Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుళ్లు లేని దేవుళ్లు… ప్రతి పేద గుడిసెలో కొలువు దీరిన సార్థకజీవులు…

August 9, 2023 by M S R

గుడి అవసరంలేని దేవుళ్ళు ! వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా ఉన్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.

1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న బావూరావ్ కోళే చాలా సంతోషంగా వున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర , MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తిగా వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి.

ఆ వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు. ”ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాల నుండి స్రవించిన రక్తంతో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారి గురించి క్షణమైనా తలుచుకోలేని ప్రతి వ్యక్తీ దేశద్రోహులతో సమానం” అని మనకు వివేకానందుడు చెప్పలేదా ?

Ads

వివేకానంద , మహాత్మాగాంధీ , వినోబా భావేల జీవితాలు , ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.

ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో ” నేను మారుమూల పల్లెల్లోని పేదలను డాక్టరుగా సేవించేందుకు వెళతాను..” తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర, మహరాష్ట్రలో అత్యంత వెనుకబడిన అయిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు.

అదే ఊరు ఎందుకు ఎన్నుకున్నారు?

దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు Where There Is No Doctor. వ్రాసినది David Werner. ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూ వుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా Hospital 30 kms away అని వ్రాసివుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించి వుంటుంది. అలా వైద్య సౌకర్యాలు ఏమీ లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన అనుకొన్నాడు.

తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ.జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి : 1. Sonography or Blood Transfusion లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం , 2. X-ray లేకుండా న్యుమోనియాకు వైద్యం చేయడం , 3. డయేరియాకు వైద్యం చేయడం. 6 నెలలు ముంబాయిలో వుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర.

వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. అమరావతి [ మహరాష్ట్ర] నుండి 40  కి.మి. నడచి వెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిశె వేసుకొని అక్కడి రోగులకు వైద్యం చేసేవాడు. ఆ పల్లె పేదరికం , నిరక్షరాస్యత , వ్యాధులతో నిండి వుంది. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరు అయిన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకొన్న యువతినే తాను పెళ్ళిచేసుకొంటాను అని

1. 40 కి.మీ. నడవగలగాలి.

2. 5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. [ 1989 లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అట అది ]

3. కేవలం 400 వందల రూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. [ ఎందుకంటే డా. రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి తీసుకొంటాడు ]

4. అవసరమైతే ప్రజల కోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి. 100 సంబంధాలు వచ్చినా, ఈ షరతులు చూసాక చాలామంది వెళ్ళిపోయారు.

ఒక యువతి మాత్రం సరేనంది. ఆమె పేరు డా. స్మిత … 1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర. కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ‘ మీ ఇష్టం ‘ అంది. ” ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే , ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు ” అని పల్లె ప్రజలకు చెప్పాడు.

డా. స్మిత ” మీరే నాకు వైద్యం చేయండి , నగరం వద్దు” అన్నది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు ఆది దంపతుల్లాగా కనిపించారు. నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు.

ఏడాదిలో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పని వుండదు. కాబట్టి ఆహారం కొరత , డబ్బు కొరత , దాని కారణంగా రకరకాల వ్యాధులు. ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు , అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ ఆలోచించి , ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండి గింజలు వీళ్ళే పండించుకోవాలి. అందుకోసమని డా. రవీంద్ర నగరంలో వుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడితో సలహాలు తీసుకొని , విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా క్రిమి , కీటకాలను ఎదుర్కొనగలిగే కొత్త , ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు.

దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును ”నీవు నగరం లో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ?” అని అడిగితే ” అలాగే , మీరు ఎలా అంటే అలా ” అన్నాడు కొడుకు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట భూమి దున్ని, తాము తయారు చేసుకొన్న విత్తనాలను నాటి , చక్కటి పంట తీసి పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డా. రవీంద్ర.

ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు. ఇపుడు తిండికి లోటుండదు , రెండుపూటలా తిండి కారణంగా , ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లెలో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండిన యువతీ యువకులు ఏడాదికి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది.

ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లెలో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి [ గతంలో – ఇపుడు కాదు ] ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర , డా. స్మిత , వాళ్ళ కుమారుడు రోహిత్ లు చేస్తున్న పని చూసి చాలా సంతోషించి , ” మీరున్న ఈ

చిన్న గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను ” అంటే అందుకు వాళ్ళు ఇలా అన్నారు : ” మాకు ఇదే చాలు , కానీ ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసేవిధంగాను , పల్లె లోపలా రోడ్లు వేయించండి…” సరే అన్నాడు మంత్రి. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి , ఆ పల్లె ఆధారంగా నడిచే 6 పాఠశాలున్నాయి , 12 వైద్యకేంద్రాలు ఉన్నాయి. కానీ సర్జరీలు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డా. రవీంద్ర తన రెండవకొడుకు రామ్ ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తీ చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.

కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు , పేదల గుండెలే గర్భగుడులు. మన ఇళ్ళలో , పాఠశాలల్లో , కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పం. కానీ చెప్పాలి. మామూలుగా కాదు , హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు…. (ఇది వాట్సప్‌లో షేర్ చేయబడిన స్టోరీ… రాసిందెవరో తెలియదు… కొంత అతిశయోక్తి కూడా ఉండి ఉండవచ్చు… కానీ చదవడానికి ఎంత బాగుందో… ఇలాంటి వ్యక్తుల నిర్మాణమే కదా జాతికి కావల్సింది… అందుకే మన పాఠకుల కోసం ఈ షేరింగ్)… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions