.
Vmrg Suresh …….. మన తెనాలి రామకృష్ణుడికి ఎంత అవమానం ? ఒరేయ్, ఎంతకు తెగించార్రా…
తెనాలి రామకృష్ఱుడి జీవితం మీద దూరదర్శన్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే చాలా మంచి సీరియల్ తీసింది. తీసింది హిందీలో అయినా, తెలుగు వెర్షన్ లేకపోయినా కూడా దానిని దేశవ్యాప్తంగా జనం ఆదరించారు. ఎన్నిసార్లు ఎన్ని భాషల్లో తీసినా సూపర్‌హిట్ అయ్యే కంటెంట్ తెనాలి రామకృష్ణుడిది.
Ads
తెలుగులో కూడా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెనాలి రామకృష్ణ పేరుతో చాలామంచి సినిమా వచ్చింది. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో కూడా రామకృష్ణుడిని ఒక పాత్రగా చూపించారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 సినిమాలో చంద్రమోహన్ రామకృష్ణుడి పాత్రను పోషించారు.
వీటన్నిటిలో ఎక్కడా కూడా అభూతకల్పనలను చారిత్రకాంశాలుగా వక్రీకరించలేదు. అవసరాన్నిబట్టి కొన్ని కల్పనలను జోడించినా, ఆయన పాత్ర ప్రతిష్టను మసకబార్చేలా తీయలేదు. కానీ, ఇప్పుడు అదే మన రామకృష్ణుడికి హిందీలో దారుణ అవమానం కలిగేలా ఒక సిరీస్ ప్రసారమవుతోంది.
‘తెనాలి రామ’ పేరుతో ఇప్పటికే 220 ఎపిసోడ్ల దాకా విడుదలైన ఒక సీరియల్ అంతా చరిత్ర వక్రీకరణమే. ఈ హిందీ సీరియల్ తెలుగులో కూడా రోజుకొక ఎపిసోడ్‌గా విడుదలవుతోంది. మహావీరుడని చరిత్ర కీర్తిస్తున్న శ్రీకృష్ణదేవరాయలను ఇందులో ఒక వెధవ లాగా, మూర్ఖుడి లాగా చూపిస్తున్నారు.
ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే మహారాజుగా, ఒక భయస్తుడిగా ఆయనను చూపించడం తీవ్ర అవమానమే. కొత్త కొత్త పచ్చళ్లను తయారుచేసి భర్తకు తినిపించాలని భార్యలు చేసే అతి సీరియల్‌లో అతకలేదు. రామకృష్ణని తల్లి, భార్యల దగ్గర వణికిపోయే భయస్తుడిగా చూపిస్తున్నారు. చరిత్రలో రామకృష్ణుడి భార్య ప్రస్తావన ఇలా లేదు.
శారద పేరుతో ఆమె పాత్రను కోపిష్టిదానిగా, లచ్చుమమ్మ పేరుతో ఆమె తల్లిని మూగదానిలా చూపించడం ఇంకా దారుణం. అసలు ఆయనకు తల్లి లేదనే విషయాన్ని కూడా సీరియల్ రచయితలు మర్చిపోయారు. ఇదంతా దక్షిణాత్యులకు తీరని అవమానంగానే చూడాలి.
ఇలాంటి సీరియల్స్ తీసేటప్పుడు మంచి పరిశోధన చేసి కథను రూపొందించుకోవాలి. లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఉత్తరాది రచయితలు ఇలా వక్రీకరణలకు పాల్పడ్డారని నమ్మాల్సి వస్తుంది.
ఇక రాయలవారి సభలో తెనాలి రామకృష్ణుడిని తప్ప ఇంకే కవినీ చూపించలేదు. ధూర్జటి, ముక్కు తిమ్మన, అల్లసాని పెద్దన లాంటి మహా కవుల్ని కనీసం పాత్రలుగా చూపించినా బావుండేది. ఇక శ్రీకృష్ణదేవరాయలు తండ్రితో సమానంగా గౌరవించిన మహామంత్రి తిమ్మరుసు పాత్రను ఏమాత్రం ప్రాధాన్యం లేనిదిగా, రాయలు ఏం చెప్తే దానికి తలాడించే ఒక సేవకుడిగా, తెలివితేటలు లేనివాడిగా చూపిస్తున్నారు.
రాజగురువు తాతాచార్యుల పాత్రను కూడా వెగటు పుట్టించేదిలా రచించారు. రామకృష్ణుడు, రాయలతో పాటు, ఎవరేం మాట్లాడినా అడ్డం పడేవాడిగా, అత్యంత దురాశాపరుడిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. ఇందులో కొంత వాస్తవమున్నప్పటికీ ఆయన మరీ అంత మూర్ఖుడు కాదని చరిత్రే చెప్తోంది.
ఈ అబద్ధాలను ప్రసారం చేయకుండా ప్రేక్షకులే ఒక అడుగు ముందుకువేయాలి. సదరు ప్రొడక్షన్ హౌస్‌కి చరిత్ర గురించి తెలుసుకోవాలని హెచ్చరించాలి. ఒక ఉత్తరాన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. నా వంతుగా దానిని వారికి పంపిస్తాను.
*** *** *** *** ***
ఇక మరో కోణం నుంచి చూస్తే సీరియల్ చాలా బావుంది. నటీనటులు అద్భుతంగా కుదిరారు. ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బావున్నాయి. రామకృష్ణ పండితుడు, ఆయన భార్య, ఆయన తల్లి ; కృష్ణదేవరాయలు, ఆయన భార్యలు; రాజగురువు తాతాచార్యులు … అన్ని పాత్రలకూ నటీనటులు అద్భుతంగా కుదిరారు. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిముషాలు మాత్రమే ప్రసారం చేస్తున్నా చూడాలనిపిస్తూనేవుంది.
ఒక్కోసారి రోజుకు 2 ఎపిసోడ్స్ కూడా ప్రసారం చేస్తున్నారు. ఇక … చరిత్రను నిజమని నమ్మాలా, లేదా ఇప్పుడు ప్రసారమవుతున్న దానినే నిజమని నమ్మాలా? ఈ ప్రశ్నకు ఎవరి సమాధానం వారికుంటుంది…
*** *** *** *** ***
తెనాలి రామకృష్ణ పండితుడిది మా పక్కూరే. సత్తెనపల్లికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వున్న లక్కరాజు గార్లపాడు ఆయన పుట్టినవూరు. ఆయన ఇంటిపేరు కూడా గారపాటి. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణిస్తే, మేనమామలు ఆయనను తెనాలికి తీసుకువెళ్లారు. అందువల్లే ఆయన పేరును తెనాలికి అనుసంధానించారు……
(ఓసారి రేటింగ్స్ కోసం తాజా బార్క్ జాబితా పరిశీలిస్తే… ఒకటి రేటింగ్ వరకూ కనిపించలేదు… అంతకన్నా దారుణంగా ఉందేమో… అంటే ఎవడూ చూడటం లేదు… చూసినవాళ్లకు కడుపు రగిలిపోతోంది… అదీ సంగతి… )
Share this Article