Shankar Rao Shenkesi……….. టెన్త్ హిందీ పేపర్ లీకు… ఒక పరిశీలన… – టెన్త్ పరీక్షలు అంటేనే ఒక ప్రహసనం. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ రొటీన్ ‘కార్యక్రమం’. టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తే మన రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం 50 కూడా మించదు. కానీ ప్రతీ ఏటా సగటున 85 శాతంపైనే ఉత్తీర్ణత ఉంటుంది.
– టెన్త్ పరీక్షల్లో చిట్టీలు చూసి రాయడం అనేది ఒకప్పటి తంతు. ఇప్పుడంతా మారిపోయింది. 100 మార్కుల పేపర్‌లో 20 మార్కులు ఇంటర్నల్‌కు వదిలేస్తే, మిగిలినవి 80 మార్కులు. వీటిలో 20 మార్కులు బిట్ ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ఈ 20 మార్కుల విషయంలో మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది.
– చాలా పరీక్ష కేంద్రాల్లో 20 మార్కుల బిట్ ప్రశ్నలకు కొందరు ఇన్విజిలేటర్లే సమాధానాలు చెప్పేస్తుంటారు. వీరు దళారులు, ప్రైవేటు విద్యాసంస్థలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు.
Ads
– పరీక్ష కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇన్విజిలేషన్ డ్యూటీలు వేయించుకుంటారు. వీరు ప్రైవేటు విద్యాసంస్థలకు శాశ్వత ప్రతినిధులుగా ఉంటూ విద్యార్థులకు బిట్ మార్కుల విషయంలో సహకరిస్తుంటారు. ఇందుకు పెద్దమొత్తంలో ముడుపులు పుచ్చుకుంటారు.
– టెన్త్‌లో 10/10 జీపీఏ 100శాతం విద్యార్థులు సాధించడమనేది ప్రైవేటు విద్యాసంస్థల టార్గెట్. అది వారికి వ్యాపారం. ఇందుకోసం ఇన్విజిలేటర్లను మేనేజ్ చేయడంలో ఆరితేరి, పరీక్షల వ్యవస్థను ఏనాడో భ్రష్టు పట్టించారు.
– విలువలకు కట్టుబడిన ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వారికి మౌనమే శరణ్యం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 90 శాతంపైన ఉండటం వారికి వృత్తిపరంగా అవసరం. విద్యాశాఖ అధికారులు కూడా తమ జిల్లా రాష్ట్రంలో టాప్‌లో ఉండాలని మాల్ ప్రాక్టీస్‌కు సహకరిస్తుంటారు.
– ఒక్క ఇంగ్లిష్ ముక్క చదవలేని వారు, ఎక్కాలు సైతం అప్పచెప్పలేని వారు టెన్త్‌లో అలవోకగా ఉత్తీర్ణులవుతుంటారు. ఇంటర్నల్‌లో తమ సార్లు ఏసిపారేసే 20 మార్కులు, బిట్ ప్రశ్నలకు ఇన్విజిలేటర్ సార్ల ద్వారా పొందే 20 మార్కులతో అలవోకగా పాస్ అవుతారు.
– కమలాపూర్ జడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో హిందీ పేపర్ లీకు అనేది టెక్నికల్ అంశం మాత్రమే. అక్కడ లీకు చోటుచేసుకున్నా, చోటు చేసుకోకున్నా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉండేదే.
– కమలాపూర్‌కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు (కూలీ కుమారుడు) చెట్టు సహాయంతో మొదటి అంతస్తు కిటికీ వద్దకు వచ్చి, పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి బలవంతంగా హిందీ పేపర్ లాక్కొని వాట్సప్‌లో పోస్టు చేశాడనేది అభియోగం. ఇక్కడ కిటికీ వద్దకు వచ్చిన విద్యార్థి కంటే, అలా రావడానికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించిన అధికారులదే బాద్యత.
– కిటికీ వద్ద అంత జరుగుతున్నా మహిళా ఇన్విజిలేటర్ గమనించలేదు. పరీక్ష ప్రారంభమైన తొలి అర్ధగంట పాటు ఇన్విజిలేటర్లు పేపర్ వర్క్‌లో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలోనే సదరు మైనర్ బాలుడు ప్రశ్న పత్రం ఫొటో తీసుకొని వెళ్లాడని చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ సంఘటనలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ సస్పెండయ్యారు. ఇన్విజిలేటర్ అయితే ఏకంగా ఉద్యోగం నుంచే డిస్మిస్ అయ్యారు. ఇది అన్యాయం. సహజ న్యాయసూత్రాలకు విరుద్దం.
– టెన్త్ పరీక్షలు మొదటి నుంచీ అనేక లోటుపాట్ల మధ్యనే జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద సరిపడ పోలీసు సిబ్బంది ఉండరు.. లోపలా, బయటలా సీసీ కెమెరాలు ఉండవు… విద్యార్థులు పరీక్ష రాసే గదులకు చుట్టూరా భద్రతా ఏర్పాట్లు కనిపించవు.. వ్యక్తులు, వ్యవస్థల తప్పిదాలపై తక్షణ చర్యలు ఉండవు.. వీటిని సరిదిద్దకుండా, బయటి వ్యక్తులు నేరపూరిత ఉద్దేశంతో చేసే చర్యలకు ఉపాధ్యాయులను బలిచేయడం ఎవరూ హర్షించరు.
– మైనర్ బాలుడు కిటికీ వద్దకు వచ్చి ప్రశ్న పత్రాన్ని ఫొటో తీసుకొని వాట్సాప్‌లో పోస్టు చేయడానికి కారణం ఏమిటనేది ఇంతవరకు ఎవరూ తేల్చలేదు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అధికార పార్టీ నేతలు.. పోలీసులు చెబుతుండగా, ప్రైవేటు విద్యాసంస్థల కొమ్ముకాసే దళారుల ప్లాన్ మిస్‌ఫైర్ అయిందని ఇతర వర్గాలు చెబుతున్నాయి.
– తనను చంపుతానని బెదిరించి ప్రశ్న పత్రం లాక్కున్నాడని బాధిత విద్యార్థి దండబోయిన హరీశ్ చెబుతున్న కథనం కూడా నమ్మశక్యంగా లేదు. సంఘటన జరిగిన తర్వాతనైనా తరగతి గదిలోనే వున్న ఇన్విజిలేటర్‌కు ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదు.
– ముందస్తుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నిందితుల్లో ఒకరైన గుండెబోయిన మహేశ్(37) స్వయంగా మైనర్ బాలుడి(16)చే ప్రశ్న పత్రం ఫొటో తీయించాడని పోలీసులు చెబుతున్నారు. కానీ మైనర్ బాలుడు ఆ ఫొటోను మహేశ్‌కు పంపకుండా శివగణేశ్(19) అనే డ్రైవర్‌కు పంపాడు. శివగణేశ్ ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయగా, ఆ గ్రూపులోని పోతనబోయిన వర్షిత్ అలియాస్ చందు(19) దానిని మహేశ్‌కు పంపాడు. తర్వాత మహేశ్ ఆ ఫోటోను మాజీ జర్నలిస్టు బూరం ప్రశాంత్(33)కు ఫార్వర్డ్ చేశాడు. ప్రశాంత్ నుంచి అది మీడియా ప్రతినిధులకు, బండి సంజయ్‌కి షేర్ అయింది.
– పరీక్ష 9.30 గంటలకు మొదలు కాగా, మైనర్ బాలుడు 9.45 గంటలకు ఫోటో తీశాడు. పోలీసులు చెబుతున్నట్టు ముందస్తు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగితే, ఫోటో తీసిన మైనర్ బాలుడు దానిని పంపితే గింపితే గుండెబోయిన మహేశ్‌కు పంపాలి.. లేదంటే డైరెక్టుగా బూరం ప్రశాంత్‌కు పంపాలి. కానీ శివగణేశ్‌కు ఎందుకుపంపాడు.. ఆ శివగణేశ్ వాట్సాప్ గ్రూపులో ఎందుకు షేర్ చేశాడు.. అనేది అంతుబట్టని విషయం.
– మైనర్ బాలుడు 9.45 గంటలకు ప్రశ్న పత్రం ఫోటో తీస్తే.. బూరం ప్రశాంత్ దానిని 10.41 గంటలకు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు, 10.46 గంటలకు మీడియా వాట్సాప్ గ్రూపులకు షేర్ చేశాడు. ముందస్తు కుట్ర నిజమే అయితే, మైనర్‌బాలుడు ఫోటో తీసిన గంట తర్వాత వరకు ప్రశాంత్ ఎందుకు స్పందించలేదో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
– ప్రశాంత్‌ను మాజీ జర్నలిస్టు అనడం సబబు కాదు. జర్నలిజం ఆయన వృత్తి. సంస్థల్లో ఉండటం, ఉండకపోవడం అనేది వేరే విషయం. తనకు అందిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేది కూడా వృత్తిలో భాగంగానే చూడాలి. దీనిని నేరంగా చూస్తే జర్నలిస్టులు జీవచ్ఛవాల కిందే లెక్క.
– ఒక్కో ఇష్యూని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా వాడుకుంటాయి. పేపర్ లీకేజీ విషయాన్ని రాజకీయం చేయడంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఒకే విధంగా వ్యవహరించాయి. అంతిమంగా అవి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేశాయి.
– బండి అరెస్టు, బెయిల్‌పై విడుదల అనేవి న్యాయపరమైన అంశాలు. ఈ కేసులో నిజానిజాలను న్యాయస్థానాలు తేల్చుతాయి. తీర్పులు తేలేసరికి ‘రాజెవడో.. రంగడెవడో?’. ఈ లోగా పరీక్షల నిర్వహణ పటిష్టమైతే అదే పదివేలు.
– సమర్థుడైన, నిజాయితీపరుడైన అధికారిగా పోలీసు కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌కున్న ప్రతిష్ఠ.. హిందీ పేపర్ లీకు సంఘటనతో కొంత మసకబారినట్టే కనిపిస్తోంది.
– పరీక్షల నిర్వహణలో తలెత్తే లోపాలకు రాజకీయరంగు పులమకుండా, దానిని అడ్మినిస్ట్రేషన్, శాంతిభద్రతల అంశంగా చూస్తే ఎవరికైనా మంచిది.
–శంకర్‌రావు శెంకేసి(768 000 6088)
Share this Article