.
పొద్దున్నే సాయిత్యం ఇవ్వడానికి ఓ గుడికి వెళ్లాను… అంటే, ఓ బ్రాహ్మణ కుటుంబానికి ఓ పూట భోజనానికి అవసరమయ్యే సంభారాలను (బియ్యం, నూనె, కూరగాయలు, పప్పు, పెరుగు వంటి బేసిక్ ముడి సామగ్రి) ఇవ్వడం…
పితృకర్మలు, ఇతర సందర్భాల్లో ఇది ఇవ్వడం ఓ రివాజు… గుళ్లో అయ్యగారిని అడిగాను, సాయిత్యం తీసుకుంటారా అని..! రమ్మని సైగ చేశాడు… ఈరోజు నాన్న తిథి అని చెప్పాను, తనకు అర్థం కాలేదు… ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు… శ్రాద్ధం, తద్దినం అని తెలిసిన పర్యాయపదాలూ చెప్పాను…
Ads
హిందీలో వాటినేమంటారో తెలియదు… సరే, ఎలాగోలా తిప్పలు పడ్డాక అర్థమైంది… హిందీలోనే అడిగాడు… స్వయంపాకం తీసుకోవాలా అని… హమ్మయ్య, సాయిత్యాన్ని స్వయంపాకం అంటారా..? అవునన్నాను… మన పంతుళ్లు అయితే కొన్ని బియ్యపు గింజల్ని వాపస్ ఇచ్చి, మీరు వండుకునేప్పుడు అందులో కలపండి అంటారు… ఈయన సింపుల్‌గా తేల్చేశాడు… ఓ దశలో చిరాకెత్తి నార్త్ పంతులూ గోబ్యాక్ అనాలనీ అనిపించింది సుమండీ…
(ఇది ప్రతీకాత్మక చిత్రం మాత్రమే... గూగూల్ ఇచ్చింది)
ఎక్కడి నుంచి వచ్చారు అనడిగాను… యూపీ అన్నాడు… కోనాయపల్లి గుడి గుర్తొచ్చింది… కేసీయార్, హరీష్ తమ నామినేషన్ల పత్రాలకు అక్కడ పూజ చేయించాకే దాఖలు చేస్తారు… వాళ్ల నమ్మకం, అలవాటు… అక్కడా గుడిని పునర్నిర్మించారు… పంతులు వారణాశి నుంచి వచ్చాడు… తీరా ఆరా తీస్తే బోలెడు మంది మన గుళ్లల్లో యూపీ, ఒడిశా పంతుళ్లు పనిచేస్తున్నారట…
అఫ్‌కోర్స్, మన సద్బ్రాహ్మలకు అన్యాయం జరుగుతోందని ఎవరూ అనలేదు,, పైగా నార్త్ పంతుళ్లు ఇక్కడ నిష్టగా, పద్ధతిగానే వ్యవహరిస్తారు… బయట పూజలకు, క్రతువులకు వెళ్లరు… అంటే, వాళ్లకు తెలిసిన పద్ధతులకూ ఇక్కడి ఆచారాలకూ తేడా ఉంటుంది కాబట్టి… గుళ్లో పూజల వరకూ వోకే… అన్నీ కామన్ మంత్రాలే కదా…
ఇదంతా ఎందుకూ అంటే..? వీళ్లు కాదు… ఎప్పుడో ఇక్కడికి వచ్చి వివిధ వ్యాపారాల్లో స్థిరపడిన నార్త్ పీపుల్ కాదు… అందరినీ మార్వాడీలు అనొద్దు… ఇలా వచ్చినవాళ్లలో చాలా రాష్ట్రాల వాళ్లున్నారు, వారిలో అన్ని కులాల వాళ్లూ ఉన్నారు… చాన్నాళ్లుగా వాళ్లే కాదు, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వర్కర్స్ వస్తున్నారు…
ఈరోజు తెలంగాణలో అనేక రంగాల్లో వాళ్లు చెమటోడ్చి పనిచేస్తున్నారు… లేబర్ వర్క్ ఎక్కువగా… బీమారు రాష్ట్రాల్లో పనిలేదు, కూడు లేదు… తెలంగాణ లక్షలాది మందికి పనిచూపిస్తోంది… కడుపులు నింపుతోంది… చివరకు ఆధ్యాత్మిక రంగంలోనూ బయటి వ్యక్తుల రాకడ తప్పడం లేదు అని చెప్పడానికి ఇదంతా…
అధిక ధరల దోపిడీ, నాసిరకం సరుకులు, జీఎస్టీ ఎగవేత, గ్రూపు పెత్తనాలు అనే చర్చ… మార్వాడీ గోబ్యాక్ పిలుపులు వంటి అంశాల జోలికి పోవడం లేదు ఇక్కడ… వ్యాపారులు వేరు, వర్కర్లు వేరు…!! అవునూ, ఇంతకూ తద్దినాన్ని హిందీలో ఏమంటారో..!!
Share this Article