.
( రమణ కొంటికర్ల ) టెస్లా అంటే ముందు గొర్తొచ్చేది ఎలాన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్… ఈ పేర్లన్నీ టెస్లాతోనూ, మస్క్ తోనూ ముడిపడి ఉన్నవే. అయితే ఈ సాంకేతికత వెనుక పనిచేసిన ఇంజనీర్లలో భారతీయుడి పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తోంది.
అతడే ఎలాన్ మస్క్ ప్రశంసించిన ఇంజనీర్.. టెస్లా ఆటోపైలట్ టెక్నాలజీ సృష్టిలో కీలకమైన వ్యక్తి అశోక్ ఎల్లుస్వామి!
Ads
తమిళనాడులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అశోక్ ఎల్లుస్వామి… టెస్లా ఏఐ, ఆటోపైలట్ బృందంలో చేరిన తొలి ఇంజనీర్. కానీ, ఇప్పుడు అదే విభాగానికి నాయకుడిగా ఎదిగాడు. 2019 నుంచి టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
మస్క్ ట్వీటుతో మొదలైన ఎల్లుస్వామి ప్రయాణం!
2014లో టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కార్ల కోసం ఇంజనీర్లను వెతుకుతోంది. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా ప్రతిభావంతులైన ఇంజనీర్లకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు స్పందించినవారిలో తమిళనాడుకు చెందిన అశోక్ ఎల్లుస్వామి ఒకరు.
అలా టెస్లా ఏఐ, ఆటోపైలట్ బృందంలో చేరిన తొలి ఇంజనీర్ గా కూడా అశోక్ కు గుర్తింపుండగా.. అక్కడి నుంచి తన ప్రయాణం ఆరంభమైంది. కానీ, సరిగ్గా కొన్నేళ్లు రీల్ లా తిరిగేసరికి అదే విభాగంలో ఇప్పుడు కీలక బాధ్యతలందుకున్నాడు అశోక్. ఏఐ, ఆటోపైలట్ సాఫ్ట్వేర్ మొత్తానికే నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు.
2024లోనూ ఎలాన్ మస్క్ నుంచి ప్రశంసలు!
అశోక్ గురించి ఎలాన్ మస్క్ గత రెండేళ్ల క్రితం 2024లో చేసిన వ్యాఖ్యలు ఆయన పాత్రను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాయి. అశోక్, మా అద్భుతమైన బృందం గనుక లేకపోతే… టెస్లా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికత కోసం మళ్లీ బయట మరో సంస్థను వెతుక్కోవాల్సిన కార్ల కంపెనీగానే మిగిలిపోయేదంటూ ఆయన అశోక్ ప్రతిభను ప్రశంసించారు.
చెన్నై టూ కార్నె మెలన్ వరకు!
అశోక్ ఎల్లుస్వామి చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ కార్నె మెలన్ యూనివర్సిటీ నుంచి రోబోటిక్ సిస్టమ్ డెవలప్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. టెస్లాలో చేరకమునుపు వాబ్కో వెహికిల్ కంట్రోల్ సిస్టమ్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాడు. అలాగే, వోక్స్ వ్యాగన్ ఎలక్ట్రానికి రీసెర్చ్ ల్యాబ్ లో రీసెర్చ్ ఇంటర్న్ గానూ పనిచేశాడు. అక్కడే వోక్స్ వ్యాగన్ అటానమస్ డ్రైవింగ్ బృందంతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించింది.
అంటే, టెస్లాలో అడుగు పెట్టేకంటే ముందే అశోక్ సాఫ్ట్వేర్, రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతపై అనుభవాన్ని సంపాదించాడు.
టెస్లా ఆటోపైలట్ ప్రయాణంలో కీలక పాత్ర!
టెస్లా తన ఆటో పైలట్ వ్యవస్థను 2015లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ వ్యవస్థ అభివృద్ధిలో ఎలాన్ మస్క్ పాత్రనూ అశోక్ ప్రత్యేకంగా అభినందించాడు. మస్క్ కు ఉన్న సాంకేతిక అవగాహన, పట్టుదల, నిరంతర కృషి.. టెస్లాను రియల్ వరల్డ్ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్తాయని అశోక్ పేర్కొన్నాడు.
టెస్లా ఆటోపైలట్ వ్యవస్థ అనేది ఏ ఒక్క వ్యక్తి కృషితోనో పూర్తయ్యేది కాదు. దాని వెనుక భారీ ఇంజనీరింగ్ బృందం, సాఫ్ట్వేర్, డేటా, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్ వంటి అనేక సాంకేతికతలుంటాయి. ఆయా విభాగాల సమన్వయంతోనే ఆటోపైలట్ వాహనాల ప్రయోగాలను సమర్థవంతంగా చేయగలరు. అలాంటి బృందంలో మొట్టమొదట చేసిన ఇంజనీర్ గా.. మన అశోక్ ఎల్లుస్వామి ప్రత్యేకత సంపాదించుకోవడమే కాకుండా.. సరిగ్గా ఏడేళ్లు తిరిగే సరికి ఆ మొత్తం విభాగాలన్నింటికీ నాయకత్వం వహించే స్థాయికెదగడం మరో విశేషం.
తెరపైన మస్క్.. తెర వెనుక వేలాది మంది ఇంజనీర్స్!
టెస్లా విజయగాధలో ఎలాన్ మస్క్ పైకి కనిపించే స్టార్ కావచ్చుగానీ… ఆ కంపెనీ అభివృద్ధి చేస్తున్న సాంకేతికత వెనుక పనిచేసే ఇంజనీర్ల కృషి కూడా అంతే ముఖ్యమైంది. అశోక్ ఎల్లుస్వామే అందుకో ఉదాహరణ.
మస్క్ మాటల్లోనే చెప్పాలంటే… టెస్లాను కేవలం ఓ కార్ల కంపెనీలా కాకుండా… వాస్తవ ప్రపంచంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే సంస్థను కీలకంగా నిలబెట్టిన బృందంలో అశోక్ ఎల్లుస్వామిదే ముఖ్య భూమిక.
ఒక భారతీయ ఇంజనీర్ ప్రయాణం ఈరోజు.. టెస్లా ఏఐని ప్రభావితం చేసే స్థాయికెదగడం ఓ ప్రౌడ్ మూమెంట్.
Share this Article