మోహన్‌లాల్‌తోపాటు కొడుకు ప్రణవ్, దర్శకుడు ప్రియదర్శన్ బిడ్డ కల్యాణి, సుహాసిని, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజూ వారియర్, కీర్తి సురేష్… ఇంకా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కాస్త పేరున్న నటీనటులు బోలెడు మంది… అంతటి భారీ తారాగణం నడుమ ఒక పాత్ర, ఒక నటుడు కాస్త మెరిసినట్టు అనిపించాడు… పేరు జయ్ జే జఖ్రిత్… పాత్ర పేరు చియాంగ్ జువాన్ అలియాస్ చిన్నాలి… చూడగానే ఓ చైనా యువకుడిలా కనిపిస్తాడు… సినిమాలో పాత్ర కూడా చైనా యువకుడిదే… మొదట్లో చాలామంది సినిమా రిపోర్టర్లు కూడా చైనా యాక్టరే అని రాసేశారు… నిజానికి తనది థాయ్‌లాండ్… బ్యాంకాక్‌లో పుట్టాడు…
అంత భారీ తారాగణం, పేరొందిన హీరోల నడుమ తను మెరవడానికి కారణం తన పాత్రకున్న ప్రాధాన్యం ప్లస్ తన అప్పియరెన్స్… కీర్తిసురేష్‌తో తన ప్రణయ సన్నివేశాలతోపాటు పోరాట దృశ్యాల్లో బాగా చేశాడు… కీర్తిసురేష్‌తో లవ్వు, తరువాత అర్జున్ చేతిలో అనుకోకుండా హతమవడంతోనే మొత్తం కథ మలుపు తిరుగుతుంది… సరే, ఇప్పుడు ఆ కథ, కథనలోపాల లోతుల్లోకి మనం వెళ్లడం లేదు… మలయాళ ఇండస్ట్రీలో బహుశా ఇదే అత్యధిక చిత్రనిర్మాణ వ్యయం రికార్డు… 80 నుంచి 100 కోట్లు అట… కానీ ఆ భారీ సినిమా మీద ప్రేక్షకవర్గాల్లో పెద్దగా చర్చ లేదు, హడావుడి లేదు… మొదటి 3 రోజుల్లో దీని వసూళ్లు జస్ట్, 20 కోట్లట… అంటే అరేబియా సముద్రపు తుఫాన్‌లో ఈ ఓడ మునిగిపోయినట్టే కనిపిస్తోంది…
Ads
పేరుకు పాన్ ఇండియా సినిమా… పలు భాషల్లో విడుదల చేయడం, అన్ని భాషల్లోనూ ఓటీటీ, టీవీ తదితర రైట్స్ అమ్మేయడం… ఇప్పుడిది నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టేశారు… సినిమా చూస్తే పలుచోట్ల ప్రియదర్శన్ మార్క్ సీన్లు కనిపిస్తయ్… కానీ ఎంతసేపూ తమిళ, మలయాళ కోణంలోనే ఆలోచించి తీయబడిన సినిమా… ఇతర భాషల్లోకి జస్ట్, డబ్ చేసి వదిలారు… తెలుగులో ఈ సినిమాకు ప్రధానశాపం ఆ డబ్బింగ్ తీరు… పాటలు వదిలేయండి, మలయాళ ట్యూన్లలో తెలుగు పదాలు కొన్ని నానా కష్టాలుపడి ఇరికించాడు వెన్నెలకంటి… ఒక్కటీ ఆకట్టుకోదు… పైగా మాటలు… అప్పుడప్పుడూ హాలీవుడ్ సినిమాల్ని తెలుగులోకి నాసిరకంగా డబ్ చేసి వదులుతారు కదా… ఈ సినిమా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది…
నిజానికి మలయాళంలో ఎవరు ఒరిజినల్ డైలాగులు రాశారో గానీ… తెలుగులోకి వచ్చేసరికి వాటి అనువాదం తీరు అస్సలు బాగాలేదు, ఆ మాటల్ని పలికే తీరు మరీ బాగాలేదు… అది నిజానికి తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంత భాష కాదు… ఎవరికీ నేటివ్ భాష కాదు… అది కేవలం డబ్బింగ్ సినిమాల మాండలికం, అంతే… హైదరాబాదులో అనేకమంది రచయితలున్నారు, ఎవరిని పెట్టుకున్నా కాస్త మంచి భాషలో పనికొచ్చే డైలాగులు రాసిచ్చేవాళ్లు… మంచి మంచి డబ్బింగ్ తెలిసిన ఆర్టిస్టులు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులున్నారు… సరైన ఫీలింగ్స్‌తో వాయిస్ ఓవర్ చేసిపెట్టేవాళ్లు… అంతటి భారీ ఖర్చు, భారీ తారాగణం పెట్టగలిగిన నిర్మాతలకు ఇదుగో, ఈ విషయాల్లో ఆసక్తి లేదు… నిర్లక్ష్యం… చూసేవాడు చూస్తాడు, లేకపోతే లేదులే అనేంత తేలికతనం… అసలు చెన్నై నుంచి బయటికొచ్చి చూస్తే కదా తెలిసేది… అందుకే సినిమా కనీస స్థాయిలో తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది..!! టాప్ ఖర్చు, టాప్ సెట్లు, టాప్ యాక్షన్ సీన్లు, టాప్ యాక్టర్స్… ఇవే కాదు, కథ, కథనం, డబ్బింగ్, బీజీఎం, మాటల తీరు, మలుపులు… ఇలాంటి అంశాల్లో తీసుకునే జాగ్రత్తలే ప్రధానం… నిలబెట్టేవి అవే, ముంచేసేవీ అవే…
Share this Article