.
తండేల్ సినిమాకు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఉచితంగా, ఉదారంగా పబ్లిసిటీని కల్పిస్తున్నాయి… వాళ్లలో వాళ్లు తన్నుకుంటూ… అదే సోషల్ మీడియాలోనే… (అరెస్టులు, విడుదల తేదీలు, సంవత్సరాల్ని కూడా ఇష్టారాజ్యంగా చెప్పేస్తూ…)
ఏ ఇష్యూ అయినా తీసుకొండి… ఏపీలో రాజకీయం రుద్దబడుతుంది… కులం రుద్దబడుతుంది… కానీ ఇక్కడ మత్స్యకారులు కాబట్టి కులం బురదను పూయలేదు గానీ… రాజకీయాల్ని రుద్దేశారు…
Ads
అందరికీ తెలుసు, అది ఓ రియల్ స్టోరీ ఆధారంగా నిర్మితమైన సినిమా అని… కాకపోతే చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు… (దీనిపై ఎవరో ఒక ఫిషర్‌మెన్ అసోసియేషన్ నేత విమర్శలకు దిగాడు)… అది సహజం కూడా… మన సిక్కోలు మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ వెళ్లి చేపలు పడుతూ ఉంటారు… ఏనాటి నుంచో ఉంది…
దేశాల నడుమ జలాల్లో స్పష్టమైన విభజన రేఖలు ఏమీ ఉండవు… చేపలు పడుతూ పడుతూ వేరే దేశజలాల్లోకి వెళ్లడం అనేది చాలా కామన్… శ్రీలంక, ఇండియా నడుమ… ఇండియా, పాకిస్థాన్ నడుమ మాత్రమే కాదు… ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఈ వివాదాలు, అరెస్టులు, జైళ్లు కూడా కామన్…
కాకపోతే పాకిస్థాన్ జైళ్లు నరకానికి ప్రతిరూపాలు, పైగా ఇండియన్స్ గనుక ఏ కారణంతో దొరికినా సరే, జైళ్లలో కుక్కి, రకరకాలుగా తమ కక్ష ప్రదర్శిస్తారు, వేధిస్తారు… తండేల్ కథలోనూ అదే… ఇలాంటి విషయాల్లో దేశాలు పరస్పరం సంప్రదింపులతో, పట్టూవిడుపులతో వ్యవహరించి చేపల వేట పడవలను, జాలర్లను వదిలేస్తుంటాయి, అదీ కామన్…
కానీ మొన్నామధ్య మొగతమ్మ అనే మహిళ మాట్లాడుతూ తన భర్త, ఇద్దరు కొడుకుల్ని పాకిస్థాన్ నేవీ పట్టుకుపోతే అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని, విడిపించి, తలా 5 లక్షల పరిహారం కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది… ఇంకేం, దాన్ని బేస్ చేసుకుని అసలు తండేల్ జగన్మోహన్‌రెడ్డేనని వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది…
(ఒక రాష్ట్ర సీఎం స్వయంగా పాకిస్థాన్ వంటి దేశంతో సంప్రదింపులు జరిపి విడిపించడం ఎలా సాధ్యమనేది జవాబు తెలియని అతి పెద్ద ప్రశ్న… కేంద్రంతో ఫైట్ చేసి, విదేశాంగ శాఖను ఉరుకులు పెట్టించి, మోడీతో తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించి, జగన్ విడిపించాడు అని రాసుకున్నా కాస్త అర్థం ఉండేదేమో)…
అనుకుంటున్నదే… జగన్‌కు మైలేజీ వస్తుందని గమనించిన వెంటనే టీడీపీ కూటమి రంగంలోకి దిగి కౌంటర్ చేయడమో, లేక మరోరకంగా జగన్ ప్రమేయం ఏమీ లేదని ప్రచారంలోకి తీసుకొస్తుందని ఊహించిందే… పైగా శ్రీకాకుళం మీడియా ఏ ఇష్యూ వచ్చినా టీడీపీ రామ్మోహన్‌నాయుడిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటుంది…
పైగా ఇది శ్రీకాకుళం మత్స్యకారుల కథాయె… అందుకని వచ్చేసింది ఒక స్టోరీ… ఆంధ్రజ్యోతిలో… అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు తీసుకెళ్లడంతోనే, ఆమె పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరిపి జాలర్లను విడిపించిందట… ఇదేకాదు…
ఎక్కడెక్కడికో వలస వెళ్లి అవస్థలు పడే మత్స్యకారుల కోసం భావనపాడు హార్బర్ నిర్మాణానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఈలోపు జగన్ అధికారంలోకి వచ్చాక అది మూలనపడిందట… దాన్ని మూలపేటకు తరలించడానికి ప్రయత్నించారట… కేవలం ఎన్నికల లబ్ధి కోసం వైసీపీ నేతలు మంచినీళ్లపేటలో జెట్టీ, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారట… ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించిందట…!!
ఎహె, అసలు తండేల్ రామ్మోహన్ నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు… మా మోడీ, మా సుష్మా స్వరాజ్ కృషి మాత్రమే కారణమని బీజేపీ వాళ్లకు ప్రచారం చేతకావడం లేదు ఫాఫం… ఎలాగూ జనసేనకు ఇందులో సే లేదు… మీరైనా అటు వైపు నుంచి మొదలెట్టండి… సినిమాకు మరింత ప్రచారం, అల్లు అరవింద్‌కు మరిన్ని డబ్బులు…!!
Share this Article