The Dictator: లంకలో భూమి మీద దిగకుండా…కనీసం భూమికి ఒక అడుగు పైన గాలిలో తేలే పుష్పక విమానంలో రావణాసురుడు ఆదమరచి నిద్ర పోతున్న వేళ…పిల్లి పిల్లంత సూక్ష్మరూపంలోకి మారిన హనుమ సీతాన్వేషణ పనిలో పడ్డాడు. లంకంత పుష్పక విమానం వంటశాలలో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, లంక మేడ్, ఫారిన్ మేడ్ లిక్కర్ బ్రాండ్స్, రాత్రి గానా బజానా విందు- మందు- పొందులను వాల్మీకి మొహమాటం లేకుండా రిపోర్ట్ చేశాడు. రికార్డ్ చేసి పెట్టాడు.
రాత్రిళ్లు కనీసం బెడ్ రూమ్ తలుపులు కూడా వేసుకోడు రావణాసురుడు. వాడి ధైర్యం అంతటిది. వాడు పడుకున్నప్పుడు గోడలకు ఉన్న చమురు దీపాలు, కిటికీ కర్టన్లు గాలికి కదిలితే వెలుగు- నీడలకు చీకాకు పడి ఎక్కడ వెంటపడతాడో అని పంచభూతాలు భయం భయంగా ఉన్నాయన్నాడు వాల్మీకి. లేచినప్పుడు రావణాసురుడికి పది తలలుంటాయి. పడుకున్నప్పుడు మాత్రం తొమ్మిది మాయమవుతాయి.
అదెప్పుడో త్రేతాయుగం కాబట్టి నిద్రలో కూడా పంచ భూతాలను నియంత్రించగల రావణులు ఉండేవారు. ఇది నవీన కలియుగం కాబట్టి పది తలల త్రేతాయుగపు రావణులకు చోటు లేదనుకుంటే మన అజ్ఞానానికి కలిపురుషుడు నవ్వుకుంటాడు. పది తలలు భౌతికంగా కనపడవు కానీ…రావణులే నిలువెల్లా వణికిపోవాల్సిన వేయి తలల రాజ్యాధినేతలు ఎందరు లేరు?
Ads
గుండె ఉగ్గబట్టుకుని ఒకసారి రష్యాకు వెళ్లి వద్దాం పదండి. ప్రతిపక్షాలపై మన ఐ టీ, ఈ డి, సీ బీ ఐ దాడులు ఎంత రామరాజ్యపు తమలపాకు దెబ్బలో అర్థమవుతాయి.రష్యాలో పుతిన్ ను వ్యతిరేకించిన ఒక ప్రతిపక్ష నాయకుడు కిటికీలో జారిపడి శాశ్వతంగా పోయాడు. మరో ప్రతిపక్ష నాయకుడు జైలు పాలై…విషాహారం తిని…బయటికొచ్చి…పిచ్చివాడై…ఈ లోకంలో ఉండలేక శాశ్వతంగా పోయాడు. పుతిన్ అక్రమాలు అంటూ గొంతు చించుకున్న మరో సామాజిక కార్యకర్త మెట్ల మీద జారిపడి శాశ్వతంగా పోయాడు. పుతిన్ అవినీతి అంటూ పెన్ను తీసి రాయబోయిన జర్నలిస్టు పెన్ను గొంతులో గుచ్చుకుని శాశ్వతంగా పోయాడు.
మరికొంత మంది మార్కెట్లో అరటిపళ్లు కొంటూ…ఎవరో తిని పడేసిన అరటి తొక్కమీద కాలు జారి…పడి…తల పగిలి శాశ్వతంగా పోయారు. కొందరు స్నానానికి బాత్ రూములో గీజర్ స్విచ్ ఆన్ చేయబోయి కరెంట్ షాక్ తగిలి…శాశ్వతంగా పోయారు. కొందరు హోటల్లో వేడి సూప్ గొంతులో అడ్డుపడి శాశ్వతంగా పోయారు. కొందరు రైలెక్కబోతూ తొట్రుపడి రైలు కింద నలిగి…శాశ్వతంగా పోయారు.
రష్యాలో పుతిన్ ను వ్యతిరేకించినవారు శాశ్వతంగా పోవడానికి ఆయన ఏ రకంగా బాధ్యుడు అవుతారు? ఎలా పోతారన్నది ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ఉన్నంత మాత్రాన ఆ క్రియేటివిటీ క్రీడిబిలిటీని ఆయన అకౌంట్లో వేయడానికి ప్రపంచానికి ఎన్ని గుండెలు ఉండాలి?
అరటి తొక్క మీద కాలు వేస్తే…
మెట్ల మీద తొట్రు పడితే…
రైలెక్కుతూ తూలి పడితే…
వేడి సూప్ గొంతులో అడ్డు పడితే…
పుతిన్ ఏమి చేస్తారు?
అరటి తొక్కలు వేసిన కల్చర్ లెస్ ప్రజలను, వెంటనే క్లీన్ చేయని మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీస్ ఫయింగ్ చేసి…ఫైర్ చేయాలి కానీ…పుతిన్ ను అనుమానించడం ధర్మమా?
తప్పు. పాపం. కళ్లు పోతాయి.
లెంపలేసుకోండి!
తాజాగా ఆయన పెంచి పోషించిన కిరాయి సైన్యం అధిపతి ఆయన్ను వ్యతిరేకించి…తరువాత తోక ముడిచాడు. రెండు నెలలు కాక ముందే ఆ అధిపతి ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పేలి…ఆ కిరాయి మూక అధిపతి ముక్కలు ముక్కలై…శాశ్వతంగా పోయాడు.ఆ పేలిన విమానం టర్బో డ్రమ్ లోకి ఆకాశంలో అంతెత్తున ఎగిరే గద్ద అడ్డు పడి ఇంత అనర్థం జరిగి ఉంటుందని రష్యా అధికారిక మీడియా అనుకుంటోంది.
మనం కూడా అలాగే అనుకుందాం.
ఎంత కాదనుకున్నా-
మనం కూడా అప్పుడో ఇప్పుడో విమానాల్లో తిరగాల్సిన వాళ్లమే కదా?
కనీసం అరటి పండు కొనబోయినప్పుడు మన కాలి కింద అరటి తొక్క అప్పటికప్పుడు రాకుండా ఉండాలని కోరుకునే బతుకు తీపి ఉన్నవాళ్లమే కదా?
పంచభూతాలను వణికించిన రావణులే నిలువెల్లా వణికి చచ్చే ఈ రాజ్యాధినేత ప్రత్యక్ష పరోక్ష యుద్ధకాండల రష్యాయణం రాయడానికి ఏ వాల్మీకి దిగిరావాలి? అంతే…అంతే!
రష్యాలో అంతా ఇంతే!
పుతిన్ వెంటబడితే అంతే!-పమిడికాల్వ మధుసూదన్ madhupamidikalva@gmail.com
Share this Article