ చిలుకలు , ప్రేమ మొలకలు ఈడు గూడు ఎక్కడుందో వెతుక్కున్న పాట. కంటి కోలాటాలు జంట పేరంటాలు చేసుకున్న పాట. లా ల లా అని వాణీ జయరాం అంటుంటే గిలిగింతలతో, పులకింతలతో ఒళ్లు మరచి ఊగిపోవాల్సిన పాట.

పల్లవి :
తందనాన… తందానాననాన
తందానాననాన తందానాననాన…
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ..  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై… ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దుపొడిచి…
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ…  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం 1 :

ఓ… చుక్కా  నవ్వవే! వేగుల చుక్కా నవ్వవే!
కంటి కోలాటాలా! జంట పేరంటాలా! 
ఓ… చుక్కా నవ్వవే! నావకు చుక్కా నవ్వవే!
పొందు ఆరాటాలా! పొంగు పోరాటాలా!
మొగ్గ తుంచుకుంటే.. మొగమాటాలా?
బుగ్గ దాచుకుంటే.. బులపాటాలా?
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా?

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం 2 :

ఓ… రామచిలకా! చిక్కని ప్రేమమొలకా!
గూడు ఏమందమ్మా? ఈడు ఏమందమ్మా?
ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింక
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు.. లా లా లా లా…
మిన్నేటి సూరీడు.. లా లా లా లా…
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చిత్రం :  సీతాకోకచిలుక (1981)
సంగీతం  :  ఇళయరాజా,
గీతరచయిత  :  వేటూరి,
గానం  : బాలు- వాణీ జయరాం

కొసమెరుపు:-

ఆ అందానికి అందం వెంట పడగా…ఈ మిన్నేటి సూరీడు తోడు రాగా…సూర్యాపేట సెవెన్ వచ్చింది. ఒక పెద్ద గ్లాసు చెరకు రసం తాగి…విజయవాడ దారి పట్టుకోగా కవి వాక్కులో మిన్నేటి సూర్యుడు ఆకాశం దిగుతూ కారు మిర్రర్ లో సూర్యుడిగా బంగారు ఎరుపుతో నవ్వుతున్నాడు.

సరిగ్గా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా మాట వినిపించేవేళ సూర్యాపేట దగ్గర రహదారి పక్కన కాలువలో ఒకబ్బాయి తామరాకు కోస్తున్నాడు. యద్ భావం తద్ భవతి. కవి వాక్కు వృథాపోదు. -పమిడికాల్వ మధుసూదన్    9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions