కొద్దిరోజులుగా ఓ విషాదగీతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది… గుండెల్ని మెలిపెట్టే పాట… నిజానికి చుట్టూ మనం రోజూ చూస్తున్న జీవితసత్యాలే… అల్లారుముద్దుగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుకుంటారు, అప్పోసొప్పో చేసి చదివిస్తారు, పెళ్లిళ్లు చేస్తారు, ఎగిరిపోయిన బిడ్డలు ఈ ముసలి పక్షుల్ని పట్టించుకోవు… రాలిపోతే ఓ చివరిచూపు, కట్టె మీద పెట్టి కట్టెను కాల్చేయడం… ఓ ఫోటో గోడ మీదకు ఎక్కుతుంది… ఎన్ని కథలో వింటున్నాం, చూస్తున్నాం…
ఎవరు ఈయన పాడింది..? ఇంతగా విషాదాన్ని పలికించిన రచన ఎవరిది..? అని వెతికితే పెద్దగా వివరాలు లేవు… కానీ పాత పాటే… యూట్యూబులో జాడలు కనిపించాయి… 2011లోనే పోస్ట్ చేసినట్టుగా ఉంది… వై.వెంకన్న అండ్ సాయిచంద్ అని కనిపిస్తోంది… రచయిత వెంకన్న కావచ్చు బహుశా… నిజానికి బాగా రికార్డు చేసి, సరిగ్గా ప్రజెంట్ చేస్తే ఇప్పుడు లక్షలాది మందిని కనెక్టయ్యే చాన్స్ ఉంది… ఆ లిరిక్ కూడా టెక్స్ట్ ఎవరూ అటెంప్ట్ చేయలేదు…
Ads
వింటూ కంపోజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, అక్షరీకరిస్తే నిజానికి ఆత్మానందమే… కానీ ఈ పాటను చదవొద్దు, కళ్లు మూసుకుని వినాలి… మీకు తెలిసిన ఎవరైనా ఒంటరి ముసలి పక్షుల్ని తలుచుకుంటూ వినండి… తనకు కొడుకైనా, బిడ్డయినా, కట్టె కాలిపోయేవరకూ ఇక నా చేతికర్రే, ఆ కర్ర రుణం ఎలా తీర్చుకోవాలి అని ఎవరైనా ముసలాయన ఎదురుగా నిలబడి పాడుతున్నట్టు ఊహించుకొండి… అంతే… బోలెడు పేరాలు చదవాల్సిన పనిలేదు… ఓ కన్నీటిబొట్టు చెంపలపైకి జారితే తుడిచేసుకోవద్దు… అది గుండెతడి, చెలియలికట్ట దాటుతోంది… అడ్డుకోకండి… ఇదీ పాత వీడియో…
Share this Article