చిన్న స్పష్టీకరణ…. పురాణాలు, ఇతిహాసాల్లో పాత్రలు ప్రతినాయకులా, నాయకులా అనేది చిన్నప్పటి నుంచీ మన కుటుంబం, మన సమాజం, మన పుస్తకాలు, మన కళాప్రదర్శనలను బట్టి, మనం అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుంది… ఉదాహరణకు రాముడు ఆర్యుడు, ద్రవిడదేశంపై దాడికి వచ్చాడు, రావణుడిని హతమార్చాడు అని కోట్ల మంది నమ్ముతారు దక్షిణ భారతంలో.,.
రావణుడిని పూజిస్తారు… ఈరోజుకూ రాముడు, కృష్ణులను ఆర్య రాజులుగానే చూస్తుంది ద్రవిడ సమాజం… ఇప్పుడు కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనే చర్చ జరుగుతోంది కదా కల్కి సినిమా తరువాత… అది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది… సేమ్, భారతంలో దుర్యోధనాదులను పూజించేవాళ్లు లక్షల్లో ఉన్నారు… ప్రత్యేకించి కేరళలో… మరీ కేరళ దక్షిణ ప్రాంతం ద్రవిడ భావజాలానికి అడ్డా…
దేశంలోని చాలా ప్రాంతాలలో దుర్యోధనుడికి ఆలయాలున్నాయి.., అవి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి… ముఖ్యంగా వార్షిక జాతర సమయంలో కొల్లంలోని దుర్యోధనుడి గుడికి ఈ ఏడాది మార్చిలో దాదాపు 20 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా…
Ads
దుర్యోధనుడే కాదు, తన ప్రియ స్నేహితుడు కర్ణుడు, జూద నిపుణ మేనమామ శకుని, సోదరి దుస్సలతోపాటు మొత్తం 100 మంది కౌరవులకూ గుళ్లున్నాయి కేరళలోని అనేక ప్రాంతాల్లో కలిపి… కొల్లం, పతనంతిట్ట ప్రాంతాల్లో… కేరళలోని కురవ సమాజం కౌరవులను పూర్వీకులుగా పూజిస్తుంది…
(100 మంది కౌరవుల పేర్లు ఇవి…)
కొల్లాం జిల్లాలోని దుర్యోధన మలనాడ అన్ని దేవాలయాలలో ఎక్కువగా సందర్శించబడేది… మల అంటే ఒక కొండ… నడ అంటే గుడి… అసలు దుర్యోధనుడు కేరళకు ఎందుకొచ్చాడనేదీ ఓ కథే… ఇలా…
వనవాసం చేసిన పాండవులను గుర్తించే ప్రయత్నంలో తిరుగుతూ, అలసిపోయి దాహంతో ఉన్న దుర్యోధనుడు ఇతర కౌరవులతో కలిసి మలనాడ ప్రాంతానికి చేరుకున్నాడు… తను పూజారి మరియు అప్పటి ఆ ప్రాంత పాలకుడయిన మలనాడ అప్పోప్పన్ నివసించే ఇంటిని చేరుకున్నాడు… అతను కురవ సామాజిక వర్గానికి చెందినవాడు…
“ఒక వృద్ధ మహిళ దుర్యోధనుడికి కల్లు ఇచ్చింది.., అది అతిథులకు ఓ మర్యాద… దుర్యోధనుడు ఆ పానీయాన్ని స్వీకరించాడు… ఆ గ్రామస్థుల ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు… మళ్లీ వస్తాను, రాకపోతే నేను చనిపోయినట్టే భావించండి అని చెప్పాడు వాళ్లతో… రాలేదు, కానీ తన ఆత్మ వచ్చిందని నమ్మి, తనను ఎప్పుడూ పూజిస్తుంటారు వాళ్లు… దుర్యోధనుడే విస్తారమైన భూములను ఇచ్చాడు వాళ్లకు… ఇప్పటికీ ఆ గుడికి సంబంధించిన శిస్తులన్నీ దుర్యోధనుడి పేరిటే వసూలవుతాయి…
దుర్యోధనుడి గుడి సమీపంలోని ప్రదేశాలలోనే తన సోదరి దుస్సల, స్నేహితుడు కర్ణ, మామ శకుని వంటి ఇతర బంధువుల గుళ్లు కూడా ఉన్నాయి… కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు కొన్నాళ్లకు స్వర్గం చేరతారు, అక్కడ అప్పటికే దుర్యోధనుడు ఉన్నాడు, వీళ్లు చూస్తారు తనను… దుర్యోధనుడు విలనే అయితే స్వర్గానికి ఎందుకు చేరతాడు మరి…? ఈ ప్రశ్న దుర్యోధన ఆరాధకుల నుంచి వినిపిస్తుంది మనకు…
శకుని గుడి కొల్లంలోనే పవిత్రేశ్వరంలో ఉంటుంది… ఇది దుర్యోధనుడి గుడికి 14 కిలోమీటర్లు… కున్నతుర్‌లోని శకుని ఆలయం నుండి 30 నిమిషాల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన కర్ణ దేవాలయం ఉంది… శూరనాద్‌లో, 100 మంది కౌరవ సోదరుల ఏకైక సోదరి అయిన దుస్సలకి అంకితం చేయబడిన ఆలయం ఉంది… ఈ ఆలయం పోరువాజిలోని దుర్యోధన ఆలయానికి కేవలం 6 కి.మీ…
(ఫోటో: శకుని మలదేవ ఆలయం మలనాడ)…
దక్షిణ కేరళ అంతటా శకుని మరియు కర్ణుడు కాకుండా 101 మంది కౌరవ తోబుట్టువులకు అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయని నమ్ముతారు… వాటిలో కొన్ని ఇప్పుడు జాడ తెలియడం లేదు… చాలా ఆలయాల జాడ కోసం ఇంకా పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు…
వీటిల్లో పూజలు భిన్నంగా ఉంటాయి… దుర్యోధనుడి గుడిలో కోడిచికెన్, కల్లు, పొగాకు నైవేద్యంగా సమర్పిస్తారు… ఏవీ కఠినమైన హిందూ సంప్రదాయ పూజావిధానాలను అనుసరించవు… ఈ దేవాలయాలు కేరళలో అట్టడుగు వర్గాలచే పూజించబడే ప్రార్థనా స్థలాలు… ఉదాహరణకు, పోరువాజి పెరువిరుత్తి మలనాడ దుర్యోధన ఆలయంలో విగ్రహం ఉండదు, గర్భగుడి లేదు… భక్తులు తమ కానుకలు సమర్పించే ఎత్తైన వేదిక మాత్రమే ఉంది…
భౌతిక విగ్రహం లేనప్పుడు, భక్తులు ‘సంకల్పం’ అనే మానసిక ప్రక్రియలో నిమగ్నమై ఉండి, తమ ఊహల్లోని రూపాన్ని కొలుస్తారు… ఎప్పుడూ తలుపులు మూయని ఈ ఆలయంలో ఆచారాలు నిర్వహించే ఏకైక హక్కు, వివక్షను ఎదుర్కొంటున్న కురవ సభ్యులకు మాత్రమే ఉంటుంది… సెంట్రల్ ట్రావెన్‌కోర్‌లోని మినీ-కుంభమేళాగా పిలువబడే వార్షిక మలక్కుడలో ఈ ఏడాది కూడా ఎనిమిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు… ఇప్పుడు చెప్పండి, ఎవరు నాయకులు..? ఎవరు ప్రతినాయకులు..? (inputs :; indiatoday)
Share this Article