Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలూ మీకు తెలుసా..?

July 22, 2026 by M S R

.

Priyadarshini Krishna … తెలుగు నుడికారం ఎంత గొప్పదో తెలిపే అద్భుతమైన వ్యాసం …!! తమిళంలోని అక్షరం “ழ” ( దీన్నే ఇంగ్లీష్ లో “zha” అని రాస్తారు), దీనికి సరైన అక్షరం మన తెలుగులో లేదని 100% తెలుగు ప్రజల అభిప్రాయం. అయితే ఈ అక్షరానికి సరైన ప్రత్యాయం మన తెలుగులో వుంది. చాలా కాలం వరకూ నాక్కూడా తెలియదు. ఎలా తెలుసుకున్నానో చెప్పే ముందు, ఒక అనుభవం చెబుతాను.

1981 సం.లో “గరుడా సౌఖ్యమా” అనే తమిళ సినిమాకి సహ దర్శకునిగా కె.ఎస్.ప్రకాశ రావు గారి దగ్గర పనిచేసినప్పుడు. తమిళ డైలాగులని, తెలుగులోకి యధాతధంగా (భాషానువాదం) రాసి ప్రకాశ రావు గారికిస్తే, ఆయన షాట్ డివిజన్ చేసేవారు. ఒక సీన్ లో “vazhai paLam” (plantain) అనే డైలాగ్ వచ్చింది. ఆ సినిమా మాటల రచయిత “వియత్నాం వీడు” సుందరం, “ఈ మాటని ఎలా రాస్తారు” అని అడిగారు.

Ads

“వాళై ఫలం” అన్నాను. “కాదు. ఈ అక్షరం పలికేటప్పుడు నాలుక మడతపడాలి. ఈ అక్షరం మీ తెలుగులో లేదు” అన్నారు. నా అహం దెబ్బతింది. ఆ ఉచ్చారణ వచ్చే విధంగా “వాళఐ” అనీ, “వాయై” అనీ రాస్తే, వెకిలిగా నవ్వుతూ “ఈ అక్షరం మీకు లేదు. మీరు రాయలేరు” అన్నారు “వియత్నాం వీడు” సుందరం. చాలా అవమానకరంగా భావించి, దర్శకులు ప్రకాశరావు గారితో జరిగింది చెప్పాను. ఆయన చాలా తేలిగ్గా తీసుకుని, “మనకి లేదు గనుక, వాడు లేదన్నాడు. నువ్వెందుకంత ఫీలవ్వడం. ఇది మనసులో పెట్టుకుని ముభావంగా ఉండటం చెయ్యమాక’ అన్నారు. ఆ సంఘటన అక్కడితో ముగిసింది.

1993 సం.లో ఒక సందర్భంలో శ్రీకాళహస్తికి వెళ్లి ప్రముఖ గణిత మేధావి, ఏక సంథాగ్రాహి సంజీవరాయ శర్మ గారిని కలవడం జరిగింది. కంప్యూటర్ తో పోటీపడి గెలిచిన శకుంతలా దేవి గారి మీద, అదే గణిత శాస్త్రంలో పోటీపడి నెగ్గిన వ్యక్తి సంజీవరాయ శర్మ గారు. ఆయనకి ఒక సంవత్సరంలోని నెలా, తేదీ చెబితే – ఆ రోజు తిథి, వార, నక్షతరాలని తడుముకోకుండా చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే – సంజీవరాయ శర్మ గారు పుట్టంధుడు. కళ్ళు లేకపోయినా, ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఎల్లలు లేనంత ఆంధ్ర భాషాభిమాని.

వారితో మాట్లాడుతుండగా, “వియత్నాం వీడు” సుందరం అన్న మాటలు గుర్తుకొచ్చి, మా మధ్య జరిగిన సంభాషణ చెప్పాను. ఆయన కోపంతో ఊగిపోతూ, “వాడ్ని తీసుకురండి. నవ రంధ్రాల్లో గడ్డి కూరుస్తాను. తమిళ్ “ழ” (zha) కి తెలుగు ప్రత్యామ్నాయం “ఌ” అక్షరం. (ఈ అక్షరం పెద్ద బాల శిక్షలో ఇప్పటికీ ఉంది. కానీ పాఠ్య పుస్తకాలలో ‘భాషా సంస్కరణ’ పేరుతో తీసేసారు).

ఈ ఉచ్చారణ తమిళంలోనే కాదు గుజరాతీ భాషలో కూడా వుంది. ఇతర గ్రంధాలలోని పదాలని ఉదహరిస్తూ చెప్పేటప్పుడు, ఆ భాష ఉచ్చారణకి తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతో, ఏ భాషలో లేని విధంగా తెలుగు వర్ణమాలని రూపొందించడం జరిగింది.

ప్రపంచంలోని ఏ భాష నుంచైనా తెలుగులోకి, మూల ఉచ్చారణ దోషం లేకుండా భాషానువాదం చెయ్యగల సత్తా ఆంధ్ర భాషకే ఉంది. త్యాగరాజు సంగీత శాస్త్రం నుంచీ భరతముని నాట్య శాస్త్రం వరకూ తెలుగు నుడికారంలోనే వ్రాయబడ్డాయి” అని వివరించారు. నిజంగా ననెంతో గర్వపడ్డాను ఆంధ్ర భాషకి వారసుడినైన ఆంధ్రుణ్ణి అయినందుకు.



వర్ణమాల

నోట్ : ఇది పదేళ్ల క్రితం PS నారాయణ గారు రాసిన వ్యాసం …
దాని క్రింద కామెంట్స్ లో కూడా చాలా మంచి చర్చ జరిగింది …
కామెంట్స్ లో కొన్ని మంచివి తీసి ఇక్కడ ఇస్తున్నాను – ప్రియదర్శిని

జెవివి సత్యనారాయణ మూర్తి : ఈ ‘ఌ ౡ’ లు మన అచ్చుల్లో … అంటే వరుస క్రమంలో ఎ ఏ తరువాత ( అ గుణింతం లో వస్తాయి… అదే తమిళ్ లో అయితే హల్లుల్లో య, ర, ల, ళ తరవాత ழ గా గుణింతం లేకుండా ఏక అక్షరంగానే మనకి ఎక్కడైనా కనిపిస్తుంది. గమనించగలరు. ఈ అళు, అళూలు, బండి ‘ర’ లు వాడుకలోంచి తీసేసి సంవత్సరాలై ఉంటుంది.

పీఎస్ నారాయణ : ఇది 80 దశకంలో జరిగిన మార్పు. 1976 సం.లో మా తమ్ముడు చదుకునే రోజుల్లో ఈ అక్షరాలున్నాయ్ .అయితే “ఌ” అనే అక్షరం వాడుకలో లేదు. కానీ “ఱ” వాడుకలో ఉంది. “ఱ” గురించి జరిగిన చర్చ గురించి మళ్లీ నేనొక కథ చెప్పాలి. 1984 సం.లో ‘వియ్యంకులు సవాల్’ అనే సినిమా కంపోజింగ్ సమయంలో, కవి గారు పాట చెబుతుంటే, సహాయ దర్శకుడు రాస్తున్నాడు. ఒక చోట గుఱ్ఱం అనే పదం వచ్చింది. ఆ కుర్రాడు “గుర్రం” అని రాసాడు.

