.
పహల్గాం ఉగ్ర దాడి షాక్ నుంచి దేశం యావత్తు ఇంకా కోలుకోలేదు
ఉగ్ర దాడుల గురించి తలుచుకోగానే ప్రతి ఒక్కరి గుండె కణకణ మండిపోతోంది
ప్రతి ఒక్కరి కంట ధార కారుతుంది
అందరి ఆవేశం ఒక్కటే… ఉగ్రవాదులను మట్టుపెట్టాలి
అందరి ఆవేదన ఒక్కటే
మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలి
మన ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రవాదులు రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలింది.
అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శాశ్వత పరిష్కారం
Ads
***
నా చిన్నప్పుడు నక్సలైట్ల సమస్య బాగా ఉండేది
కొండపల్లి సీతారామయ్య పేరు అటు పోలీసుల్లోనూ ఇటు ప్రజల్లోనూ మార్మోగిపోయేది
కళాశాల స్థాయి నుంచే విద్యార్ధులు ఉద్యమంలోకి వెళ్లేందుకు రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ ప్రోత్సహించేది
అంచేత అప్పట్లో ఉద్యమం పట్ల ఆకర్షితులై చాలామంది నక్సలైట్లలో చేరిపోయారు
వీళ్లలో చాలామంది చదువుకున్నవాళ్లే
ఎన్కౌంటర్లు.. ఎదురు కాల్పులు.. ఇరువైపులా ప్రాణ నష్టం నిత్య కృత్యంగా ఉండేవి
చిన్నప్పుడు ఒకసారి నేను ఫ్యామిలీతో కలిసి కారులో వరంగల్ వైపు ఓ విలేజ్ వెళ్తుంటే రోడ్ సైడ్ పాక టీ స్టాల్ దగ్గర నక్సలైట్లు తుపాకులు పట్టుకుని కనబడ్డారు
నాకు చాలా ఆశర్యం వేసింది
అడవుల్లో ఉండాల్సిన అన్నలు ఇంత ధైర్యంగా గ్రామాల్లో ఎలా సంచరిస్తున్నారు అని ?
అప్పట్లో ప్రజల్లో కూడా నక్సలైట్ల ఉద్యమం పట్ల సానుభూతి ఉండేది
బహుశా అందుచేతనే ఏమో అడవుల్లోనుంచి చిన్న చిన్న విలేజీలకు సైతం వచ్చి వెళ్ళే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి
ఏపీలో దాదాపు అన్ని మారుమూల గ్రామాల్లో నక్సలైట్ల ఉనికి ఉండేది
తర్వాతి కాలంలో మావోయిస్టులు అని పేరు మార్చుకున్నప్పటికీ సాయుధ పోరాటంలో మార్పు మాత్రం రాలేదు
ప్రభుత్వాలకు నక్సలైట్ల సమస్య ఆర్దికంగా.. లా అండ్ ఆర్డర్ పరంగా పెద్ద తలనొప్పి అయ్యింది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో స్వరన్ జిత్ సేన్ ను ప్రత్యేకంగా ఏరికోరి డీజీపీగా నియమించుకున్నారు
ఈ స్వరన్ జిత్ సేన్ డైరెక్ట్ పోలీస్ రిక్రూటీ కాదు
అంతకన్నా ముందు సైన్యంలో పనిచేశారు
ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన సైన్యం తరపున ధైర్య సాహసాలతో అసమాన ప్రతిభ చూపినందుకు మెడల్ కూడా పొందారు
అలాంటి స్వరన్ జిత్ సేన్ మీద వైఎస్ కన్నుపడింది
వెంటనే ఆయనను డీజీపీగా రాష్ట్రానికి తెచ్చుకున్నారు
స్వరన్ జిత్ సేన్ ఛార్జ్ తీసుకోగానే వైఎస్ అప్పచెప్పిన మొట్టమొదటి టాస్క్ నక్సలైట్ల ఉద్యమం ఉక్కుపాదంతో అణచడం
అప్పుడు వైఎస్ డీజీపీకి చెప్పిన మాట ఒక్కటే
“మీరేం చేస్తారో తెలీదు, రాష్ట్రంలో నక్సలైట్లు ఉండకూడదు.. అలా అని కనిపించిన నక్సలైటునల్లా ఎన్కౌంటర్ చేయడం పరిష్కారం కాదు.. వీళ్ళని నలుగుర్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంకో పదిమంది ఉద్యమంలోకి చేరతారు
అలా అమాయకులను ఉద్యమంలోకి చేర్పించి తుపాకులిచ్చి ఉద్యమ బాట పట్టించే నాయకుల లిస్ట్ తయారుచేయండి
రూట్ కాజ్ చెక్ చెయ్యండి
పెద్ద తలకాయలను ఏరెయ్యయండి
క్యాడర్ డిఫెన్స్ లో పడుతుంది
ఆ టైమ్ చాలు ఫిల్టర్ చేయడానికి ”
వైఎస్ చెప్పిన వ్యూహానికి డీజీపీ తనదైన స్టైల్ లో పదును బెట్టి నేరుగా పెద్ద తలకాయల మీద టార్గెట్ పెట్టటంతో అగ్ర నాయకత్వం డిఫెన్స్ లో పడి, మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ తరలి వెళ్లిపోయారు
గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గింది
***
పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటు వాది బింద్రన్ వాలే గురించి అందరికీ తెలుసు
అమాయకులైన సిక్కులను ఉసిగొల్పి ఉగ్రవాదానికి వాడుకుని పంజాబ్ లో అలజడి సృష్టించేవాడు
అప్పట్లో పంజాబ్ గొడవలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉండేది
పైపెచ్చు బింద్రన్ వాలే కి అప్పట్లోనే పాకిస్తాన్ ఆర్మీతోపాటు ఉగ్రవాద సంస్థలు కూడా మద్దతు ఇచ్చాయి
కానీ బింద్రన్ వాలే పంజాబ్ నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తుండటంతో స్థానిక సిక్కు యువకులను చేరదీసి ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం వాడుకునేవాడు
అన్నిటికీ మూలం బింద్రన్ వాలేనే
1984 లో ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట స్వర్ణ దేవాలయం మీద సైనిక దాడులు చేయించింది
ఈ ఆపరేషన్ లో బింద్రన్ వాలే ని సైన్యం మట్టుబెట్టింది
దాంతో ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయి చతికిలబడింది
అదే సమయంలో కేపీఎస్ గిల్ పంజాబ్ డీజీపీగా బాధ్యతలు తీసుకొని ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేశాడు
1988 లో గిల్ కూడా ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో స్వర్ణ దేవాలయం మీద దాడి చేసి మిగిలిన వేర్పాటు వాదుల్ని మట్టుబెట్టాడు
ఒకప్పుడు పంజాబ్ లో ఉగ్ర దాడి ప్రతిరోజూ మెయిన్ పేజీ బ్యానర్ వార్త
ఇప్పుడు అవి లోపలి పేజీల్లోకి వెళ్ళిపోయాయి
సమర్ధులైన ఆఫీసర్లు ఉంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు
***
బిన్ లాడెన్ సంగతి తెలుసు కదా
అగ్ర రాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టించాడు
విమానంతో ట్విన్ టవర్స్ కూ*ల్చివేసి అమెరికన్ ప్రెసిడెంట్ సైతం ఉలిక్కిపడేలా చేశాడు
అప్పుడే అమెరికా నిర్ణయం తీసుకుంది
బిన్ లాడెన్ టార్గెట్ గా మిలిటరీ ఆపరేషన్ నిర్వహించింది
కలుగులో దాక్కున్న బిన్ లాడెన్ ను అతడి స్థావరం లోనే చంపి సముద్రంలో విసిరేసింది
ఆ రకంగా అమెరికా ఉగ్రవాదం మూలం మీద మెరుపు దెబ్బ కొట్టింది
***
ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం సంగతికి వద్దాం
ఇవాళ కాకపోతే రేపైనా పహల్గాం లో దాడులకు తెగబడ్డ ముష్కరులను మన సైన్యం మట్టుబెడుతుంది
కానీ అంతటితో సమస్య పరిష్కారం కాదు
గతంలో పుల్వామా యూరి దాడుల మాదిరి చరిత్రలో ఇదో పేజీ అవుతుంది
ఈలోపు జరిగింది చాలామంది మర్చిపోతారు
కొద్ది సమయం తీసుకుని ముష్కరులు ఇంకోచోట పంజా విసురుతారు
రూట్ కాజ్ కనుక్కుని వైద్యం చెయ్యాలి
ఇటువంటి యువకులకు శిక్షణ ఇచ్చి మతం పేరుతో మారణకాండ చేయిస్తూ పాకిస్తాన్లో తలదాచుకున్న పెద్ద తలకాయల మీద టార్గెట్ పెట్టాలి
ఇజ్రాయెల్ తరహాలో పాకిస్తాన్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి చీడ పురుగులను ఏరెయ్యాలి
అట్నుంచి నరుక్కుంటూ రావాలి
నడిపించే నాధుడు లేక క్యాడర్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులను చేతుల్లోకి తీసుకోవాలి
ఈలోపు పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు కట్ చేసుకోవడం. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం.. పాకిస్తాన్ తో అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవడం.. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ ను ఒంటరిని చేయడం వంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూనే ఉండాలి
శత్రువు దృష్టి మళ్ళించి అదను చూసి పాకిస్తాన్ ఉగ్రవాద మూలాల మీద దెబ్బ కొట్టాలి
జరగబోయేది ఇదే! …………. [[ పరేష్ తుర్లపాటి ]]
Share this Article