.
తండేల్ సినిమా కథ మీద ఇంకా టీడీపీ, వైసీపీ క్యాంపుల నడుమ రచ్చ నడుస్తూనే ఉంది… పాకిస్థాన్ నేవీకి పట్టుబడి, జైలుపాలైన ఆ మత్స్యకారులు ఎప్పుడు విడుదలయ్యారు, ఎవరు ప్రయత్నించారు, ఎవరు సాయం చేశారు అంశాల్లో విరుద్ధ కథనాలు వినిపిస్తున్నాయి…
ఓ ఆసక్తికరమైన చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది… జగన్ కృషిని, సాయాన్ని కూడా ప్రస్తావిస్తూ రియలిస్టిక్ అంశాల్నే తొలుత షూట్ చేశారనీ, జగన్ ఓడిపోయాక తన ప్రస్తావనను తీసిపారేసి రీషూట్ చేశారనేది ఆ చర్చల సారాంశం… నిజానిజాలు అల్లు అరవిందుడికి, చందు మొండేటికి తెలియాలి…
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి చొరవ, ప్రయత్నం వల్లే అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయత్నాలు, సంప్రదింపుల వల్లే మత్స్యకారులు విడుదలయ్యారని టీడీపీ బ్యాచ్ చెబుతోంది… నో, జగన్ ఎఫర్ట్ వల్ల విదేశాంగ మంత్రి జైశంకర్ చొరవ తీసుకుని విడిపించాడనీ, ఐనా ఇంకా చాలామంది పాకిస్థాన్ జైళ్లలో ఉన్నారనీ వైసీపీ బ్యాచ్ చెబుతోంది…
Ads
మిత్రుడు Nagarjuna Yadav ఫేస్‌బుక్ తన వాల్ మీద మూడు భాగాలుగా ఓ సుదీర్ఘ వివరణ రాశాడు ఈ అంశంపై…. ఆసక్తి ఉన్నవాళ్లు అది పూర్తిగా చదవండి… ఇదీ తన వాల్… https://www.facebook.com/ImYanamala (ఇది ఆ సినిమా పాటలు, నటీనటుల ప్రతిభ ఎట్సెట్రా అంశాల సమీక్ష కాదు…)
ఐతే దర్శకుడు మొదటి నుంచీ ఇది రియల్ కథే అని చెబుతూ… క్రియేటివ్ ఫ్రీడమ్ పేరిట అసలు కథను ఇష్టారాజ్యంగా మార్చిపారేశాడనీ, పైగా పలు అంశాల్లో కనీస విజ్ఞతను, పరిజ్ఞానాన్ని కూడా చూపలేదనీ ఓ విమర్శ వస్తోంది… నాగార్జున యాదవ్ వివరణలోని ఆ కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి… (పార్టీల వాదనలకు భిన్నంగా మత్స్యకారుల సమస్యకు మరో కోణాన్ని ప్రస్తావిస్తూ సాగిన పోస్టు ఇది..)
తండేల్ సినిమా దర్శకుడు ఈ సమస్య యొక్క కేంద్రాన్ని పట్టుకోవడంలో విఫలమవ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, అత్యంత బాధ్యతారహితంగా ఒక నిజ జీవిత సంఘటనను, పైగా దాయాది దేశ సమస్యను, మన దేశ ఆత్మగౌరవాన్ని పట్టించుకోకపోవడం ఒక దిక్కుమాలిన నిర్ణయంగా మనం భావించాలి.
పాకిస్తాన్ జైల్లో సినిమాటిక్ స్వేచ్ఛ కోసం రాసుకున్న బరితెగింపు సన్నివేశాలు చూస్తే దర్శకుడి యొక్క అవగాహన రాహిత్యం మనకు స్వచ్చంగా కనపడుతుంది. ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాబట్టి వైఎస్ జగన్ తీసుకున్న చొరవను, సాయాన్ని సినిమాలో చూపించలేదు కాబట్టి నేను ఈ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చడం లేదు.
ఒక సాధారణ భారతీయుడుగానే నేను స్పందిస్తున్నా… భారతదేశం నుండి పొరపాటున పాకిస్తాన్ వెళ్లి చిక్కుకున్న వ్యక్తుల కోసం 1951 నుండి పాకిస్తాన్ కు చెందిన *Edhi Foundation* అనే స్వచ్చంద సంస్థ పని చేస్తుంది.
అక్కడ చిక్కుకున్న భారతీయులు కూడా మనుషులే అని గుర్తించి పాకిస్తాన్ లో వారికీ ఆర్ధిక సాయం అందించడం, అవసరమైన మౌలిక ఏర్పాట్లు చేయడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం ( ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ అంబులెన్స్ వ్యవస్థ ఉన్న ఏకైక స్వచ్చంద సంస్థ) మాత్రమే కాక *సంస్థ స్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈద్* స్వయంగా భారతీయ జాలర్ల కోసం పాకిస్తాన్ కోర్టులో వాదనలను వినిపిస్తాడు,
2016 లో అయన చనిపోయాక కూడా Edhi Foundation అతని స్పూర్తిని కొనసాగిస్తూ పాకిస్తాన్ నుండి విడుదల అయిన జాలర్లను గౌరవంగా పాకిస్తాన్ సంప్రదాయంలో బట్టలు, స్వీట్లు మరియు భోజనం ఏర్పాటు చేసి, వాఘా సరిహద్దుకు రవాణా సౌకర్యం కూడా కల్పించి, వారిని ఇండియా అధికారులకు అప్పజెప్పుతారు.
ఇటువంటి గొప్ప కార్యక్రమాల వలన ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు కాస్త చక్కబడుతుంటే సినిమాలో కుమ్మరించిన ద్వేషం వలన భవిష్యత్తులో ఇటువంటి విదేశీ వ్యవహారాల్లో తలనొప్పులు వస్తాయనే స్పృహ కూడా సినిమా యూనిట్ కి లేకపోవడం భారతీయులు ఖర్మగా భావించాలి.
*అసలెందుకు మన జాలర్లను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేస్తున్నారు..?*
ఇంత కీలకమైన అంశన్ని దర్శకుడు వదిలేయడం ద్వారా తన తలలో ఉన్న గుజ్జు ఏంటో అర్ధమవుతుంది.
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి, కచ్ మహారాజుకు మధ్య *1914లో ఒక ఒప్పందం కుదిరింది…
ఈ ఒప్పందంలో, కచ్ ప్రాంతాన్ని బ్రిటిష్ బాంబే ప్రెసిడెన్సీ కింద చేర్చారు. కచ్ ప్రాంతానికి చెందిన *సర్ క్రిక్ (Sir Creek)* ఒక పొడవైన మరియు ఎస్ట్యువరీ (Estuary) ప్రాంతం, (అంటే సముద్రపు నీరు భూభాగంలోకి ప్రవేశించే భాగం) కూడా బ్రిటిష్ ఇండియాలో చేరిందా? లేదా? అని కొన్ని గందరగోళాలు ఏర్పడ్డాయి.
1947లో భారతదేశం విభజన అనంతరం, సర్ క్రిక్ భౌగోళికంగా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా మారింది. ఇది గుజరాత్ రాష్ట్రం (భారతదేశం) మరియు సింధ్ ప్రావిన్స్ (పాకిస్తాన్) మధ్య గల ఓడరేవు/ ఏస్ట్యువరీ (Estuary) ప్రాంతంగా వివాదాస్పదం అయ్యింది.
అయితే, బ్రిటిష్ నేవిగేషన్ మ్యాప్స్ మరియు పాత ఒప్పందాల ఆధారంగా పాకిస్తాన్ ఈ ప్రాంతంపై తన హక్కుని వాదిస్తుంది. భారతదేశం మాత్రం 1914 ఒప్పందాన్ని ప్రామాణిక సాంప్రదాయ పద్ధతిగా చెప్తూ, అంతర్జాతీయ నదీ హక్కుల ప్రామాణిక నిబంధనల ప్రకారం, ఏదైనా నదీ లేదా ఎస్ట్యువరీ (Estuary) యొక్క మధ్య భాగమే సరిహద్దుగా పరిగణించాలని సర్ క్రీక్ మధ్య గీత (Mid-channel) సరిహద్దుగా ఉండాలని వాదిస్తుంది.
కానీ పాకిస్తాన్, ఇది అంతర్జాతీయ నదీ మార్గం కాదని, ఒక ప్రాంతీయ జలప్రదేశంగా పరిగణించబడాలని అంటోంది. పూర్తి సర్ క్రిక్ ప్రాంతం తన ఆధీనమని చెప్తుంది. దీంతో *సర్ క్రిక్ ప్రాంతం* భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక అనిశ్చిత భాగంగా మారింది. ఈ వివాదం వల్ల సరిహద్దు రేఖ ఖచ్చితంగా నిర్ణయించబడలేదు.
సముద్రపు ఆర్థిక హక్కులు (Exclusive Economic Zone – EEZ) కూడా వివాదంలోకి వచ్చాయి. ఈ వివాదం భారత తీర రక్షణ దళం (Indian Coast Guard) మరియు పాకిస్తాన్ నేవీ మధ్య అనేకసార్లు మానిటరింగ్ & పహారా చర్యలకు దారి తీసింది.
సర్ క్రిక్ ప్రాంతం ఓడరేవు మార్గం అయినందున, ఇక్కడ భద్రతా పర్యవేక్షణ అత్యంత కఠినంగా మారింది. పాకిస్తాన్ సముద్ర దళం (Pakistan Navy) మరియు భారత తీర రక్షణ దళం (Indian Coast Guard) ఈ ప్రాంతంలో క్రమం తప్పకుండా పహారా కాస్తుంటాయి.
ఈ వివాదం కారణంగా, “ఆ కనిపించని గీతను దాటుతూ” భారత మరియు పాకిస్తాన్ మత్స్యకారులు తరచుగా పరస్పర జలాల్లోకి ప్రవేశిస్తుంటారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌లు భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకోవడం తరచుగా జరుగుతుంది. ఇదే విధంగా, భారత తీర రక్షణ దళం పాకిస్తాన్ మత్స్యకారులను అదుపులోకి తీసుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. ( పాకిస్తాన్ జాలర్లు 136 మంది మన జైళ్లలో ఉన్నారు, పాకిస్థాన్ జైళ్లలో కూడా మన దేశ మత్స్యకారులు ఇంకా ఉన్నారు )…
1969లో భారతదేశం మరియు పాకిస్తాన్ వివాదం పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించాయి, 2007లో ఇరు దేశాలు టెక్నికల్ కమిటీలు ఏర్పాటు చేసి, వివాదం పరిష్కరించే ప్రయత్నం చేశాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి తుది నిర్ణయం రాలేదు. ఇప్పటికీ సర్ క్రిక్ ఒక అనిర్ధారిత, వివాదాస్పద భాగంగా ఉంది.
భద్రతా పర్యవేక్షణ, మత్స్యకారుల ఆర్థిక నష్టం, నౌకాయాన మార్గాల వివాదాలతో ఎంతో సున్నితమైన ఒక అంతర్జాతీయ సమస్య మిళితమైన ఒక ఇతివృత్తమైన అంశాన్ని కధావస్తువుగా తీసుకోని, పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాలో ఒక ద్వేషపూరితమైన, కుసంస్కారమైన అంగడి సరుకును జొప్పిస్తే ఈ దర్శకుడికి దేశంపై శ్రద్ద, అంతర్జాతీయ దృక్పధం ఉన్నట్టు మనం అనుకోవాలా..?
ఈ సమస్యను UN Maritime Law ఆధారంగా పరిష్కరించుకోవాలా..? SAARC సమావేశంలో నిర్ణయించుకున్నట్టు ఓపెన్ లైన్ ఆధారంగా పరిష్కరించుకోవాలా? Demilitarized జోన్ గా మార్చాలా? అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ద్వార పరిష్కారం చూపాలా? సముద్ర సరిహద్దు నిర్దారణ కోసం రెండో దశ చర్చలు జరపాలా..? అనే ప్రపంచ దేశాలన్ని తలపీక్కుంటుంటే దర్శకుడు చందు మొండేటి పాకిస్తాన్ జైల్లో భారతదేశ జెండా ఎగరెయ్యడం, పైగా జెండాను కాల్చివేయడం, పాకిస్తాన్ దేశాన్ని తిట్టడం, నాగచైతన్య పాత్ర పాకిస్తాన్ పౌరులను పాకిస్తాన్ లోనే కొట్టడం, జైల్లో పాకిస్తాన్ ఖైదీలను చంపడం, ఇటువంటి సంఘటనలు, సన్నివేశాలు చూపించడం వలన ఇప్పటికే ఇరు దేశాల జైల్లో ఉంటున్న ఖైదీలు వారి కుటుంబాలపై ప్రభావం చూపవా..?
సినిమాని సినిమాగానే చూడాలని ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తేసంతోషం, ఆహ్వానమే కానీ దర్శకుడు ఇది సినిమా అని చెప్పలేదు, వాస్తవ కథ అని చెప్పాడు కదా, సో, ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టి తీసుకోవచ్చు ( పాకిస్తాన్ లో ఉర్దూ కాకుండా తెలుగు మాట్లాడటం లాంటివి) కానీ నిజం అనే మూలస్తంభం నుండి జారిపోకూడదు కదా?….
Share this Article