గుర్రం కాదు – గుఱ్ఱం అని రాయమన్నాను. వెంటనే కవి గారు “ఱ” అనే అక్షరం తీసాం, నీకు తెలియదా? – అన్నారు. “ఎందుకు తీసేసారు” అని అడిగాను. “అక్షరాలు ఎక్కువైనయ్. అందుకని సంస్కరించవలసిన అవసరం వచ్చింది. ముందు ముందు ‘ళ’,  ‘శ’ అక్షరాలు కూడా తీసే యోచన వుంద”న్నారు. “అయితే కొన్ని వేల కావ్యాల్లో ఈ అక్షరాలున్నాయి కదా వాటినేం చేస్తారు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వంటి మహాకవుల కీర్తనల్లో ఈ అక్షరాలున్నాయ్. వాటిని నేర్చుకోవాలంటే ముందు తరం వారికి ఈ అక్షరాలేంటో తెలియదు కదా, మరి దానికి alternative గా ఏం చేసారు. ” అని అడిగాను.

దానికి ఆయన సమాధానం చెప్పకుండా నోరేసుకు పడ్డాడు. 2012 సం.లో తిరుపతిలో జరిగిన “ప్రపంచ తెలుగు మహాసభల”కి ముందు ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో, మన TFDA వారు సభ ఏర్పాటు చేసారు. R.V. రమణ మూర్తి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. తిరుపతి సభలలో ఆయన ఏదో ముఖ్యపాత్ర కూడా పోషించారు. ఆ సందర్బంగా,నేను మాట్లాడుతూ “వియత్నాం వీడు” సుందరం సంఘటన, పైన రాసిన విషయం చెప్పి “భాషా సంస్కరణం పేరుతో – భాషా సంహారం చెయ్యొద్ద”ని పెద్దలకి మనవి అన్నాను. ఆ తర్వాత విచిత్రంగా “ప్రపంచ తెలుగు మహాసభల” స్వాగత ద్వారాల మీద మొత్తం తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలు”ఌ, శ, ఱ, సర్గ, విసర్గ” లతో కలిపి అన్నీ ముద్రించారు.

సురేష్ కొలిచాల : తమిళ్ “ழ” (zha) కి తెలుగు ప్రత్యామ్నాయం “ఌ” అక్షరం కాదు. ఴ – ೞ అక్షరం. ఇది ప్రాఙ్నన్నయ్య తెలుగు శాసనాల్లో ఉండేది, 10వ శతాబ్ద కాలంలో తెలుగు నుండి అంతరించి పోయింది. దీనికి మేము 2012లో యూనీకోడ్ ప్రమాణానికి జతపరిచమని ప్రతిపాదిస్తే, యూనికోడ్ ప్రధాన కమిటీ దాన్ని ఆ సంవత్సరంలోనే ఆమోదించింది.
http://www.unicode.org/…/12015-telugu-llla-proposal.pdf

ఌ- కు తెలుగు ೞ- (తమిళ ழ) కు ఏ రకమైన సంబంధం లేదు. ఌ is అచ్చు రూపంలో ల-కారం. ఋ అన్నది రేఫ (ర-కారానికి) అచ్చు రూపం అయినట్టుగానే.

ఋ, ౠ, ఌ, ౡ వంటి స్వర (అచ్చు) రూపాలు పూర్తిగా సంస్కృత భాష నుండి తీసుకోబడినవి. అచ్చ తెలుగు పదాలేవీ ఈ అక్షరాలను ఉపయోగించవు. అలాగే, ೞ (ழ), ఱ (ற) వంటివి అన్నీ ద్రావిడ భాషల్లో ఉండేవి. సంస్కృతంలో ఇవి కనిపించవు. చాలా ద్రావిడ భాషల్లో ೞ-కారం ఇప్పుడు అంతరించి పోయింది. తమిళంలో కూడా ఎవరో కొద్దిమంది తప్ప అందరూ దీని -ళ- కారంగానే పలుకుతారు.

Phonetically, ೞ (ழ) is retroflex approximant, and is in fact closer to /r/ than /l/.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!
  • సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !
  • గంగూలీ సౌరభం ! దాదాగిరీ ఇక బిగ్‌బాస్‌లో ! హోస్ట్‌గా ఫస్ట్ క్రికెటర్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions